మగువా.. భళా నీ తెగువ

తాజా వార్తలు

Published : 02/04/2021 22:07 IST

మగువా.. భళా నీ తెగువ

సైన్యంలోకి అడుగుపెట్టనున్న మహిళా సిపాయిలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత సైన్యంలో మరో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. ఇప్పటివరకు పురుషులకే పరిమితమైన ఈ విభాగంలో సత్తా చాటేందుకు వంద మంది మహిళా సిపాయిలు సిద్ధమయ్యారు. 61 వారాల కఠిన శిక్షణ పూర్తిచేసిన వారంతా మే 8న భారత సైన్యంలో చేరనున్నారు. పురుషులతో సమానంగా ఇచ్చిన శిక్షణలో అన్ని విభాగాల్లోనూ సత్తా చాటిన మహిళా జవాన్లు దేశ రక్షణకు సిద్ధమయ్యారు. కాప్స్‌ ఆఫ్ మిలటరీ పోలీస్‌ (సీఎంపీ)లో వీరు జవాన్లుగా బాధ్యతలు నిర్వహించనున్నారు. 

సీఎంపీలో వంద జవాన్‌ పోస్టులకు గతేడాది నోటిఫికేషన్ ఇవ్వగా 17 రాష్ట్రాల నుంచి దాదాపు 2 లక్షల మంది యువతులు దరఖాస్తు చేశారు. ఈ సంఖ్యను చూసి సైన్యాధికారులే ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అందులో వంద మందిని ఎంపిక చేసి వారికి పురుషులతో సమానంగా కఠిన శిక్షణ ఇచ్చారు. యువతుల కోసం ప్రత్యేకంగా శిక్షణా మాన్యువల్స్‌ను రూపొందించలేదని, పురుషులకు ఇచ్చిన శిక్షణే వారికీ ఇచ్చామని శిక్షణ అధికారి, లెఫ్టినెంట్ కల్నల్‌ జూలీ వెల్లడించారు. 61 వారాల పాటు సాగిన కఠిన శిక్షణను పూర్తి చేసి అన్ని విభాగాల్లోనూ సత్తా చాటిన వారంతా దేశ రక్షణకు సిద్ధమయ్యారు.

నేర విచారణను ఎలా చేపట్టాలి, కఠిన పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలి, సవాళ్లను ఎలా అధిగమించాలో శిక్షణలో నేర్చుకున్నారు. ఆటోమేటిక్‌ తుపాకులు, పిస్తోళ్ల వినియోగంలో రాటుదేలారు. శిక్షణకు ముందు కనీసం ద్విచక్రవాహనం నడపడమే రాని ఈ యువతులు ఇప్పుడు సైనికుల భారీ వాహనాలు, రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైకులను సునాయాసంగా నడుపుతున్నారు. ఈ వాహనాలను నడిపేందుకు వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.

వంద మంది మహిళా సిపాయిల్లో జాతీయ స్థాయి క్రీడాకారులు ఉన్నారు. కబడ్డీ, క్రికెట్‌, సైక్లింగ్‌ క్రీడల్లో వీరు దేశానికి ప్రాతినిథ్యం వహించారు. సైన్యంలో పనిచేయడం తమకు గర్వకారణమన్న మహిళా సిపాయిలు.. స్త్రీ, పురుషులు సమానమని సైన్యంలో పురుషులు చేసే అన్ని పనులు స్త్రీలు చేయగలరని పేర్కొన్నారు. మే 8న వీరిని దేశంలోని వివిధ ప్రాంతాల్లో నియమిస్తామని లెఫ్టినెంట్ కల్నల్‌ జూలీ వెల్లడించారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని