
తాజా వార్తలు
రామమందిరానికి వజ్రాల వ్యాపారుల భారీ విరాళాలు
సూరత్: అయోధ్యలోని రామ మందిర నిర్మాణానికి విరాళాలు పోటెత్తుతున్నాయి. ఆలయ నిర్మాణం కోసం రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్, విశ్వ హిందూ పరిషత్(వీహెచ్‌పీ) కలిసి శుక్రవారం నుంచి విరాళాల సేకరణ ప్రారంభించిన విషయం తెలిసిందే. దేశ ప్రథమ పౌరుడు రామ్‌నాథ్ కోవింద్ తొలి విరాళం ఇచ్చారు. కాగా.. వజ్రాల వ్యాపారానికి పెట్టింది పేరైన సూరత్‌లోని పలువురు వ్యాపారులు మందిర నిర్మాణం కోసం కోట్లలో విరాళాలివ్వడం విశేషం.
గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి గోవింద్ భాయ్ డోలాకియా.. ఆలయ నిర్మాణం కోసం రూ. 11 కోట్లు విరాళంగా ఇచ్చారు. శుక్రవారం స్థానిక విశ్వహిందూ పరిషత్ కార్యాలయానికి వెళ్లి చెక్కును అందజేశారు. ఆయనే కాదు.. సూరత్‌కు చెందిన మరో వ్యాపారి మహేశ్ కబూతర్‌వాలా రూ. 5కోట్లు, లవ్జీ బాద్షా రూ. కోటి విరాళమిచ్చారు.
సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని జనవరి 15 నుంచి విరాళాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రామ జన్మభూమి ట్రస్ట్ కోశాధికారి స్వామి గోవింద్ దేవ్ గిరి మహారాజ్, వీహెచ్‌పీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అలోక్ కుమార్ తదితరులు ఈ ఉదయం రాష్ట్రపతిని కలిశారు. ఈ సందర్భంగా రూ. 5,00,100 చెక్కును రామ్‌నాథ్ కోవింద్ విరాళంగా ఇచ్చారు. ఫిబ్రవరి 27 వరకు సాగే ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఐదు లక్షల గ్రామాల్లోని కోటి ఇళ్ల నుంచి విరాళాలు సేకరించనున్నట్లు ట్రస్ట్ తెలిపింది.
ఇవీ చదవండి..
రామమందిరానికి రాష్ట్రపతి విరాళం
మీ త్యాగాలకు భారతావని రుణపడి ఉంటుంది