WHO: ఎక్కడా ముగింపునకు రాని మహమ్మారి

తాజా వార్తలు

Updated : 16/07/2021 13:09 IST

WHO: ఎక్కడా ముగింపునకు రాని మహమ్మారి

జెనీవా: కరోనా వేరియంట్ల విజృంభణ, ప్రపంచ వ్యాప్తంగా కొత్త కేసులు, మరణాల పెరుగుదలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కొత్త రకాల వ్యాప్తి మహమ్మారిని నిలువరించడాన్ని క్లిష్టతరం చేస్తోందని వెల్లడించింది. ‘ఏ దేశంలోనూ మహమ్మారి ముగింపునకు రాలేదు. కొత్త, ప్రమాదకరమైన వేరియంట్లు వైరస్ ఉద్ధృతికి దోహదం చేస్తున్నాయి. వాటిని నియంత్రించడం సవాలుగా మారొచ్చు’ అంటూ హెచ్చరించింది.

ఇదిలా ఉండగా.. క్రీడా టోర్నీలు కరోనా విజృంభణకు ఆజ్యం పోస్తున్నాయి. యూరోకప్‌ కారణంగా బ్రిటన్‌లో కేసులు పెరుగుతున్న విషయాన్ని ఇటీవల కేంద్రం ప్రస్తావించిన సంగతి  తెలిసిందే. ఒలింపిక్స్ వేదిక అయిన జపాన్‌ నగరం టోక్యోలో జనవరి తర్వాత అత్యధిక స్థాయిలో కేసులు వెలుగుచూస్తున్నాయి. తాజాగా అక్కడ 1,308 మందికి కరోనా సోకినట్లు అధికారులు వెల్లడించారు. మరో వారం రోజుల్లో ఈ ప్రతిష్ఠాత్మక క్రీడలు ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఒక అథ్లెట్, ఐదుగురు ఒలింపిక్స్‌ సిబ్బందికి వైరస్ సోకినట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఇప్పటికే బ్రెజిల్, రష్యా క్రీడా బృందాలకు చెందిన సిబ్బంది మహమ్మారి బారినపడ్డారు. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ వేళ.. టీమిండియాకు చెందిన ఆటగాడు రిషభ్‌ పంత్‌కు పాజిటివ్‌గా తేలిన సంగతి తెలిసిందే.

ఆఫ్రికాలో పెరుగుతున్న మరణాలు..

వైద్య సదుపాయాల కొరత, తగినన్ని టీకాల లభ్యత లేని దేశాలు కరోనా కారణంగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా ఆఫ్రికా దేశాల్లో ఈ పరిస్థితి దారుణంగా ఉంది. రువాండా ప్రభుత్వం..  రాజధాని నగరం, మరో ఎనిమిది ప్రాంతాల్లో ఈ శనివారం నుంచి లాక్‌డౌన్ విధించనుంది. గతంలో కఠిన ఆంక్షల ద్వారా ఈ దేశం కరోనాను నియంత్రించగలిగింది. కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితి అదుపుతప్పింది. పడకలు, ఔషధాల కొరతతో వైద్యవ్యవస్థ తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటోంది. వారం వ్యవధిలో ఈ ఖండంలో వైరస్ మరణాలు 43 శాతం పెరిగాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఐసీయూ, ఆక్సిజన్ కొరత కారణంగా మరణాల సంఖ్య ఎక్కువైనట్లు తెలిపింది.

వైరస్‌తో ఇండోనేసియా ఉక్కిరిబిక్కిరి..

భారత్ తర్వాత మరో ఆసియా దేశం ఇండోనేసియాను మహమ్మారి చుట్టేస్తోంది. ఆ దేశంలో కొత్తగా 56,757 కేసులు వెలుగుచూశాయి. జనాభా పరంగా నాలుగో స్థానంలో ఉన్న ఈ దేశంలో వైరస్ వ్యాప్తి భారత్‌ను అధిగమించిందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఉద్ధృతిని ఎదుర్కొనేందుకు చైనాకు చెందిన ఆసియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ 500 మిలియన్ డాలర్ల రుణాన్ని మంజూరు చేసింది. మరోపక్క ఇప్పటికే సైనిక తిరుగుబాటుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న మయన్మార్ ప్రజలకు కరోనా కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. అతి పెద్ద నగరమైన యంగూన్‌లో ఆక్సిజన్ కొరత వేధిస్తోంది.

ఇదిలా ఉండగా..కరోనా పుట్టుకపై మరోసారి శోధించేందుకు సహకరించాలని ఆరోగ్య సంస్థ చైనాకు సూచించింది. మహమ్మారి వుహాన్‌ ల్యాబ్ నుంచి లీకైందనే వాదనను కొట్టిపారేయడం తొందరపాటే అవుతుందని, మూలాలపై పరిశోధన జరగాలని వ్యాఖ్యానించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని