SC: ఐదింటిలోగా ఆయన్ను విడుదల చేయండి

తాజా వార్తలు

Published : 19/07/2021 14:01 IST

SC: ఐదింటిలోగా ఆయన్ను విడుదల చేయండి

రాజద్రోహం కేసులో కేంద్రానికి సుప్రీం ఆదేశం

దిల్లీ: జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టయిన ఆందోళనకారుడు లీచోంబం ఎరెండ్రోను విడుదల చేయాలని సోమవారం కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. అందుకు ఈ రోజు సాయంత్రం ఐదు గంటలవరకు గడువు ఇచ్చింది. రాజద్రోహం చట్టంపై సుప్రీం స్పందించిన వేళ.. ఈ తీర్పు వెలువడటం గమనార్హం.

మణిపూర్‌కు చెందిన ఎరెండ్రో ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టి ప్రభుత్వ ఆగ్రహానికి గురయ్యారు. దాంతో రాజద్రోహం కింద ప్రభుత్వం మేలో ఆయన్ను అదుపులోకి తీసుకుంది. ఈ నిర్బంధాన్ని వ్యతిరేకిస్తూ ఆయన తండ్రి సుప్రీంలో పిటిషన్‌ వేశారు. దాన్ని విచారించిన ధర్మాసనం.. నెలల పాటు ఆయన్ను నిర్బంధించి ఉంచడం జీవించే హక్కు, స్వేచ్ఛను ఉల్లఘించడం కిందికే వస్తుందని వ్యాఖ్యానించింది. ఈ రోజు సాయంత్రం ఐదు గంటలలోగా ఆయన్ను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

మణిపూర్‌కు చెందిన అప్పటి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సైఖోమ్ టికేంద్ర సింగ్ కరోనాతో మృతి చెందారు. దానిపై ఎరెండ్రో ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టారు. ఆవు పేడ, మూత్రం పనిచేయవంటూ దాంట్లో రాసుకొచ్చారు. దీనిపై అక్కడి భాజపా నేత ఒకరు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎరెండ్రోతో పాటు ఒక పాత్రికేయుడిని పోలీసులు అరెస్టు చేశారు.

ఇదిలా ఉండగా.. ఇటీవల రాజద్రోహం చట్టంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రాజద్రోహం ఓ వలస చట్టమని, స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏళ్ల తర్వాత కూడా ఈ చట్టం అవసరమా? అని కేంద్రాన్ని ప్రశ్నించింది. దీని చెల్లుబాటుపై సమాధానం ఇవ్వాలని కేంద్రానికి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని