Lockdown: ఆంక్షల ఎత్తివేత మంచిదేనా..?

తాజా వార్తలు

Updated : 15/06/2021 18:54 IST

Lockdown: ఆంక్షల ఎత్తివేత మంచిదేనా..?

దిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. మరోవైపు కొవిడ్‌ బాధితుల మరణాల సంఖ్య తగ్గుతోంది. ఈ క్రమంలో చాలా రాష్ట్రాలు లాక్‌డౌన్‌ ఆంక్షలను క్రమంగా సడలిస్తూ వస్తున్నాయి. కరోనా మూడో దశ ముప్పు పొంచి ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న ఈ నిర్ణయాలు సమంజసమేనా..?

ముంబయి.. దేశానికి ఆర్థిక రాజధాని. కరోనా రెండోదశ వ్యాప్తితో తీవ్రంగా నష్టపోయింది. చిన్నపాటి వ్యాపారాలు, ఉద్యోగాలు చేసుకుంటూ జీవితం నెట్టుకొచ్చే చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అయితే గత మూడు నాలుగు వారాలుగా అక్కడ కేసుల సంఖ్య అనూహ్యంగా తగ్గిపోయింది. దానికి మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కఠిన చర్యలే కారణమని చెప్పడంలో సందేహం లేదు. అయితే కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుండటంతో అక్కడి ప్రభుత్వం ఆంక్షలను క్రమంగా సడలిస్తోంది. దీంతో ప్రజలకు ఎప్పటి లాగానే రోడ్ల మీదకు వస్తున్నారు. దీంతో మరింత ప్రమాదం పొంచి ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కేవలం మహారాష్ట్ర మాత్రమే కాదు.. పర్యాటక రాష్ట్రమైన హిమాచల్‌ ప్రదేశ్‌లోనూ పర్యాటకులకు అనుమతిస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా బుధవారం నుంచి చారిత్రక ప్రదేశాలు, మ్యూజియంలను తెరచుకునేందుకు అనుమతిచ్చింది. పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకలోనూ ఆంక్షలను క్రమంగా ఎత్తివేస్తామని అక్కడి ప్రభుత్వాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో ఊహించలేమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ ఆంక్షలు సడలించినప్పటికీ ఎప్పటి లాగేనా కరోనా నిబంధనలు పాటిస్తే కొంత వరకు ఉపయోగముంటుందని చెబుతున్నారు. కరోనా తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి కర్ఫ్యూ ఆంక్షలను కొనసాగించాలని సూచిస్తున్నారు.

ఆంక్షలు ఎప్పటి వరకు?

కరోనా మూడో దశ వ్యాప్తి పిల్లలపై ఎక్కువగా ప్రభావం చూపే అవకాశమున్నందున ముందు జాగ్రత్తగా ఏర్పాట్లు చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీలైతే ఈ ఏడాది చివరి వరకు లాక్‌డౌన్‌ను కొనసాగించడమే మేలని చెబుతున్నారు. ఈలోగా వీలైనంత ఎక్కువ మందికి వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలని, లేనిపక్షంలో కరోనా కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చేందుకు అస్కారముందని అంటున్నారు. అయితే కరోనా వ్యాప్తి ఇంకా ఎంతకాలం ఉంటుందన్న దానిపై ఒక అంచనాకు రాలేకపోతున్నారు. ఇది భౌగోళిక, వాతావరణ అంశాలతోపాటు వైరస్‌ వ్యాప్తి సామర్థ్యంపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. అందువల్లే కొన్ని ప్రాంతాల్లో మరణాల సంఖ్య ఎక్కువగా ఉంటోందని అంటున్నారు. కేసుల సంఖ్య తగ్గినంత మాత్రాన వైరస్‌ పూర్తిగా నశించినట్లు కాదని, అది అదునుచూసి దెబ్బ కొట్టకముందే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కనీసం 6 నెలల నుంచి ఏడాది వరకు కర్ఫ్యూలు, లాక్‌డౌన్‌ లాంటిని అమలు చేస్తేనే కరోనా కట్టడి సాధ్యమవుతుందని వారు అభిప్రాయపడుతున్నారు.

ఇప్పటికే బ్రిటన్‌, రష్యా లాంటి దేశాలు ఎదుర్కొన్నట్లుగానే భారత్‌లోనూ మూడో దశ వ్యాప్తి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కేంద్ర కొవిడ్‌ టాస్క్‌ ఫోర్సు సభ్యుడు డా. శ్రీవాత్సవ వెల్లడించారు. అయితే అది ఎంతమేర ప్రభావం చూపుతుందనేది వ్యాప్తి తీవ్రత, వ్యాక్సినేషన్‌పై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. టీకాలు వేయించుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉంటే సామాజిక వ్యాధి నిరోధకత (హెర్డ్‌ ఇమ్యూనిటీ) అభివృద్ధి చెంది వైరస్‌ ప్రభావం తగ్గవచ్చని ఆయన అన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని