Supreme Court: ఇక మేం చేతులెత్తేయాల్సిందే

తాజా వార్తలు

Updated : 21/07/2021 09:37 IST

Supreme Court: ఇక మేం చేతులెత్తేయాల్సిందే

నేరచరితుల ఏరివేతపై సుప్రీం

దిల్లీ: ‘ఎన్నికల్లో నేరచరితుల ఏరివేతపై మేమూ చేతులు ఎత్తేయాల్సిందే’ అని సుప్రీంకోర్టు పెదవి విరిచింది. ఈ విషయంలో ఇదివరకు ఇచ్చిన తీర్పును తూ.చ. తప్పకుండా ఆచరించడంలో రాజకీయ పార్టీల అలసత్వాన్ని తప్పుపట్టింది. 2020 ఫిబ్రవరి 13న ఇచ్చిన ఆదేశాలను అమలు చేయనందుకు పార్టీలపై కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టాలంటూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్‌ ఆర్‌.ఎఫ్‌.నారీమన్‌, జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌ల ధర్మాసనం మంగళవారం ఈ వ్యాఖ్యలు చేసి, తీర్పును వాయిదా వేసింది. అభ్యర్థుల్ని ఎంపికచేసిన 48 గంటల్లోగా, లేదా తొలిదశ నామినేషన్ల దాఖలుకు కనీసం రెండు వారాల్లోగా అభ్యర్థుల నేర చరిత్రను బహిర్గతం చేయాలని సుప్రీంకోర్టు ఇదివరకు ఆదేశాలిచ్చింది. గత ఏడాది జరిగిన బిహార్‌ ఎన్నికల్లో ఈ ఆదేశాలను అమలు చేయలేకపోవడానికి దారితీసిన పరిస్థితుల్ని ఈసీ తరఫు న్యాయవాది వివరించారు. అభ్యర్థుల్ని చివరి క్షణంలో ప్రకటించడం వంటివి కారణాలుగా నివేదించారు. ఆ ఎన్నికల్లో 469 మంది నేరచరితులైన అభ్యర్థుల్ని పది పార్టీలు నిలబెట్టాయని చెప్పారు. నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున కపిల్‌ సిబల్‌ వాదనలు వినిపించారు. ఎన్నికల సంఘం ఆదేశాలను రాజకీయ పార్టీలు బాహాటంగానే ధిక్కరిస్తున్నాయని, అలాంటి పార్టీలు తగిన పర్యవసానాలను ఎదుర్కోవాల్సిందేనని చెప్పారు. ఈ పరిస్థితిని సరిచేయాల్సింది ఎవరు అనే ప్రశ్నలూ తలెత్తుతున్నాయన్నారు. అలాగైతే దీనిని ఏడుగురు న్యాయమూర్తుల విస్తృత ధర్మాసనానికి నివేదించే అంశాన్ని తాము పరిశీలిస్తామని న్యాయమూర్తులు చెప్పారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని