అనూహ్యంగా పెరిగిన ప్రకృతి వైపరీత్యాలు!

ప్రధానాంశాలు

Published : 24/07/2021 04:35 IST

అనూహ్యంగా పెరిగిన ప్రకృతి వైపరీత్యాలు!

ఈనాడు, దిల్లీ: కొన్నేళ్లుగా దేశంలో వరదలు, తుపాన్లు వంటి ప్రకృతి వైపరీత్యాలు పెరిగినట్లు కేంద్ర శాస్త్ర, సాంకేతికశాఖ మంత్రి జితేంద్ర సింగ్‌ లోక్‌సభలో కొందరు సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తుపాన్లతోపాటు, దేశంలోని వివిధ వాతావరణ కేంద్రాల పరిధిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసిన రోజులు పెరిగినట్లు వెల్లడించారు. ‘‘గత రెండు దశాబ్దాల కాలంలో రబీ సీజన్‌ వేళ ఉత్తర హిందూ మహాసముద్రంలో భారీ నుంచి అతి భారీ తుపాన్లు సంభవించే రోజుల్లో పెరుగుదల కనిపించింది. అదే సమయంలో అరేబియా సముద్రంలోనూ అతి తీవ్రమైన తుపాన్లు పెరిగాయి. వీటితోపాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో స్థానికంగా భారీ వర్షాలు ఎక్కువ కావడంతో వరదల ముప్పు పెరిగింది. వానలు ఎడతెరిపి లేకుండా కురవడం వల్ల పట్టణ ప్రాంతాల్లో వరదలు అధికమయ్యాయి. ఇటీవల నిర్వహించిన అధ్యయనాల ప్రకారం... ప్రపంచ వ్యాప్తంగా, దేశ వ్యాప్తంగా పలు చోట్ల వాతావరణ మార్పుల్లో తీవ్రత పెరిగింది. భూతాపమే ఇందుకు కారణం. కేంద్ర భూ, శాస్త్రసాంకేతిక శాఖ ప్రచురించిన వాతావరణ మార్పుల మదింపు నివేదిక ప్రకారం... భూ వ్యవస్థలో చోటుచేసుకున్న సంక్లిష్ట మార్పుల కారణంగానే భారీ వర్షాలు కురిసే రోజులు పెరిగి, వరదలకు దారితీస్తున్నట్టు వెల్లడైంది. దీనివల్ల గత దశాబ్ద కాలంలో ఉష్టమండల తుపాన్ల తీవ్రత పెరిగినట్లు తేలింది. దేశంలో 1901-2018 మధ్య ఉపరితల వాయు ఉష్ణోగ్రతలు (సర్ఫేస్‌ ఎయిర్‌ టెంపరేచర్‌) 0.7 డిగ్రీల సెల్సియస్‌ మేర పెరిగాయి. 1986-2015 మధ్య ఈ పెరుగుదలలో వేగం కనిపించింది. ఈ సమయంలో ప్రతి దశాబ్దంలో 0.15 డిగ్రీల సెల్సియస్‌ మేర ఉపరితల వాయు ఉష్ణోగ్రతలు పెరిగాయి. మున్ముందు భారత్‌, దాని ఉపఖండ ప్రాంతంలో వాతావరణ మార్పుల్లో విపరీత మార్పులు చోటుచేసుకొనే అవకాశముంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన