కరోనా వేట.. 2020లో ఆట

కథనాలు

Updated : 30/12/2020 13:28 IST

కరోనా వేట.. 2020లో ఆట

ఈ ఏడాది క్రికెట్‌లో ఎన్నెన్నో జ్ఞాపకాలు

కరోనా దెబ్బకి ‘2020’ చేదు జ్ఞాపకమే! మహమ్మారి విజృంభణకు ఇక సాధారణ జీవితం గడపలేమనే భావన అందరిలోనూ వచ్చింది. ఉల్లాసం, వినోదం కరవయ్యాయి. కానీ కాలం గడిచేకొద్ది పరిస్థితులు చక్కబడుతున్నాయి. సాధారణ స్థితికి చేరుకోవడానికి అడుగులు పడుతున్నాయి. అయితే కొవిడ్‌-19 వార్తలతో విసిగిపోతున్న ప్రజలకు ‘క్రికెట్‌’ ఎంతో ఊరటనిచ్చింది. వైరస్‌ ఆలోచనల నుంచి బయటకు తీసుకువచ్చింది. ప్రమాదకర స్థితిలోనూ ఆటగాళ్లు క్రమశిక్షణతో అభిమానుల్ని అలరించారు. ఈ కఠిన ఏడాదిలో క్రికెట్‌ ప్రయాణం ఎలా సాగిందంటే...

ఏడాది ప్రారంభంలో

ఈ ఏడాది ఆరంభంలో టీమిండియా సొంతగడ్డపై శ్రీలంకతో టీ20 సిరీస్‌ ఆడింది. తొలి మ్యాచ్‌ రద్దవ్వగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. అనంతరం ఆస్ట్రేలియా జట్టు భారత్‌లో పర్యటించింది. మూడు వన్డేల సిరీస్‌ను కోహ్లీసేన 2-1తో సొంతం చేసుకుంది. తొలి మ్యాచ్‌లో పది వికెట్ల తేడాతో ఓటమిపాలైన టీమిండియా.. తర్వాత బెబ్బులిలా చెలరేగి సిరీస్‌ను సాధించింది. మరోవైపు ప్రపంచ క్రికెట్‌లో ఇంగ్లాండ్×దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌×ఐర్లాండ్‌, బంగ్లాదేశ్‌×పాకిస్థాన్‌ సిరీస్‌లు సాఫీగా సాగాయి. తర్వాత న్యూజిలాండ్‌ పర్యటనకు కోహ్లీసేన బయలుదేరింది.


కివీస్‌పై పాంచ్‌ పటాకా.. రన్నరప్‌గా భారత్‌

కివీస్ పర్యటనలో భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. అయిదు టీ20ల సిరీస్‌ను కోహ్లీసేన 5-0తో విజయఢంకా మోగించింది. దీనిలో రెండు మ్యాచ్‌లు ‘టై’ అవ్వగా.. సూపర్‌ఓవర్లలో టీమిండియా చెలరేగిన తీరు అద్భుతం. ఆఖరి బంతికి డీప్‌ ఎక్స్‌ట్రాకవర్‌ మీదగా రోహిత్‌ శర్మ సిక్సర్‌ బాది జట్టును గెలిపించడం సిరీస్‌లోనే హైలైట్‌. అయితే తర్వాత జరిగిన వన్డే, టెస్టు సిరీస్‌లను టీమిండియా 0-3, 0-2తో కోల్పోయింది. మరోవైపు ఆస్ట్రేలియాలో జరిగిన మహిళా టీ20 క్రికెట్ ప్రపంచకప్‌కు ఎంతో ఆదరణ లభించింది. టీమిండియా ఫైనల్లో తడబడి ట్రోఫీని ముద్దాడే అవకాశాన్ని త్రుటిలో కోల్పోయింది. అయినా మెగాటోర్నీలో హర్మన్‌ప్రీత్‌సేన పోరాటం అభినందనీయం.


మహమ్మారి ఎంట్రీ

కివీస్ పర్యటన అనంతరం కోహ్లీసేన స్వదేశానికి తిరిగొచ్చింది. మార్చిలో దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌కు సిద్ధమైంది. కాగా, తొలి మ్యాచ్ వరుణుడి కారణంగా రద్దైంది. అప్పటికే దేశంలో కరోనా వ్యాప్తి వేగవంతమైంది. దీంతో మిగిలిన మ్యాచ్‌లు కొవిడ్‌ భయంతో జరగలేదు. స్టేడియంలో అభిమానులు లేకుండా మ్యాచ్‌లను నిర్వహించాలని బీసీసీఐ ప్రయత్నించినా, మహమ్మారి ఉద్ధృతితో సాధ్యం కాలేదు. ఈ సిరీస్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా అన్ని క్రీడాకార్యకలాపాలు స్తంభించాయి. ఐపీఎల్‌ నిరవధిక వాయిదాపడింది. మెగా ఈవెంట్‌ ఒలింపిక్స్‌ను కూడా వచ్చే ఏడాదికి వాయిదా వేశారు.


ఇంగ్లాండ్‌ ఊపిరిపోసింది..

దాదాపు మూడు నెలలు క్రీడలకు సంబంధించిన ఎలాంటి వార్తలు లేవు. ఎక్కడ చూసినా, ఏం విన్నా కరోనానే. ఇలాంటి పరిస్థితుల్లో ఇంగ్లాండ్ బయోబబుల్ విధానం.. క్రికెట్‌కు తిరిగి ఊపిరిపోసింది. వెస్టిండీస్‌, ఐర్లాండ్‌, పాకిస్థాన్‌, ఆస్ట్రేలియాతో బయోబుడగలో ఇంగ్లాండ్‌ ద్వైపాక్షిక సిరీస్‌లను విజవంతంగా ముగించింది. అయితే అభిమానులకు అనుమతివ్వలేదు. కాగా, ఇంగ్లాండ్ చూపిన దారిలో మెన్స్‌ టీ20 ప్రపంచకప్‌ను ఆస్ట్రేలియా నిర్వహిస్తుందని భావించారంతా. కానీ ఆసీస్‌ క్రికెట్ బోర్డు టోర్నీని నిర్వహించలేమని తేల్చిచెప్పడంతో అభిమానులు నిరాశే మిగిలింది. అయితేనేం, టోర్నీ వాయిదాతో ఐపీఎల్‌కు విండో క్లియర్‌ అయ్యింది. కానీ లీగ్‌ను ఎక్కడ నిర్వహించాలి? ఎలా ఏర్పాట్లు చేయాలి? అనే ప్రశ్నలు బీసీసీఐకి తలెత్తాయి.


ఐపీఎల్ సూపర్ హిట్‌

యూఏఈ వేదికగా సెప్టెంబర్‌ 19 నుంచి నవంబర్‌ 10 వరకు ఐపీఎల్‌ను బీసీసీఐ దిగ్విజయంగా నిర్వహించింది. కరోనా దెబ్బకు జరుగుతుందో లేదోనన్న లీగ్‌ అంచనాలను మించి అలరించింది. కళ తప్పిన ఖాళీ స్టేడియాల ప్రభావాన్ని అధిగమించి అభిమానులను ఉత్కంఠతో ఊపేసింది. లీగ్‌లో ఎన్నో రికార్డులు బద్దలయ్యాయి. ఆఖరి మ్యాచ్‌ వరకు ప్లేఆఫ్స్‌కు చేరే నాలుగో జట్టు తేలలేదు. తెవాతియా సిక్సర్లు, సూపర్‌ ఓవర్లు, డబుల్‌ సూపర్‌ ఓవర్‌, ముంబయి అయిదోసారి ఛాంపియన్‌ నిలవడం.. ఇలా ఎన్నో జ్ఞాపకాలు మిగిల్చింది.


ఆటగాళ్లకు హ్యాట్సాఫ్‌

సాధారణంగా ఆటగాళ్లు విలాసవంతమైన జీవితాన్ని గడపటానికి ఇష్టపడతారు. సమయం దొరికితే పబ్‌లు, పార్టీలు, విహార యాత్రలతో కాలక్షేపం చేస్తారు. కానీ ఐపీఎల్‌ కోసం దాదాపు మూడు నెలలు ఆటగాళ్లంతా క్రమశిక్షణతో బయోబబుల్‌లోనే ఉన్నారు. కరోనా ఆలోచనల నుంచి అందర్నీ బయటకు తీసుకురావాలని.. ప్రమాదకర స్థితిలోనూ ఆటతో అలరించారు. కుటుంబానికి దూరంగా ఉంటూ ఆటపై అంకిత భావంతో మైదానంలో పోరాడారు. అంతేగాక దాదాపు 500+ మందితో బయోబుడగలో లీగ్‌ను‌ విజయవంతం చేయడమంటే ఆషామాషీ కాదు. బీసీసీఐ దానికి తగ్గట్లుగా గొప్పగా ఏర్పాట్లు చేసి అందరికీ ఎంతో వినోదాన్ని పంచింది.


చరిత్రలోనే అత్యల్పం

ఐపీఎల్ ముగిసిన తర్వాత టీమిండియా దుబాయ్‌ నుంచి నేరుగా ఆస్ట్రేలియాకు వెళ్లింది. వన్డే సిరీస్‌ను 1-2తో కోల్పోయింది. తర్వాత గొప్పగా పుంజుకుని టీ20 సిరీస్‌ను 2-1తో గెలిచి బదులు తీర్చుకుంది. అభిమానులు స్టేడియాలకు తరలివచ్చారు. తొలి రెండు మ్యాచ్‌లకు ‘50శాతం అభిమానుల’ నిబంధన పెట్టిన అక్కడి ప్రభుత్వం, తర్వాత పూర్తిగా అనుమతి ఇచ్చింది. కాగా, తొలి టెస్టులో ఆస్ట్రేలియా చేతిలో కోహ్లీసేన ఘోర పరాజయాన్ని చవిచూసింది. రెండో ఇన్నింగ్స్‌లో 36 పరుగులకే కుప్పకూలి భారత టెస్టు చరిత్రలో అత్యల్ప స్కోరు నమోదుచేసింది. అయితేనేం, బాక్సింగ్‌ డే టెస్టులో గర్వించదగిన విజయం సాధించింది.


కరోనా కలకలం

మరోవైపు డిసెంబర్‌లో జరగాల్సిన ఇంగ్లాండ్×దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌ కరోనా కారణంగా వాయిదా వేశారు. ఆటగాళ్లకు మహమ్మారి సోకడంతో భద్రతా దృష్ట్యా మ్యాచ్‌లను నిలిపివేశారు. కాగా, న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన పాకిస్థాన్‌నూ కొవిడ్‌-19 ఇబ్బంది పెట్టింది. పలువురు ఆటగాళ్లకు కరోనా సోకినా, తిరిగి కోలుకోవడంతో టీ20 సిరీస్ సాఫీగా సాగింది. వచ్చే ఏడాదిలోనైనా కరోనాను అంతం చేసి మునుపటిలా మ్యాచ్‌లు సవ్యంగా జరగాలని అభిమానులు, ఆటగాళ్లు ఆశిస్తున్నారు.

- ఇంటర్నెట్‌డెస్క్‌Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన