ముంబయి ‘ఆరే’ వివాదంపై.. ఠాక్రే కీలక నిర్ణయం!

తాజా వార్తలు

Published : 12/10/2020 01:12 IST

ముంబయి ‘ఆరే’ వివాదంపై.. ఠాక్రే కీలక నిర్ణయం!

ముంబయి: మహారాష్ట్ర రాజధాని ముంబయిలో గతేడాది సంచలనం సృష్టించిన ‘ఆరే’ అటవీ ప్రాంత వివాదానికి తెరపడింది. దాదాపు 800 ఎకరాల్లో విస్తరించి ఉన్న లక్షల చెట్లను కాపాడేందుకు ఉద్ధవ్‌ ఠాక్రే ప్రభుత్వం మొగ్గుచూపింది. ముంబయి నగరానికి పచ్చటి పర్యావరణాన్ని అందిస్తున్న ఆరే ప్రాంతాన్ని రిజర్వు ఫారెస్ట్‌గా ప్రకటిస్తూ మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే నిర్ణయం తీసుకున్నారు. అక్కడ ఏర్పాటు చేయాలనుకున్న ముంబయి మెట్రో కార్ల షెడ్డును కంజుర్‌మార్గ్‌కు తరలిస్తూ సీఎం ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా గతేడాది ఈ చెట్లను నరికివేయకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టిన పర్యావరణ కార్యకర్తలపై కేసులను సైతం ఎత్తేసేందుకు పోలీసులకు ఆదేశాలు జారీచేశారు. ఇప్పటికే ఈ విషయంపై పర్యావరణ మంత్రి ఆదిత్యఠాక్రే స్పందిస్తూ.. పర్యావరణ కార్యకర్తలు భూమి భవిష్యత్తు కోసం విలువైన పోరాటం చేశారని అభినందించారు.

ముంబయి నగరంలోని ఆరే ప్రాంతంలో మెట్రో కార్ల షెడ్డును నిర్మించేందుకు అక్కడ ఉన్న లక్షలాది చెట్లను తొలగించేందుకు గత ప్రభుత్వం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దీంతో అప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న భాజపా ప్రభుత్వానికి పర్యావరణ కార్యకర్తల నుంచి నిరసన సెగ వెల్లువెత్తింది. అయినప్పటికీ అప్పటి ప్రభుత్వం ససేమిరా అంటూ చెట్ల నరికివేతకు మొగ్గు చూపింది. అర్ధరాత్రి వేళ చెట్లను తొలగించేందుకు ఆరే ప్రాంతానికి వెళ్లగా పలువురు పర్యావరణ కార్యకర్తలు అందుకు అడ్డుపడ్డారు. దీంతో వారిపై కేసులు నమోదు చేశారు. ఆ సమయంలో ఎన్డీయే కూటమిలో ఉన్న శివసేన సైతం ఆరే విషయంలో ప్రభుత్వ తీరును ఖండించింది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని