Taiwan Vs China: తైవాన్‌ సైన్యంలో అ‘మెరిక’లు

తాజా వార్తలు

Updated : 11/10/2021 09:32 IST

Taiwan Vs China: తైవాన్‌ సైన్యంలో అ‘మెరిక’లు

రహస్యంగా కమాండోలను మోహరించిన అగ్రరాజ్యం 
చైనాను సమర్థంగా ఎదుర్కొనేందుకు నాడు ట్రంప్‌ వ్యూహం 
 ‘వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌’ తాజా కథనంలో వెల్లడి 

వాషింగ్టన్‌: తైవాన్‌ విషయంలో చైనా ఇటీవల దూకుడు పెంచింది. పదే పదే యుద్ధ విమానాలను పంపిస్తూ ఆ దేశాన్ని కవ్విస్తోంది. ఆక్రమణ సన్నాహాలూ చేస్తోంది! అయితే- ‘వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌’లో తాజాగా ప్రచురితమైన ఓ కథనం ఇప్పుడు డ్రాగన్‌కు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. బుల్లి దేశమైన తైవాన్‌పై సైనిక చర్యలకు దిగే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోక తప్పనిసరి పరిస్థితులను కల్పిస్తోంది. తైవాన్‌ సైన్యంలో అమెరికా కమాండోలు, మెరీన్‌ సిబ్బంది ఉన్నారని.. ఆ దేశ సైనికులకు అగ్రరాజ్య మిలిటరీ అధికారులు శిక్షణనిస్తున్నారని ఆ కథనంలో బయటపడటమే ఇందుకు కారణం. ‘వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌’ కథనం ప్రకారం.. అమెరికాకు చెందిన ఒక స్పెషల్‌ ఆపరేషన్స్‌ యూనిట్‌ సైనికులు (డజను మంది), ఒక గ్రూపు మెరీన్‌ సిబ్బంది దాదాపు ఏడాది నుంచి తైవాన్‌లో ఉంటున్నారు. అక్కడి సైనికులు, మెరీన్‌ సిబ్బందికి యుద్ధవ్యూహాలపై వారు శిక్షణ ఇస్తున్నారు. కొన్నేళ్లుగా దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్‌ దూకుడు పెంచడం, తైవాన్‌ గగనతల రక్షణ వ్యవస్థ పరిధిలోకి యుద్ధ విమానాలను పంపిస్తుండటం వంటి దౌర్జన్యపూరిత చర్యలకు ఉపక్రమిస్తుండటంతో.. తైవాన్‌కు అండగా నిలిచేందుకు అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ట్రంప్‌ వారిని అక్కడికి పంపించారు. 

గతవారం చైనాకు చెందిన 50కి పైగా యుద్ధ విమానాలు తైవాన్‌ గగనతల రక్షణ జోన్‌లోకి ప్రవేశించాయి. వాటిలో న్యూక్లియర్‌ బాంబర్లు కూడా ఉన్నాయి. కొన్నాళ్లపాటు తైవాన్‌ను కవ్వించి.. ఆపై తేలిగ్గా ఆక్రమణకు దిగొచ్చని చైనా ఇన్నాళ్లూ భావించింది. కానీ వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ కథనంతో దానికి పెద్ద షాక్‌ తగిలినట్లయింది. తైవాన్‌లోకి సైన్యాధికారులను పంపిన అంశంపై మాట్లాడేందుకు తాజాగా పెంటగాన్‌ తిరస్కరించింది. తైవాన్‌ కూడా పెదవి విప్పలేదు. ట్రంప్‌ హయాంలో పెంటగాన్‌లో పనిచేసిన క్రిస్టఫర్‌ మాయర్‌ మాత్రం.. తైవాన్‌కు సైన్యాన్ని పంపే ప్రతిపాదనను తాము బలంగా పరిశీలించామని పేర్కొన్నారు. 

అప్పటివరకు చైనాను అడ్డుకునేలా.. 

యుద్ధ సన్నద్ధత అనేది కేవలం గంటల్లో జరిగే పని కాదు. హఠాత్తుగా చోటుచేసుకునే దండయాత్రలను ఎదుర్కోవడం దాదాపు అసాధ్యం! దాడి జరిగినప్పుడు ప్రత్యర్థులను దిగ్భ్రాంతికి గురిచేయడం చాలా ముఖ్యం. చైనా-తైవాన్‌కు మధ్య దూరం కేవలం 150 కిలోమీటర్లే. చైనా దళాలు వాయు, జల మార్గాల్లో ఈ దూరాన్ని వేగంగా అధిగమించి తైవాన్‌లో ప్రవేశించడం అత్యంత తేలిక. జపాన్‌లోని ఓకినావాలో ఉన్న అమెరికా సైన్యం అక్కడికి చేరేలోపే చైనా ఆక్రమణ పూర్తయ్యే అవకాశాలుంటాయి. మరోవైపు- తైవాన్‌లో తమ సైన్యాన్ని నేరుగా ఉంచడం అమెరికాకు సాధ్యం కాదు. అలా చేస్తే చైనాతో వాణిజ్య సంబంధాలు దెబ్బతింటాయి. కాబట్టి తైవాన్‌ సైన్యాన్నే బలోపేతం చేస్తే.. వారే తొలి దాడిని సమర్థంగా ఎదుర్కొంటారు! మిత్రపక్షాలు రంగంలోకి దిగేందుకు తగినంత సమయం లభిస్తుంది. ఈ వ్యూహంతో ట్రంప్‌ తైవాన్‌కు తమ మిలిటరీ శిక్షకులను పంపించారు. కొందరు కమాండోలనూ రహస్యంగా అక్కడ మోహరించారు.

తర్వాత వచ్చేవారూ తైవాన్‌కు అండగా నిలిచేలా.. 

కమాండోలు, మిలిటరీ శిక్షకులను పంపడంతోనే ట్రంప్‌ ఆగిపోలేదు. తాను అధ్యక్ష పదవి నుంచి దిగిపోవడానికి కొన్ని రోజుల ముందు.. ఇండో-పసిఫిక్‌ వ్యూహ పత్రాన్ని విడుదల చేశారు. ఇందులో తైవాన్‌తో తమ సంబంధాలను, చైనాతో పొంచి ఉన్న ముప్పును సవివరంగా తెలియజేశారు. చైనాను సమర్థంగా ఎదుర్కొనేలా తైవాన్‌ను బలోపేతం చేయాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పారు. ఒకవేళ తాను ఎన్నికల్లో ఓడిపోయినా.. తర్వాత అధ్యక్ష బాధ్యతలను చేపట్టేవారూ తప్పనిసరిగా తైవాన్‌ను కాపాడాల్సిన పరిస్థితి కల్పించారు. ప్రస్తుతం బైడెన్‌ నేతృత్వంలోని సర్కారు ఈ వ్యూహంలో ఎలాంటి మార్పులూ చేయలేదు. మరోవైపు- తైవాన్‌ 2015 వరకూ తమ రక్షణ రంగాన్ని బాగా విస్మరించిందని, ప్రభావవంతమైన ఆయుధాలను కొనుగోలు చేయలేదని ట్రంప్‌ హయాంలో జాతీయ భద్రత డిప్యూటీ సలహాదారుగా పనిచేసిన మ్యాట్‌ పొటింగర్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ దేశం వద్ద ఉన్నవి.. చైనాతో యుద్ధం మొదలైన కొన్ని గంటల్లోనే ధ్వంసమవుతాయని అభిప్రాయపడ్డారు. చైనాను దీటుగా ఎదుర్కోవాలంటే తైవాన్‌ అత్యాధునిక నౌకా విధ్వంసక క్షిపణులు, స్మార్ట్‌ సీ మైన్స్‌లను కొనుగోలు చేయాలని సూచించారు. Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని