
తాజా వార్తలు
కొవిడ్ టీకా వేయించుకున్న రాష్ట్రపతి
దిల్లీ: దేశంలో కరోనా మహమ్మారిని తరిమికొట్టే బృహత్తర కార్యక్రమంలో భాగంగా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం నిరాటంకంగా సాగుతోంది. ఇటీవలే రెండోదశ టీకా పంపిణీ ప్రారంభించగా.. దేశ ప్రథమ పౌరుడు, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ బుధవారం వ్యాక్సిన్ తొలిడోసు వేయించుకున్నారు. ఈ మధ్యాహ్నం దిల్లీలోని ఆర్మీ రీసెర్చి అండ్ రిఫరల్ ఆసుపత్రిలో ఆయన కొవిడ్ టీకా తీసుకున్నారు.
రాష్ట్రపతి వెంట ఆయన కుమార్తె కూడా వచ్చారు. ఈ ఫొటోలను రాష్ట్రపతి ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. చరిత్రలోనే అతిపెద్ద టీకా పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నందుకు వైద్యులు, నర్సులు, ఆరోగ్య కార్యకర్తలకు రామ్నాథ్ కోవింద్ కృతజ్ఞతలు తెలియజేశారు. అర్హులైన పౌరులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.
దేశవ్యాప్తంగా మార్చి 1 నుంచి రెండోదశ టీకా పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. 60ఏళ్ల పైబడిన, 45-59ఏళ్ల మధ్య వయస్కుల్లో దీర్ఘకాల వ్యాధిగ్రస్తులకు ఈ దశలో వ్యాక్సిన్ వేస్తున్నారు. గత సోమవారం ప్రధాని మోదీ తొలిడోసు టీకా తీసుకోగా.. ఆ తర్వాత పలువురు కేంద్రమంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ఇతర రాజకీయ, సినీ ప్రముఖులు టీకా వేయించుకున్నారు. కేరళ, గోవా ముఖ్యమంత్రులు పినరయి విజయన్, ప్రమోద్ సావంత్ నేడు టీకా తీసుకున్నారు.