Pegasus: ‘పెగాసస్‌’పై కేంద్ర రక్షణశాఖ కీలక ప్రకటన..!

తాజా వార్తలు

Published : 09/08/2021 17:14 IST

Pegasus: ‘పెగాసస్‌’పై కేంద్ర రక్షణశాఖ కీలక ప్రకటన..!

దిల్లీ: పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలను తీవ్రంగా కుదిపేస్తోన్న పెగాసస్‌తో ఫోన్ల హ్యాకింగ్‌ వ్యవహారంపై ఎట్టకేలకు కేంద్రం పెదవివిప్పింది. ఆ స్పైవేర్ తయారీ సంస్థ, ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌వో గ్రూప్‌తో తాము ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదని కేంద్ర రక్షణశాఖ సోమవారం రాజ్యసభలో కీలక ప్రకటన చేసింది.

ఎన్‌ఎస్‌వో గ్రూప్‌ టెక్నాలజీస్‌తో రక్షణశాఖకు ఏమైనా వ్యాపార లావాదేవీలు ఉన్నాయా..? అని సీపీఎం ఎంపీ వి. శివదాసన్‌ రాజ్యసభలో ప్రశ్నించారు. ఒకవేళ ఉంటే వాటి వివరాలు చెప్పాలని అడిగారు. ఇందుకు రక్షణశాఖ సహాయమంత్రి అజయ్‌ భట్‌ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ‘‘ఎన్‌ఎస్‌వో గ్రూప్‌తో రక్షణశాఖ ఎలాంటి లావాదేవీలు జరపలేదు’’ అని తెలిపారు. 

ఈ సంస్థ అభివృద్ధి చేసిన పెగాసస్‌ స్పైవేర్‌తో భారత్‌ సహా పలు దేశాలు ప్రముఖుల ఫోన్లపై నిఘా పెట్టినట్లు ఇటీవల సంచలన కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. ఈ స్పైవేర్‌ లక్షిత జాబితాలో భారత్‌కు చెందిన దాదాపు 300 మంది ఉన్నారని సదరు కథనాలు పేర్కొన్నాయి. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ సహా పలువురు రాజకీయ ప్రముఖులు, సీబీఐ అధికారులు,  జర్నలిస్టులు, హక్కుల కార్యకర్తల ఫోన్లను హ్యాక్‌ చేసినట్లు కథనాలు వచ్చాయి.

సరిగ్గా పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కావడానికి ఒక్క రోజు ముందు జులై 18న ఈ కథనాలు వెలువడ్డాయి. దీంతో ఈ అంశంపై ప్రతిపక్షాలు చర్చకు పట్టుబడుతూ ఉభయసభల్లో ఆందోళనలు చేస్తున్నాయి. ఈ క్రమంలో పార్లమెంట్‌ ఉభయసభల్లో చర్చలకు ఆస్కారం లేకుండా వాయిదాల పర్వం కొనసాగుతోంది. 

మరోవైపు పెగాసస్‌ కథనాలను కేంద్రం కొట్టిపారేసింది. భారత ప్రజాస్వామ్యానికి చెడ్డపేరు తేవడమే లక్ష్యంగా కొందరు ఉద్దేశపూర్వకంగా చేసిన ఆరోపణలే అని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ అన్నారు. భారత్‌లో అనధికారిక నిఘా సాధ్యం కాదని, ఇక్కడ చట్టాలు చాలా పటిష్టంగా ఉన్నాయని పేర్కొన్నారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం దీనిపై పార్లమెంటరీ స్థాయి దర్యాప్తునకు డిమాండ్‌ చేస్తున్నాయి. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని