చైనా నుంచి యాంగూన్‌కు రహస్యంగా విమానాలు!

తాజా వార్తలు

Published : 28/02/2021 12:44 IST

చైనా నుంచి యాంగూన్‌కు రహస్యంగా విమానాలు!

మయన్మార్‌లో డ్రాగన్‌ కార్యకలాపాలు

దిల్లీ: ఒకవైపు తూర్పు లద్దాఖ్‌లో 9 నెలల పాటు సాగిన సైనిక ప్రతిష్టంభన తర్వాత బలగాల ఉపసంహరణ ఊరట కలిగిస్తున్నప్పటికీ.. పొరుగునున్న మయన్మార్‌లో గుట్టుచప్పుడు కాకుండా చైనా తన ప్రాబల్యాన్ని పెంచుకోవడం ఆందోళన కలిగిస్తోంది. అక్కడ సైన్యం.. అధికారాన్ని హస్తగతం చేసుకున్నప్పటి నుంచి డ్రాగన్‌ కదలికలు పెరుగుతున్నాయి. 

‘యాక్ట్‌ ఈస్ట్‌ పాలసీ’ (ఏఈపీ) విధానానికి భారత్‌ చాలా ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగా ఆగ్నేయాసియా, తూర్పు ఆసియా దేశాలతో సంబంధాల కోసం మయన్మార్‌ను కీలక వారధిగా ఉపయోగించుకుంటోంది. అలాంటి ప్రాంతంలో డ్రాగన్‌ పాగా వేయడం భారత్‌కు ఆందోళనకర పరిణామం. దక్షిణ చైనాలోని కున్మింగ్‌ నుంచి మయన్మార్‌లోని యాంగూన్‌కు రాత్రి వేళ విమానాలు రహస్యంగా ప్రయాణిస్తున్నట్లు ఆస్ట్రేలియా మేధోమథన సంస్థ తాజాగా పేర్కొంది. ప్రతి రాత్రి ఐదు చొప్పున విమానాలు తిరుగుతున్నాయని వివరించింది. వీటిలో అన్‌రిజిస్టర్డ్‌ సర్వీసులు కూడా ఉన్నాయని తెలిపింది. ఈ నెల 1న అక్కడ సైనిక తిరుగుబాటు తర్వాత ఈ పోకడ మొదలైందని వెల్లడించింది. చైనా బలగాలు, సైబర్‌ నిపుణులను ఈ విమానాల్లో చేరవేస్తుండొచ్చని పేర్కొంది. సమాచారం, ఇంటర్నెట్‌పై మయన్మార్‌ సైనిక పాలకులు గట్టి నియంత్రణ కలిగి ఉండేలా చూడటానికి వీరిని పంపుతుండొచ్చని తెలిపింది. మయన్మార్‌కు రహస్యంగా ఆయుధాలను చేరవేస్తుండొచ్చని కూడా అనుమానం వ్యక్తం చేసింది. అయితే ఈ వార్తలను చైనా అధికార పత్రిక ‘గ్లోబల్‌ టైమ్స్‌’ ఖండించింది. ‘‘అవన్నీ నిరాధార, వక్రీకరణలతో కూడిన కథనాలు. మయన్మార్‌లోని సైనిక పాలకులను చైనా రహస్యంగా సమర్థిస్తోందన్న భావన కలిగించేలా వీటిని రాశారు’’ అని ఆరోపించింది. 

భారత్‌కు సవాల్‌
మయన్మార్‌లో సైనిక తిరుగుబాటు భారత విదేశాంగ విధానానికి పెద్ద సవాల్‌ రువ్వుతోంది. సైనిక పాలకులను తీవ్రంగా విమర్శిస్తే వారు చైనా వైపు మొగ్గుతారన్న భావన ఉంది. దీనివల్ల ‘యాక్ట్‌ ఈస్ట్‌ పాలసీ’కి, అలాగే భారత ఈశాన్య ప్రాంతంలో ఉగ్రవాదుల ఏరివేత కార్యకలాపాలకూ ఇబ్బంది ఏర్పడుతుందని భావిస్తోంది. మరోవైపు మయన్మార్‌లో సైనిక తిరుగుబాటుపై అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ప్రజాస్వామ్య అనుకూల శక్తులకు కీలక మద్దతుదారు అయిన భారత్‌.. ఈ అంశంపై మౌనం వహింపజాలదు. ఈ నేపథ్యంలో ఒకింత ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటోంది.  


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని