ఆ గ్రామస్థులకు కొవిషీల్డ్‌+కొవాగ్జిన్‌ డోసులు

తాజా వార్తలు

Updated : 26/05/2021 23:35 IST

ఆ గ్రామస్థులకు కొవిషీల్డ్‌+కొవాగ్జిన్‌ డోసులు

భయాందోళనకు గురవుతున్న బాధితులు

సిద్దార్థ్‌నగర్‌: వ్యాక్సిన్‌ పంపిణీలో భాగంగా రెండు డోసుల్లోనూ ఒకే రకమైన టీకాను ప్రభుత్వం అందిస్తోంది. అయితే ఉత్తరప్రదేశ్‌లోని ఓ గ్రామంలో వైద్య సిబ్బంది పొరపాటుతో రెండు రకాల టీకాలు వేయడం చర్చనీయాంశమైంది. తమకు ఏదైనా జరుగుతుందేమోనని గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. సిద్దార్థనగర్‌ జిల్లాలోని ఓ గ్రామ ప్రజలకు మొదటి డోసులో భాగంగా ఏప్రిల్‌లో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొవిషీల్డ్‌ టీకా వేశారు. రెండో డోసులో భాగంగా తాజాగా 20 మంది గ్రామస్థులకు కొవాగ్జిన్‌ టీకా వేయడం భయాందోళన రేకెత్తించింది. అయితే మిక్స్‌డ్‌ టీకా తీసుకున్నవారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తలేదని, కారకులపై చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. 

‘ఇది కచ్చితంగా వైద్య సిబ్బంది పొరపాటే. మిక్స్‌డ్‌ టీకా వేయాలని ప్రభుత్వం ఎలాంటి సూచనలు చేయలేదు. దీనిపై విచారణ జరిపించాం. కారకులపై తగిన చర్యలు తీసుకుంటాం’ సిద్దార్థనగర్‌ ప్రధాన వైద్యాధికారి సందీప్‌ చౌదరి వెల్లడించారు. మిక్స్‌డ్‌ టీకా తీసుకున్నవారితో ప్రత్యేక బృందం చర్చించిందని.. వారి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు ఆయన వివరించారు. మిక్స్‌డ్‌ డోసులు తీసుకున్న రామ్‌ సూరత్‌ అనే గ్రామస్థుడు మీడియాతో మాట్లాడుతూ.. ‘రెండో డోసు వేశాక పొరపాటు జరిగిందని వైద్యులు గుర్తించారు. ఏ అధికారి కూడా మా పరిస్థితిపై ఆరా తీయలేదు. రెండు రకాల డోసులు తీసుకున్నవారంతా భయాందోళనకు గురవుతున్నారు’ అని ఆయన పేర్కొన్నారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని