పరిస్థితి చేజారితే లాక్‌డౌన్‌ తప్పదు..!

తాజా వార్తలు

Published : 11/04/2021 18:00 IST

పరిస్థితి చేజారితే లాక్‌డౌన్‌ తప్పదు..!

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో కరోనా వైరస్‌ తీవ్రత పెరిగిన నేపథ్యంలో మరిన్ని ఆంక్షలవైపు దిల్లీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే కొవిడ్‌ రోగులతో దిల్లీలోని ఆసుపత్రులు నిండిపోతున్నాయి. ఇది ఇలాగే కొనసాగి.. ఆసుపత్రుల్లో పరిస్థితి దిగజారితే మాత్రం లాక్‌డౌన్‌ అమలు చేయడం మినహా ప్రభుత్వం దగ్గర ఎలాంటి ప్రత్యామ్నాయం లేదని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ స్పష్టంచేశారు. దేశ రాజధానిలో కరోనా వైరస్‌ నాలుగో వేవ్‌ ఉద్ధృతి ప్రమాదకరంగా కనిపిస్తుందన్న కేజ్రీవాల్‌.. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్లనుంచి బయటకు రావద్దని హెచ్చరించారు.

‘మునుపటి విజృంభణ కంటే కరోనా నాలుగో ఉద్ధృతి అత్యంత ప్రమాదకరం. వైరస్‌ విస్తృతిపై పరిస్థితిని ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది’ అని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్ పేర్కొన్నారు. అయితే, ప్రస్తుతం దిల్లీలో కఠిన ఆంక్షలు అమల్లో ఉన్నాయని..  పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ విధించాలనుకోవడం లేదన్నారు. కానీ, ఒకవేళ ఆసుపత్రులపై ఒత్తిడి పెరిగి.. పరిస్థితి దిగజారితే మాత్రం లాక్‌డౌన్‌ తప్ప వేరే మార్గం లేదని అరవింద్‌ కేజ్రీవాల్‌ అభిప్రాయపడ్డారు.

వైద్య విద్యార్థులూ రంగంలోకి..

దిల్లీలో గతకొద్ది రోజులుగా కరోనా కేసుల సంఖ్య పెరగడంతో ప్రైవేటు ఆసుపత్రుల్లో పడకల కొరత ఏర్పడుతోంది. దీంతో రోగులు ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లాలని ముఖ్యమంత్రి సూచించారు. ముందుజాగ్రత్త చర్యగా ఎంబీబీఎస్‌ మూడు, నాలుగో ఏడాది చదివే విద్యార్థులు, ఇంటెర్న్‌షిప్‌ చేస్తున్న వారితో పాటు బీడీఎస్‌ వైద్యుల సేవలు కూడా వినియోగించుకోవాలని అన్ని కొవిడ్‌ ఆసుపత్రుల అధికారులకు దిల్లీ ముఖ్యమంత్రి ఆదేశాలిచ్చారు.

గడిచిన రెండు వారాలుగా దిల్లీలో కరోనా వైరస్‌ ఉద్ధృతి ఒక్కసారిగా పెరిగింది. ప్రస్తుతం రోజువారీ కేసుల సంఖ్య 10వేలు దాటింది. ప్రస్తుతం అక్కడ 28వేల క్రియాశీల కేసులు ఉన్నాయి. దీంతో నగరంలో మరిన్ని కొవిడ్‌ ఆంక్షలను విధిస్తున్నట్లు దిల్లీ ప్రభుత్వం వెల్లడించింది. ముఖ్యంగా సామాజిక, రాజకీయ, క్రీడలు, సినిమా, మతపరమైన సమావేశాలు, వేడుకలపై నిషేధం విధించింది. ఇక తదుపరి ఆదేశాలిచ్చే వరకు అన్ని విద్యాసంస్థలను మూసివేసి ఉంచాలని రెండు రోజుల క్రితమే ఆదేశాలు వెలువరించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని