కిమ్‌ ఆంక్షలు.. రష్యా దౌత్యవేత్తల తిప్పలు 

తాజా వార్తలు

Updated : 27/02/2021 15:13 IST

కిమ్‌ ఆంక్షలు.. రష్యా దౌత్యవేత్తల తిప్పలు 

రైల్‌ ట్రాలీని తోసుకుంటూ వెళ్లిన రాయబారులు

మాస్కో: కరోనా మహమ్మారి కారణంగా ఉత్తరకొరియా అధినేత కిమ్‌ జోన్‌ ఉంగ్‌ తీసుకొచ్చిన ఆంక్షలు.. ఆ దేశంలోని రష్యా దౌత్యవేత్తలకు తిప్పలు తెచ్చిపెట్టాయి. స్వదేశానికి వెళ్లేందుకు రాకపోకలు లేకపోవడంతో వారంతా రైల్‌ ట్రాలీని తోసుకుంటూ సరిహద్దు దాటాల్సి వచ్చింది. అసలేం జరిగిందంటే..

గతేడాది జనవరిలో చైనాలో కరోనా మహమ్మారి బయటపడిన వెంటనే ఆ దేశానికి పొరుగున ఉన్న ఉత్తరకొరియా అప్రమత్తమైంది. సరిహద్దులను పూర్తిగా మూసేసి ఇతర దేశాలతో సంబంధాలు తెంచుకుంది. విమానాలు, రైళ్ల రాకపోకలను నిలిపివేసింది. దీంతో చాలా మంది విదేశీయులు ఉత్తరకొరియాలోనే ఉండిపోవాల్సి వచ్చింది. అలా చాలాకాలంగా ఆ దేశంలో ఉండిపోయిన ఎనిమిది మంది రష్యా దౌత్యవేత్తలు ఎట్టకేలకు తమ కుటుంబసభ్యులతో కలిసి స్వదేశానికి చేరుకున్నారు. అయితే ఇందుకోసం వారు చాలా కష్టమైన, సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి వచ్చిందట. 

వారంతా 32 గంటలు రైలు ప్రయాణం, రెండు గంటలు బస్సు ప్రయాణం చేసి ఉత్తరకొరియా - రష్యా సరిహద్దు సమీపానికి చేరుకున్నారు. అక్కడి నుంచి కిలోమీటరు దూరం రైల్‌ ట్రాలీని తోసుకుంటూ సరిహద్దు దాటి స్వదేశానికి చేరుకున్నట్లు రష్యా విదేశాంగ శాఖ వెల్లడించింది. దౌత్యవేత్తలు తమ పిల్లలను ట్రాలీలో కూర్చోబెట్టి, ముందుభాగంలో తమ లగేజీ పెట్టుకుని రైల్వే ట్రాక్‌పై తోసుకుంటూ వస్తున్న ఫొటోలను విదేశాంగశాఖ తమ ఫేస్‌బుక్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది. రష్యా భూభాగంలో అడుగుపెట్టిన తర్వాత విదేశాంగ శాఖ సిబ్బంది వారిని కలుసుకుని బస్సులో వ్లాదివోస్టక్‌ ఎయిర్‌పోర్టుకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి విమానంలో మాస్కో చేరుకున్నట్లు రష్యా వెల్లడించింది. 

కరోనా మహమ్మారి నేపథ్యంలో కఠిన ఆంక్షలు తీసుకొచ్చిన ఉత్తరకొరియా తమని తాము వైరస్‌ రహిత దేశంగా ప్రకటించుకుంది. అయితే ఆంక్షల వల్ల ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మరింత సంక్షోభంలో కూరుకుపోయినట్లు తెలుస్తోంది. Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని