Afghanistan: అఫ్గాన్‌ను ఒంటరిగా వదిలేస్తే.. ప్రపంచానికే ప్రమాదం..!

తాజా వార్తలు

Published : 10/09/2021 18:12 IST

Afghanistan: అఫ్గాన్‌ను ఒంటరిగా వదిలేస్తే.. ప్రపంచానికే ప్రమాదం..!

పాకిస్థాన్‌ విదేశాంగ మంత్రి షా మహ్మద్‌ ఖురేషీ

ఇస్లామాబాద్‌: తాలిబన్లు హస్తగతం చేసుకున్న అఫ్గానిస్థాన్‌ను అలాగే ఒంటరిగా వదిలేస్తే.. అక్కడి ప్రజలతో పాటు యావత్‌ ప్రపంచం తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పాకిస్థాన్‌ విదేశాంగ మంత్రి షా మహ్మద్‌ ఖురేషీ హెచ్చరించారు. అలాంటి ప్రమాదం రాకుండా ఉండేందుకు అంతర్జాతీయ సమాజం అఫ్గానిస్థాన్‌ వైపు సానుకూల విధానాన్ని అవలంబించాలని విజ్ఞప్తి చేశారు. పాకిస్థాన్‌ పర్యటనలో ఉన్న స్పెయిన్‌ విదేశాంగ మంత్రితో సమావేశమైన అనంతరం సంయుక్తంగా నిర్వహించిన విలేకర్ల సమావేశంలో షా మహ్మద్‌ ఈ పిలుపునిచ్చారు.

అఫ్గానిస్థాన్‌ను ఒంటరి చేయడం వల్ల అఫ్గాన్‌ ప్రజలే కాకుండా ఆ ప్రాంతం, యావత్‌ ప్రపంచం కూడా తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని.. అందుకే వారిపై ఒత్తిడి, బెదిరింపు చర్యలు, ఘర్షణ వాతావరణం పని చేయవని పాకిస్థాన్‌ విదేశాంగ మంత్రి షా మహ్మద్‌ ఖురేషీ వెల్లడించారు. అఫ్గానిస్థాన్‌ విషయంలో నూతన సానుకూల విధానాన్ని అనుసరించాలని హితవు పలికారు. ఈ నేపథ్యంలో అఫ్గానిస్థాన్‌లో నెలకొన్న వాస్తవ పరిస్థితులను అంతర్జాతీయ సమాజం గుర్తించాలని సూచించారు. శాంతిస్థాపనలో భాగంగా తాలిబన్లతో కలిసి పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా అఫ్గాన్‌లో నెలకొన్న మానవ సంక్షోభాన్ని నివారించడంపై ప్రపంచ దేశాలు దృష్టిపెట్టాలని సూచించారు. ఇందులో భాగంగా నిధుల సమీకరణ కోసం జెనీవాలో జరుగనున్న సమావేశం పట్ల పాక్‌ విదేశాంగ మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటే, అఫ్గానిస్థాన్‌లో ఉన్న తాజా పరిస్థితులతో దేశంలో 30శాతానికిపైగా పౌరులు నిత్యం కనీసం ఒకపూట భోజనం చేస్తున్నారో లేదో తెలియని పరిస్థితులు నెలకొన్నాయని ఐక్యరాజ్య సమితి ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో ప్రస్తుతమున్న ఆహార నిల్వలు కూడా ఈ నెలతోనే పూర్తిగా నిండుకునే ప్రమాదం ఉందని ఐరాస ఈమధ్యే హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అఫ్గాన్‌లో నెలకొన్న సంక్షోభం రానున్న రోజుల్లో ఓ విపత్తుగా మారకుండా ఆదుకునేందుకు అంతర్జాతీయ సమాజం ముందుకు రావాలని ఐరాస పిలుపునిచ్చింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని