Third wave ముప్పు: ‘ఆక్సిజన్‌’పై మోదీ సమీక్ష

తాజా వార్తలు

Updated : 09/07/2021 16:44 IST

Third wave ముప్పు: ‘ఆక్సిజన్‌’పై మోదీ సమీక్ష

దిల్లీ: దేశంలో మరికొద్ది నెలల్లో కరోనా మూడో దశ ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముప్పును ఎదుర్కొని వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఓవైపు వ్యాక్సినేషన్‌ను విస్తరిస్తూనే మరోవైపు కరోనా ఔషధాలు, ప్రాణవాయువు కొరత ఏర్పడకుండా ఇప్పటినుంచే ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగానే ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు మెడికల్‌ ఆక్సిజన్‌ నిల్వలు, సరఫరాపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

త్వరలో దేశవ్యాప్తంగా 1500 పీఎస్‌ఏ ఆక్సిజన్‌ ప్లాంట్లు రానున్నాయి. పీఎం-కేర్స్‌ సహకారంతో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రాణవాయువు లభ్యత, ప్లాంట్ల నిర్మాణంపై మోదీ నేడు సమీక్ష నిర్వహించారు. పీఎస్‌ఏ ఆక్సిజన్‌ ప్లాంట్లు అందుబాటులోకి వస్తే నాలుగు లక్షలకు పైగా ఆక్సిజనేటెడ్‌ పడకలకు ప్రాణవాయువు అందించేందుకు వీలవుతుందని అధికారులు మోదీకి వివరించారు. దీనికి ప్రధాని స్పందిస్తూ.. వీలైనంత త్వరగా ఈ ప్లాంట్లలో ఉత్పత్తి ప్రారంభమయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఆక్సిజన్‌ ఉత్పత్తి కేంద్రాల నిర్వహణపై ఆసుపత్రి సిబ్బందికి తగిన శిక్షణ ఇవ్వాలని ప్రధాని సూచించారు. వాటి పనితీరును ఎప్పటికప్పుడు తెలుసుకునేలా అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీని రూపొందించాలని తెలిపారు.

కరోనా రెండో దశ ఉద్ధృతి సమయంలో ప్రాణవాయువు కొరత ప్రధాన సమస్యగా మారిన విషయం తెలిసిందే. చాలా రాష్ట్రాల్లో ఆక్సిజన్‌ సరఫరా తగినంత లేక పెద్ద సంఖ్యలో కరోనా మరణాలు సంభవించాయి. ఆ సమయంలో అనేక దేశాలు భారత్‌కు ఆపన్నహస్తం అందించాయి. ఆక్సిజన్‌ ట్యాంకర్లు, ఇతర వైద్య సామగ్రిని పంపించాయి.

నిబంధనలపై నిర్లక్ష్యం వద్దు..

ఇదిలా ఉండగా.. గత కొద్ది రోజులుగా కొత్త కేసులు తగ్గుముఖం పట్టడంతో అనేక రాష్ట్రాలు ఆంక్షలను సడలించాయి. దీంతో ప్రజలు మళ్లీ నిబంధనలను గాలికొదిలి పెద్ద సంఖ్యలో గుమిగూడుతున్నారు. పర్యాటక ప్రాంతాలు, రద్దీ ప్రదేశాల్లో ఎవరూ మాస్క్‌లు ధరించట్లేదు. దీనిపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా ఉద్ధృతి తగ్గుముఖం పట్టినా.. దాని నుంచి ప్రమాదం ఇంకా పొంచి ఉందని, చిన్న పాటి నిర్లక్ష్యం కూడా తీవ్ర పరిణామాలకు దారితీస్తాయని హెచ్చరించారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని