మహారాష్ట్రలో కరోనా పరిస్థితి తీవ్రం: ఉద్ధవ్‌ ఠాక్రే

తాజా వార్తలు

Published : 22/02/2021 00:20 IST

మహారాష్ట్రలో కరోనా పరిస్థితి తీవ్రం: ఉద్ధవ్‌ ఠాక్రే

ముంబయి: మహారాష్ట్రలో కరోనా పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్‌ఠాక్రే ప్రకటించారు. రాబోయే రెండు వారాల్లో కరోనా కేసులు పెరిగితే మళ్లీ లాక్‌డౌన్‌ పెట్టనున్నట్లు తెలిపారు. వర్చువల్‌ విధానంలో జరిగిన సమావేశంలో సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే మాట్లాడారు. రోజూవారి కేసుల్లో కరోనా ఉద్ధృతిని గమనించడానికి 8 నుంచి 15 రోజులు పడుతుందన్నారు. లాక్‌డౌన్‌ పెట్టకుండా ఉండేందుకు కరోనా వైరస్‌ మార్గదర్శకాలను ప్రజలు అనుసరించాలని సీఎం సూచించారు.

తగ్గుముఖం పడుతున్నట్లే కనిపించిన కరోనా మహమ్మారి కొన్నిరోజులుగా మహారాష్ట్రలో మళ్లీ విజృంభిస్తోంది. దీంతో ఆరాష్ట్ర ప్రభుత్వం పలుప్రాంతాల్లో ఆంక్షలు విధిస్తోంది. తాజాగా అమరావతిలో వారం రోజులపాటు లాక్‌డౌన్‌ విధించారు. ఈ సందర్భంగా ఉద్ధవ్‌ ఠాక్రే ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘మనకు లాక్‌డౌన్‌ కావాలా? మీరు బాధ్యతాయుతంగా కరోనా నిబంధనలను పాటిస్తే మరో ఎనిమిది రోజుల్లో తెలుస్తుంది. లాక్‌డౌన్‌ వద్దని అనుకుంటున్నవాళ్లు మాస్కు ధరిస్తారు. కావాలనుకుంటున్నవాళ్లు మాస్కులు ధరించరు, కాబట్టి అందరూ మాస్క్‌ ధరించి లాక్‌డౌన్‌కు నో చెప్పండని’ ప్రజలకు సీఎం సూచించారు. ఇది కరోనా ఉద్ధృతి రెండో వేవ్‌ అని తెలుసుకోవడానికి రాబోయే 8 నుంచి 15 రోజుల్లో తెలుస్తుందన్నారు. 

దేశంలో అత్యధికంగా కరోనా కేసులు, మరణాలు నమోదైనా మహారాష్ట్రలో కొన్ని నెలల నుంచి కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. మూడు నెలల విరామం అనంతరం మహారాష్ట్రలో అత్యధికంగా శుక్రవారం ఒక్కరోజే 6,000 కేసులు నమోదు కాగా, శనివారం 6,971 కేసులు నమోదు అయ్యాయి. 35 కరోనా మరణాలు సంభవించాయి. కొన్నిరోజుల క్రితం వరకు రోజూవారి కేసుల సంఖ్య 2,000 నుంచి 2,500 మధ్య ఉండేది. తాజాగా కరోనా కేసుల సంఖ్య 6 వేలను దాటింది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని