modi: కరోనా దానంతట అదే రాదు..పోదు

తాజా వార్తలు

Updated : 13/07/2021 19:52 IST

modi: కరోనా దానంతట అదే రాదు..పోదు

ఇది ఎంజాయ్ చేసే సమయం కాదని హెచ్చరించిన ప్రధాని

దిల్లీ: కరోనా వైరస్‌ మూడోదశ దానంతట అదే విజృంభించదని, మనం ఆహ్వానిస్తేనే మనపై దాడి చేస్తుందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. మూడో ముప్పు రాకుండా దేశం పోరాడుతుంటే.. హిల్‌ స్టేషన్ల వద్ద భారీగా జనసమూహాలు దర్శనమివ్వడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. మాస్కులు ధరించకుండా, భౌతిక దూరాన్ని పూర్తిగా మర్చిపోవడంపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇటీవలకాలంలో ఈశాన్య రాష్ట్రాల్లో కేసులు పెరుగుతోన్న నేపథ్యంలో..ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మంగళవారం మాట్లాడారు.  

‘కరోనా కారణంగా పర్యాటక రంగం తీవ్రంగా దెబ్బతిన్న మాట వాస్తవం. కానీ, హిల్‌ స్టేషన్ల వద్ద మాస్కులు ధరించకుండా, భారీగా జనాలు గుమిగూడటం సరైందికాదు. కరోనా కట్టడికి ఏం చేయాలో ప్రశ్నించుకోవాలి. కేసులు పెరుగుతున్నాయి. క్షేత్రస్థాయిలో తక్షణ చర్యలు తీసుకోవాలి. కరోనావైరస్ దానంతట అదే రాదు..పోదు. నియమాలను ఉల్లంఘించి దాన్ని మనతో తీసుకువస్తాం. నిబంధనల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించి, గుంపులుగా చేరడంతో కేసులు పెరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. కరోనా వేరియంట్ల పట్ల జాగ్రత్తగా ఉండాలి. అవి ప్రపంచ వ్యాప్తంగా వినాశనాన్ని సృష్టించాయి. ఇది ఎంజాయ్ చేసే సమయం కాదు’ అని ప్రజలు, ప్రభుత్వాలకు ప్రధాని సూచించారు. ప్రతి ఒక్కరు కరోనా నిబంధనలు పాటించేలా ప్రోత్సహించాలని అధికారులకు వెల్లడించారు.  మూడో ముప్పును ఎదుర్కొవడానికి టీకా ప్రక్రియను వేగవంతం చేయాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు.  

కరోనా రెండోదశ విజృంభణ తగ్గుముఖం పట్టడంతో ఇటీవల పలు రాష్ట్రాలు ఆంక్షలను సడలించాయి. ఈ క్రమంలోనే పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాల్లో భారీగా జనాలు గుమిగూడారు. ఆ సమయంలో మాస్కులు, భౌతిక దూరాన్ని జనాలు పూర్తిగా మర్చిపోయారు. మరోపక్క ఈశాన్య రాష్ట్రాల్లో డెల్టా వేరియంట్ విజృంభిస్తోందని గణాంకాలు వెల్లడించాయి. వీటిని ఉద్దేశించే ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. 



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని