Vaccine: టీకా తీసుకోనివారితో.. ఇతరులకూ ముప్పే!

తాజా వార్తలు

Published : 04/07/2021 17:10 IST

Vaccine: టీకా తీసుకోనివారితో.. ఇతరులకూ ముప్పే!

వ్యాక్సిన్‌ పంపిణీ వేగవంతం చేయాలంటున్న నిపుణులు

వాషింగ్టన్‌: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. అయినప్పటికీ టీకా తీసుకోవడానికి కొందరు వెనకాడుతున్నారు. ఈ నేపథ్యంలో టీకా తీసుకోని వారితో వాళ్ల ఆరోగ్యానికే కాదు.. వారి వల్ల ఇతరులకూ ముప్పు ఎక్కువేనని అంటువ్యాధుల నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఇన్‌ఫెక్షన్‌ సోకిన శరీరాలే కొత్త వేరియంట్లు ఉద్భవించడానికి కారణమనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

వ్యాక్సిన్‌ తీసుకోని ప్రజలు కొత్తగా పుట్టుకొచ్చే వేరియంట్లకు ఫ్యాక్టరీలుగా మారే అవకాశం ఉందని అమెరికాలోని వ్యాండర్‌బిల్ట్‌ యూనివర్సిటీ మెడికల్‌ సెంటర్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ విలియం షాఫ్‌నర్‌ పేర్కొన్నారు. టీకాలు తీసుకోనివారి సంఖ్య ఎక్కువగా ఉంటే.. వైరస్‌ వ్యాప్తి రెట్టింపు స్థాయిలో పెరగడానికి అవకాశం ఉంటుందన్నారు. ఇలా విస్తృతి పెరిగి వైరస్‌ మార్పులకు (మ్యుటేషన్‌) గురవుతుందని.. దాంతో పరిస్థితులు మరింత ప్రమాదకరంగా మారుతాయని చెప్పారు.

సాధారణంగా మార్పులకు గురైనప్పుడు వైరస్‌ బలహీనపడుతుంది. కానీ.. కొన్ని సందర్భాల్లో విస్తృత వేగంగా వ్యాప్తి చెందడమే కాకుండా, తీవ్ర ప్రభావాన్ని చూపే రకంగా మారుతుంది. ఇన్‌ఫెక్షన్‌కు గురైన వ్యక్తి నుంచి వేరొకరికి సోకినప్పుడు.. మ్యుటేషన్‌ చెందిన రకం వ్యాప్తి చెందుతుంది. ఇలా పూర్తిగా పరివర్తనం చెందిన రకమే కొత్త వేరియంట్‌గా ఉద్భవిస్తుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. వ్యాక్సిన్‌ తీసుకోని వారికి కొత్త వేరియంట్‌లు సోకితే..ఆ ఇన్‌ఫెక్షన్‌ కణాలు మరింత పెరుగుతూ ఇతరులకూ తేలికగా వ్యాపించేందుకు కారణమవుతాయని జాన్స్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీకి చెందిన మైక్రోబయోలజిస్ట్, ఇమ్యునాలజిస్ట్‌ ఆండ్రూ పెకోజ్‌ పేర్కొన్నారు. ఇలా వ్యాప్తి చెందిన ప్రతిసారీ వైరస్‌ మరిన్ని మ్యుటేషన్లకు కారణమవుతుందని.. విస్తృత వేగంగా వ్యాపింపజేసే వైరస్‌లు ప్రస్తుతం చాలా ఉన్నాయని చెప్పారు.

ఇదిలా ఉంటే.. ఇప్పటికే కొత్తగా బయటపడిన డెల్టా వేరియంట్‌ దాదాపు 100 దేశాలకు వ్యాపించింది. వేగంగా వ్యాప్తి చెందే డెల్టా వంటి కరోనా వైరస్‌ వేరియంట్లతో ప్రపంచం గడ్డుదశలో ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ఈ నేపథ్యంలో వైరస్‌ వ్యాప్తి జరగడానికి ఎంత ఎక్కువ అవకాశం ఇస్తే.. వైరస్‌ మార్పులకు గురికావడానికి అంత అవకాశం ఇచ్చినట్లేనని అభిప్రాయపడింది. అందుకే కొత్తగా వెలుగు చూసిన కరోనా వైరస్‌లపైనా ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్లు పనిచేస్తున్నందున ప్రతిఒక్కరూ వ్యాక్సిన్‌ తీసుకోవాలని ఆరోగ్యరంగ నిపుణులు సూచిస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని