క్వాడ్‌లో తొలిసారిగా దేశాధినేతల భేటీ!

తాజా వార్తలు

Updated : 10/03/2021 14:12 IST

క్వాడ్‌లో తొలిసారిగా దేశాధినేతల భేటీ!

వాషింగ్టన్‌: చతుర్భుజ దేశాల(క్వాడ్‌) కూటమి సదస్సులో భాగంగా శుక్రవారం తొలిసారిగా నాలుగు దేశాల అధినేతలు పాల్గొననున్నారని అమెరికా వెల్లడించింది. ఈ మేరకు శ్వేతసౌధం ప్రెస్‌ సెక్రటరీ జెన్‌సాకీ మంగళవారం తెలిపారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, భారత ప్రధాని నరేంద్రమోదీ, జపాన్‌ ప్రధాని సుగా, ఆస్ట్రేలియా ప్రధాని మోరిసన్‌.. క్వాడ్‌ సదస్సులో వర్చువల్‌గా సమావేశం కానున్నారని ఆమె వెల్లడించారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అతి ముఖ్యమైన సవాళ్లు కరోనాపై పోరు, ఆర్థిక సంక్షోభం, వాతావరణ మార్పు అంశాలపై ఆయా దేశాధినేతలు సదస్సులో చర్చించనున్నట్లు తెలిపింది.

‘బైడెన్‌ అధికారం చేపట్టాక క్వాడ్‌ వంటి బహుపాక్షిక సమావేశంలో పాల్గొనడం ఇదే తొలిసారి. దీన్నిబట్టి ఇండో-పసిఫిక్‌ భాగస్వామ్య దేశాలతో సహకారానికి అమెరికా ఇస్తున్న ప్రాధాన్యం స్పష్టమవుతోంది. ప్రపంచం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య కరోనాపై పోరు, వాతావరణ మార్పులపై దేశాధినేతలు ఈ సదస్సులో చర్చించనున్నారు’ అని జెన్‌ సాకీ తెలిపారు. అంతేకాకుండా వ్యాక్సిన్‌ తయారీ సామర్థ్యం పెంపులో భాగంగా క్వాడ్‌ దేశాల మధ్య ఆర్థిక పరమైన ఒప్పందాలు జరిగే అవకాశాలు ఉన్నాయని యూఎస్‌కు చెందిన ఓ సీనియర్‌ అధికారి వెల్లడించారు. క్వాడ్‌ కూటమి ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు తరచూ విదేశాంగ మంత్రుల స్థాయిలోనే సమావేశాలు జరిగాయి. ఇప్పుడు తొలిసారిగా నాలుగు దేశాల ఉన్నత స్థాయి నేతలు క్వాడ్‌ సమావేశాల్లో పాల్గొననుండటం విశేషం.

ఇప్పటికే మంగళవారం భారత ప్రధాని మోదీ, జపాన్‌ ప్రధాని సుగా షియోహిదేలు ఫోన్‌లో పలు అంశాలపై సంభాషించుకున్నారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలతో పాటు, ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో సహకారాన్ని పెంపొందించుకుందామని నిర్ణయించారు. వారిద్దరి మధ్య సంభాషణ సంతృప్తికరంగా సాగిందని మోదీ ట్విటర్‌ వేదికగా తెలియజేశారు. మయన్మార్‌ సంక్షోభం పట్లా ఇరు నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని