‘రుద్రాక్ష’తో మరిన్ని వెలుగులు: మోదీ

తాజా వార్తలు

Published : 16/07/2021 01:42 IST

‘రుద్రాక్ష’తో మరిన్ని వెలుగులు: మోదీ

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌ పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ వారణాసిలోని రుద్రాక్ష కన్వెన్షన్‌ సెంటర్‌ను ప్రారంభించారు. గత 7 సంవత్సరాలుగా వారణాసిని అభివృద్ధి చేస్తున్నామని, తాజా నిర్మాణంతో కాశీ క్షేత్రం మరింతగా వెలుగులీనుతుందని తెలిపారు. అంతర్జాతీయ స్థాయి సమావేశాలు సైతం నిర్వహించుకొనేందుకు వీలుగా జపాన్‌ టెక్నాలజీతో ఈ నిర్మాణం చేపట్టారు. పర్యాటకులను, వ్యాపారవేత్తలను ఇది ఎంతగానో ఆకర్షిస్తుందని మోదీ తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు వీలుగా స్టేజీ, సౌండింగ్‌ సిస్టమ్‌ కూడా ఏర్పాటు చేశారన్నారు.

మోదీ సొంత నియోజకవర్గమైన వారణాసిలోని పోష్‌ సిగర ప్రాంతంలో 2.87 హెక్టార్ల విస్తీర్ణంలో రుద్రాక్ష కన్వెన్షన్‌ సెంటర్‌ను నిర్మించారు. రెండంతస్తుల భవనంలో 1,200 మంది కూర్చొనేందుకు వీలుగా తీర్చిదిద్దారు. భవన నిర్మాణంలో 108 రుద్రాక్షలను కూడా వినియోగించారు. అందుకే దీనికి రుద్రాక్ష అని పేరుపెట్టినట్లు తెలుస్తోంది. మొత్తం నిర్మాణం లింగాకృతిలో ఉండేలా డిజైన్‌ చేశారు. ప్రారంభోత్సవ సందర్భంగా నిర్మాణానికి సంబంధించిన వీడియోను కూడా ప్రధాని మోదీ సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.

గాంధీనగర్‌ రైల్వేష్టేషన్‌ను ప్రారంభించనున్న మోదీ

దేశంలోనే తొలిసారిగా అత్యాధునిక హంగులతో అధునీకరించిన గుజరాత్‌లోని గాంధీనగర్‌ రైల్వేస్టేషన్‌ను శుక్రవారం ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ప్రపంచస్థాయి ప్రయాణికులకు సదుపాయాలను ఏర్పాటు చేయడంతోపాటు రైల్వేస్టేషన్‌పై 5 నక్షత్రాల హోటల్ నిర్మాణం చేపట్టారు. గాంధీనగర్‌ రైల్వేస్టేషన్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ కంపెనీ, గుజరాత్‌ ప్రభుత్వం, భారత రైల్వే స్టేషన్‌ అభివృద్ధి కార్పొరేషన్ సంయుక్తంగా ఈ ఆధునీకరణ పనులు చేపట్టాయి. దీనికోసం 71.50కోట్లు వ్యయం చేశారు. రైల్వేస్టేషన్‌ ప్రవేశం, బయటకు వెళ్లే మార్గాల చుట్టూ అందంగా ముస్తాబు చేశారు. 163 కార్లు, 40 ఆటోలు, 120 ద్విచక్రవాహనాలు పార్కు చేసే సదుపాయం ఉంది. రైల్వేస్టేషన్‌లోని మూడు ప్లాట్‌ఫారాలను 2 సబ్‌వేలతో అనుసంధానించారు. ప్లాట్‌ఫారాలపై 480 మంది ప్రయాణికుల సామర్థ్యంతో నిరీక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. విశాలమైన టికెట్‌ కౌంటర్లు, దివ్యాంగుల కోసం ప్రత్యేక టికెట్‌ కౌంటర్లు నిర్మించారు. 




Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని