Delta Variant: ‘డెల్టా’తో పెరుగుతోన్న రీఇన్​ఫెక్షన్​ ముప్పు!

తాజా వార్తలు

Published : 25/07/2021 01:22 IST

Delta Variant: ‘డెల్టా’తో పెరుగుతోన్న రీఇన్​ఫెక్షన్​ ముప్పు!

బ్రిటన్‌లో భారీగా పెరుగుతున్న కొత్త కేసులు

లండన్‌: డెల్టా వేరియంట్.. ప్రస్తుతం ప్రపంచాన్ని కలవరపెడుతోన్న కరోనా రకం. పలు దేశాల్లో ఈ వేరియంట్‌​ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. విస్తృతంగా వ్యాపిస్తున్న డెల్టా వేరియంట్‌ కారణంగా రీఇన్‌ఫెక్షన్‌ బారిన పడే ప్రమాదం అధికంగా ఉందని బ్రిటన్‌ ప్రభుత్వం ఆ దేశ ప్రజలను హెచ్చరించింది​. అప్రమత్తంగా ఉండాలని, కచ్చితంగా వ్యాక్సిన్​ రెండు డోసులు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.

కొవిడ్​ బారినపడి కోలుకున్న వారిలోనూ.. డెల్టా వేరియంట్ కారణంగా రెండోసారి వైరస్​ సోకే ప్రమాదం ఉందని బ్రిటన్​ ఆరోగ్య అధికారులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ఈ వేరియంట్‌పై పరిశోధనలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఇంగ్లాండ్​ ప్రజారోగ్య విభాగం అధికారి మాట్లాడుతూ.. ‘ఆల్ఫాతో పోలిస్తే డెల్టాతో రెండోసారి వైరస్​ సోకే ప్రమాదం ఎక్కువ. దానిని త్వరగా గుర్తించేందుకు మా విధానాలను ఆధునికీకరించాం. జాతీయ నిఘా విశ్లేషణలో వయసు, టీకా పంపిణీ వంటి వాటిని చేర్చాం. వైరస్​ రీఇన్​ఫెక్షన్​ ముప్పును డెల్టా రకం పెంచుతోందని గుర్తించాం. దీనిపై మరింత పరిశోధనలు కొనసాగిస్తున్నాం.’ అని పేర్కొన్నారు.

ఇంగ్లాండ్​లో అన్ని వేరియంట్లపై వారం రోజులకోసారి పరిశీలన చేస్తోంది అక్కడి ప్రజారోగ్య శాఖ. గత వారంలో 33,716 డెల్టా కేసులు పెరిగాయని.. దాంతో దేశంలో మొత్తం డెల్టా కేసుల సంఖ్య 2,86,765 చేరినట్లు తెలిపింది. అలాగే.. ఏప్రిల్​-జూన్​ మధ్యలో నమోదైన 68,688 డెల్టా కేసుల్లో 897 మందికి రెండోసారి వైరస్​ సోకినట్లు వివరించింది. ఇటీవల ఆసుపత్రుల్లో చేరిన వారిలో 3,692 మంది డెల్టా బారినపడ్డారు. అందులో 2,152 (58.3 శాతం) వ్యాక్సిన్​ తీసుకోనివారే. టీకా తీసుకోవటం ఎంత ముఖ్యమో ఈ డేటానే చెబుతోందని యూకే ఆరోగ్య శాఖ పేర్కొంది. ఒక్క డోసు కన్నా రెండు డోసులు మరింత సమర్థంగా పనిచేస్తుందని తెలిపింది. వీలైనంత త్వరగా రెండో డోసు కూడా తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.

ప్రజారోగ్య శాఖ మరో వేరియంట్​ బి.1.621ను గుర్తించింది. దానిని వేరియంట్​ అండర్​ ఇన్వెస్టిగేషన్​(వీయూఐ)గా పేర్కొంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 16 బి.1.621 వేరియంట్​ కేసులు నమోదైనట్లు తెలిపింది. అందులో చాలా వరకు విదేశీ ప్రయాణికులేనని వెల్లడించింది. యూకేలో ప్రస్తుతానికి కమ్యూనిటీ ట్రాన్స్​మిషన్​ లేదని తెలిపింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని