One nation-One ration: జులై 31లోగా అమలు చేయాలి

తాజా వార్తలు

Published : 29/06/2021 23:01 IST

One nation-One ration: జులై 31లోగా అమలు చేయాలి

వలస కార్మికుల విషయంలో సుప్రీం ఆదేశం

దిల్లీ: కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన వలస కార్మికుల కోసం జులై 31లోగా ‘ఒకే దేశం.. ఒకే రేషన్‌ కార్డు’ పథకాన్ని అమలు చేయాలని మంగళవారం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దానిలో భాగంగా వలస కార్మికుల నమోదు కోసం పోర్టల్‌ను రూపొందించాలని కేంద్రానికి సూచించింది. దాంతో వలస కార్మికులు రేషన్ కార్డు ఉన్న సొంత రాష్ట్రాల్లోనే కాకుండా, వారు వలస వెళ్లిన మరో రాష్ట్రంలో కూడా రేషన్ పొందే వీలు ఉంటుంది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం మరికొన్ని ఆదేశాలు కూడా జారీ చేసింది. కరోనా మహమ్మారి ముగిసేవరకూ వలస జీవులకు రేషన్ ఇవ్వాలని.. కమ్యూనిటీ కిచెన్లను కొనసాగించాలని రాష్ట్రాలకు సూచించింది. అలాగే అసంఘటిత రంగానికి చెందిన కార్మికుల నమోదు కోసం రూపొందిస్తోన్న డేటాబేస్ ఆలస్యం కావడాన్ని కోర్టు తీవ్రంగా పరిగణించింది. జులై 31లోగా ఆ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది. వలస కార్మికుల కోసం ఆహార భద్రత, నగదు బదిలీ వంటి సంక్షేమ చర్యలు తీసుకునేలా చూడాలని వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీం ఈ సూచనలు చేసింది.

రెండు దఫాలుగా విజృంభించిన వైరస్‌ కట్టడికి విధిస్తోన్న లాక్‌డౌన్‌లు, ఆంక్షలు వలస కార్మికులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఉపాధి కోసం వలస వచ్చిన రాష్ట్రంలో రేషన్ పొందే విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉండగా.. కార్డులు లేని కార్మికులు ‘ప్రధాన్‌ మంత్రి గరీబ్‌ కల్యాణ్ యోజన’ కింద ఎలా లబ్ధి పొందుతారని సుప్రీం కేంద్రాన్ని ప్రశ్నించింది. ఈ పథకం కింద పేదలకు నవంబర్ వరకు ఆహార ధాన్యాలు అందనున్నాయి.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని