హిరేన్‌ హత్య: పన్నాగ భేటీలో సచిన్‌ వాజే!

తాజా వార్తలు

Published : 31/03/2021 01:22 IST

హిరేన్‌ హత్య: పన్నాగ భేటీలో సచిన్‌ వాజే!

కోర్టుకు వెల్లడించిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)

ముంబయి: థానేకు చెందిన వ్యాపారవేత్త మన్‌సుఖ్‌ హిరేన్‌ హత్యకేసు దర్యాప్తులో రోజురోజుకు పురోగతి కనిపిస్తోంది. హిరేన్‌ హత్యకు పథకం రచించేందుకు భేటీ అయిన సమయంలో ముంబయి పోలీసు అధికారి సచిన్‌ వాజేతోపాటు మరో కానిస్టేబుల్‌ వినాయక్‌ షిండే కూడా అక్కడే ఉన్నట్లు జాతీయ దర్యాప్తు బృందం(ఎన్‌ఐఏ) వెల్లడించింది. అంతేకాకుండా కుట్రపన్నిన వారితో మాట్లాడేందుకు ఓ మొబైల్‌ ఫోన్‌ను సచిన్‌ వాజే ఉపయోగించినట్లు కోర్టుకు తెలిపింది. అయితే, కుట్ర వెనకున్న ఉద్దేశాన్ని త్వరలోనే కనుగొంటామని కోర్టుకు సమర్పించిన తాజా నివేదికలో ఎన్‌ఐఏ పేర్కొంది.

హిరేన్‌ హత్య కేసు దర్యాప్తులో భాగంగా కానిస్టేబుల్‌ షిండేతో పాటు మరోవ్యక్తిని మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక సంస్థ(ఏటీఎస్‌) తొలుత అరెస్టు చేసింది. వీరి నుంచి కీలక ఆధారాలు సేకరించిన ఏటీఎస్‌..ఈ కేసులో సచిన్‌ వాజే కీలక సూత్రధారిగా తేల్చింది. ఇదే సమయంలో పేలుడు పదార్థాల వాహనంపై దర్యాప్తు జరుపుతోన్న ఎన్‌ఐఏ ఇప్పటికే సచిన్‌ వాజేను విచారిస్తోంది. ఇతనితో పాటు ఏటీఎస్‌ అరెస్టు చేసిన ఇద్దరు వ్యక్తులను ఎన్‌ఐఏ కస్టడీలోకి తీసుకొని విచారించగా మరిన్ని విషయాలు బయటకు వచ్చాయి. హిరేన్‌ హత్యకు పథక రచన జరిగిన సమయంలో పోలీస్‌ అధికారి సచిన్‌ వాజేతో పాటు కానిస్టేబుల్‌ షిండే కూడా అక్కడే ఉన్నట్లు ఎన్‌ఐఏ తేల్చింది. ఇందుకు సంబంధించిన ఆధారాలు సేకరించామని కోర్టుకు సమర్పించిన నివేదికలో ఎన్‌ఐఏ పేర్కొంది.

హత్యకు ఉపయోగించినట్లు భావిస్తోన్న 14 సిమ్‌ కార్డులు, మొబైల్‌ ఫోన్లను సేకరించే పనిలో ఎన్‌ఐఏ నిమగ్నమైంది. దర్యాప్తులో భాగంగా సచిన్‌ వాజే ఇంట్లో జరిపిన సోదాల్లో 62 బుల్లెట్లను కూడా ఎన్‌ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ లెక్కలోనికి రానివి కావడం గమనార్హం. వాజే సర్వీస్‌ రివాల్వర్‌కు సంబంధించిన 30 బుల్లెట్లలో కేవలం ఐదింటిని మాత్రమే అధికారులు గుర్తించారు. మిగిలిన వాటి గురించి నిందితుడు ఎలాంటి సమాచారం ఇవ్వడంలేదని ఎన్‌ఐఏ అధికారులు ఇదివరకే కోర్టుకు తెలిపారు.

ముకేశ్‌ అంబానీ ఇంటివద్ద పేలుడు పదార్థాల వాహనం, హిరేన్‌ హత్యకు సంబంధం ఉండడంతో రెండింటిపైనా దర్యాప్తు చేపడుతున్నామని ఎన్‌ఐఏ ఇదివరకే కోర్టుకు తెలిపింది. ఇందులో భాగంగా సచిన్‌ వాజేను కూడా కస్టడీలోకి తీసుకొని విచారిస్తోంది. ఏప్రిల్‌ 3 వరకు సచిన్‌ వాజే ఎన్‌ఐఏ కస్టడీలోనే ఉండనున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని