యూపీలో వ్యవస్థలు కుప్పకూలాయ్‌!

తాజా వార్తలు

Published : 12/07/2021 23:26 IST

యూపీలో వ్యవస్థలు కుప్పకూలాయ్‌!

యోగి సర్కార్‌పై మాజీ సివిల్‌ సర్వీసెస్‌ అధికారుల అసంతృప్తి

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వంపై సివిల్‌ సర్వీసెస్‌ మాజీ ఉన్నతాధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ రాష్ట్రంలో పాలనా వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందని ఆరోపించారు. ఏకంగా ప్రభుత్వమే చట్టాన్ని ఉల్లంఘిస్తోందన్నారు. ఈ మేరకు దాదాపు 80 మంది మాజీ ఉన్నతాధికారులు బహిరంగ లేఖ రాశారు. వీరి వాదనకు మద్దతు తెలుపుతూ వివిధ రంగాలకు చెందిన మరో 200 మంది లేఖపై సంతకం చేశారు.

రాష్ట్రంలో శాసన, కార్యనిర్వాహక, పోలీసు వ్యవస్థలు పూర్తిగా కుప్పకూలిపోయాయని అధికారులు లేఖలో ఆరోపించారు. అనేక చట్టాల్ని దుర్వినియోగం చేస్తూ కొన్ని వర్గాలను లక్ష్యంగా చేసుకొని వేధిస్తున్నారన్నారు. ప్రభుత్వానికి, అధికార పక్షానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసే వారిని అణచివేయడం సర్వసాధారణమైపోయిందన్నారు. అందుకు నిర్బంధాలు, నేరాభియోగాలు మోపడం సాధనాలుగా మారాయన్నారు. జాతీయ భద్రతా చట్టాన్ని(ఎన్‌ఎస్‌ఏ) అడ్డం పెట్టుకొని అనేక మందిని ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. అలాగే కొవిడ్‌-19ను సమర్థంగా ఎదుర్కోవడంలోనూ ప్రభుత్వం విఫలమైందన్నారు. పైగా మహమ్మారి వ్యాప్తికి కారణమైన కార్యక్రమాలను ప్రభుత్వమే సమర్థించిందని ఆరోపించారు. ఈ ఆరోపణలకు సంబంధించి అనేక మంది పేర్లను, ఉదంతాలను లేఖలో ఉటంకించారు.

వీటన్నింటిని బట్టి చూస్తే యూపీలో ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలకు రోజురోజుకీ దూరమయ్యే పాలనా విధానాలను అవలంబిస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతోందని లేఖలో మాజీ అధికారులు ఆరోపించారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచి సమాజంలోని కొన్ని వర్గాలనే లక్ష్యంగా చేసుకొని ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. వచ్చే ఏడాది రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు. లేదంటే సమాజంలో విద్వేషాలు చెలరేగి తీవ్ర పరిణామాలకు దారి తీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అలాగే ప్రజాస్వామ్య వ్యవస్థ కుప్పకూలే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. తమకు ఏ రాజకీయ పార్టీతో సంబంధాలు లేవని.. కేవలం రాజ్యాంగ పరిరక్షణకే ఈ సూచనలు చేస్తున్నామన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని