Maha Covid: అలా చేస్తే మరోసారి లాక్‌డౌన్‌ తప్పదు..!

తాజా వార్తలు

Published : 16/08/2021 18:54 IST

Maha Covid: అలా చేస్తే మరోసారి లాక్‌డౌన్‌ తప్పదు..!

పరోక్షంగా హెచ్చరించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి

ముంబయి: కరోనా వైరస్‌ మహమ్మారిపై చేస్తోన్న పోరు స్వాతంత్ర్య సమరం వంటిదేనని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే అభిప్రాయపడ్డారు. ఒకవేళ ప్రజలు కొవిడ్‌ నిబంధనలు పాటించకుంటే, ఆంక్షల సడలింపు ఎత్తివేయడంతో పాటు లాక్‌డౌన్‌ విధించాల్సి వస్తుందని పరోక్షంగా హెచ్చరించారు. కరోనా వైరస్‌ను పూర్తిగా నియంత్రించేందుకు ప్రజలు కలిసికట్టుగా ముందుకు రావాల్సి ఉందని మహారాష్ట్ర సీఎం పిలుపునిచ్చారు.

‘ప్రస్తుతం కొవిడ్‌ ఆంక్షలను సడలిస్తున్నాం. ఈ సమయంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి. ఒకవేళ కేసుల సంఖ్య పెరిగితే.. మరోసారి లాక్‌డౌన్‌ విధించడం తప్ప మరో అవకాశం ఉండదు’ అని మహారాష్ట్ర ముఖ్యమంత్రి పేర్కొన్నారు. బాధితులకు అవసరమైన ఔషధాలు, వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నప్పటికీ.. ఆక్సిజన్‌ కొరత ఉందని వెల్లడించారు. ప్రస్తుతం ప్రతిఒక్కరినీ స్వాతంత్ర్యం రాకముందు నాటి పరిస్థితుల్లోకి కరోనా మహమ్మారి తీసుకువెళ్లిందని ఉద్ధవ్‌ ఠాక్రే గుర్తుచేశారు. నిత్యం లక్షల సంఖ్యలో వ్యాక్సిన్‌లు పంపిణీ చేస్తున్నప్పటికీ, వైరస్‌ ముప్పు తొలగిపోలేదని అన్నారు. కొత్త వేరియంట్లు పుట్టుకువస్తున్నాయని.. ఇటువంటివి దరిచేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఉద్ధవ్‌ ఠాక్రే సూచించారు.

ఇదిలాఉంటే, కరోనా వైరస్‌ కట్టడి చర్యల్లో భాగంగా మహారాష్ట్ర పలు రకాల ఆంక్షలను కొనసాగిస్తూనే ఉంది. వ్యాక్సిన్‌ తీసుకున్న వారికి ఆదివారం నుంచి లోకల్‌ రైళ్లలో సాధారణ ప్రయాణికులకు అనుమతి ఇస్తున్నారు. షాపింగ్‌ మాల్స్, రెస్టారెంట్లు, జిమ్‌, సెలూన్‌ ప్రదేశాల్లో పలు ఆంక్షలను కొనసాగిస్తున్నారు. బీచ్‌లతో పాటు పార్కులు, క్రీడామైదానాల్లో మాత్రం ఉదయం 6 నుంచి రాత్రి పదిగంటల వరకు బృహన్‌ముంబయి మునిసిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు అనుమతి ఇచ్చారు. ఇక ఆగస్టు 17 నుంచి పాఠశాలలు ప్రారంభించడంపై రాష్ట్రస్థాయిలో కొవిడ్‌ పరిస్థితులపై ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌ విముఖత చూపించింది. దీనిపై ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే త్వరలోనే తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని