CIA Director met Taliban: తాలిబన్లతో CIA డైరెక్టర్‌ రహస్య మంతనాలు!

తాజా వార్తలు

Published : 25/08/2021 01:47 IST

CIA Director met Taliban: తాలిబన్లతో CIA డైరెక్టర్‌ రహస్య మంతనాలు!

అఫ్గాన్‌లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రంగంలోకి బైడెన్‌ ప్రతినిధులు

కాబుల్‌: అఫ్గానిస్థాన్‌ నుంచి అమెరికా సైనిక బలగాలు వైదొలగిన స్వల్ప కాలంలోనే ఎవరూ ఊహించని విధంగా తాలిబన్లు దేశం మొత్తం ఆక్రమించుకున్నారు. అనంతరం అక్కడ నెలకొన్న భయానక పరిస్థితులతో యావత్‌ ప్రపంచం ఆందోళన చెందుతోంది. ఈ నేపథ్యంలో అమెరికాలోని కేంద్ర నిఘా సంస్థ (సెంట్రల్‌ ఇంటలిజెన్స్‌ ఏజెన్సీ - CIA) డైరెక్టర్‌ తాలిబన్లతో రహస్య మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆగస్టు 31 డెడ్‌లైన్‌పైనే చర్చించినట్లు సమాచారం. అఫ్గాన్‌ను తాలిబన్లు ఆక్రమించిన తర్వాత వారితో దౌత్యపరంగా అత్యున్నత స్థాయిలో అమెరికా ప్రతినిధులు భేటీ జరగడం ఇదే తొలిసారి.

అమెరికా సెంట్రల్‌ ఇంటలిజెన్స్‌ ఏజెన్సీకి డైరెక్టర్‌గా ఉన్న విలియం బర్న్స్‌ సోమవారం తాలిబన్ల నేత అబ్దుల్‌ ఘనీ బారాదార్‌తో కాబుల్‌లో భేటీ అయినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అయితే, ఈ భేటీపై అటు వైట్‌హౌస్‌ కానీ, ఇటు సీఐఏ ప్రతినిధులు గానీ ఎటువంటి సమాచారం వెల్లడించలేదు. అఫ్గాన్‌లో చోటుచేసుకున్న ఉద్రిక్తతలను తగ్గించడంలో భాగంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌.. తాలిబన్లతో చర్చించేందుకు ఆ దేశ నిఘా సంస్థ డైరెక్టర్‌ను పంపించినట్లు అమెరికా వర్గాలు పేర్కొంటున్నాయి.

అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు వశం చేసుకున్న తర్వాత అక్కడ నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా వివిధ దేశాల పౌరులు, రాయబార కార్యాలయాల సిబ్బంది వారి స్వదేశాలకు తరలిపోతున్నారు. ఇందులో భాగంగా అమెరికా కూడా తమ పౌరులు, సిబ్బందిని భారీగా తరలిస్తోంది. ఈ నేపథ్యంలో అఫ్గాన్‌లో అమెరికా బలగాలకు ఆగస్టు 31 నాటికే డెడ్‌లైన్‌ విధిస్తున్నట్లు తాలిబన్‌ ప్రతినిధులు ప్రకటించడం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఇలాంటి వాతావరణంలో తాలిబన్లతో చర్చలు జరిపేందుకు అమెరికా రంగంలోకి దిగినట్లు సమాచారం. ఇందుకోసం సీఐఏ డైరెక్టర్‌గా ఉన్న దౌత్యవేత్త విలియం బర్న్స్‌ను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ రంగంలోకి దించినట్లు సమాచారం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని