రాంలీలా మైదాన్‌: 15రోజుల్లోనే 500 పడకల ఆస్పత్రిగా..!

తాజా వార్తలు

Published : 14/05/2021 22:32 IST

రాంలీలా మైదాన్‌: 15రోజుల్లోనే 500 పడకల ఆస్పత్రిగా..!

నిర్మాణానికి కృషిచేసిన వారందరికీ సెల్యూట్‌ - దిల్లీ సీఎం కేజ్రీవాల్‌

దిల్లీ: కరోనా వైరస్‌ మహమ్మారి ధాటికి దేశ రాజధాని నగరం వణికిపోతోంది. ఈ నేపథ్యంలో అక్కడి ఆసుపత్రుల్లో పడకల కొరత తీర్చేందుకు దిల్లీ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా నగరం నడిబొడ్డున ఉన్న రాంలీలా మైదానాన్ని 500 పడకల కొవిడ్‌ ఆసుపత్రిగా మార్చింది. భారీ సభలు, సమావేశాలకు కేంద్ర బిందువైన రాంలీలా మైదానాన్ని కేవలం 15 రోజుల్లోనే ఐసీయూ సదుపాయం కలిగిన వైద్య కేంద్రంగా మార్చడం పట్ల దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు సహకరించిన ఇంజనీర్లు, కార్మికులు, వైద్య సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.

15 రోజుల్లోనే ఆసుపత్రి ఏర్పాటు..!

దేశంలో సెకండ్‌ వేవ్‌ విజృంభణతో పలు రాష్ట్రాలు ఐసీయూ పడకల కొరత ఎదుర్కొంటున్నాయి. ఇదే సమయంలో మూడో ముప్పు (థర్డ్‌వేవ్‌) పొంచివుందన్న వార్తలతో పలు రాష్ట్రాలు అప్రమత్తమవుతున్నాయి. వీటిని అధిగమించేందుకు అరవింద్‌ కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆమ్‌ఆద్మీ ప్రభుత్వం, అందుబాటులో ఉన్న అన్ని వనరులను సద్వినియోగం చేసుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా రామ్‌లీలా మైదానంలో ఐసీయూ సదుపాయాలతో కూడిన తాత్కాలిక కొవిడ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీంతో యుద్ధప్రాతిపదిక పనులు చేపట్టిన ప్రభుత్వం.. కేవలం 15 రోజుల్లోనే ఆస్పత్రిని ఏర్పాటు చేసింది. తొలుత 250 పడకలు శనివారం (మే 15) నుంచి.. మిగతా 250 పడకలు మరో రెండు రోజుల్లోనే అందుబాటులోకి వస్తాయని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. ఈ ఆసుపత్రిని సందర్శించిన కేజ్రీవాల్‌.. కొవిడ్‌ బాధితులకు అందే వైద్య సదుపాయాలు, ఇతర ఏర్పాట్లను పరిశీలించారు.

ఇక దేశ రాజధానిలో అమలు చేస్తోన్న లాక్‌డౌన్‌ సత్ఫలితాలిస్తున్నట్లు దిల్లీ ప్రభుత్వం పేర్కొంది. గడిచిన 24గంటల్లో 8500 పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు తెలిపింది. దీంతో గతంలో 36శాతంగా ఉన్న కరోనా పాజిటివిటీ రేటు 12శాతానికి తగ్గినట్లు వెల్లడించింది. గడిచిన పది రోజుల్లోనే వివిధ ఆసుపత్రుల్లో 3వేల పడకలు ఖాళీ అయినట్లు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం దిల్లీలో ఆక్సిజన్‌ కొరత లేదని ఆయన స్పష్టం చేశారు. ఇదిలాఉంటే, కొవిడ్‌ మరణాలు కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ నిత్యం దాదాపు 300 మంది ప్రాణాలు కోల్పోతుండటం ఆందోళన కలిగిస్తోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని