చెన్నై ఓటములకు కారణాలివే..!

కథనాలు

Updated : 20/10/2020 16:33 IST

చెన్నై ఓటములకు కారణాలివే..!

డీలాపడ్డ ఛాంపియన్‌ జట్టు

‘‘అరెరే.. మన చెన్నై జట్టుకు ఏమైంది..? ఎందుకిలా డీలా పడిపోయింది. ఇప్పుడున్న ధోనీసేన.. గతంలోని ఛాంపియన్‌ జట్టేనా..? ధోనీని.. చెన్నై జట్టును ఇలా చూడటం చాలా బాధగా ఉంది. ‘2020’ నిజంగానే చెడ్డది’’ ప్రస్తుత సీజన్‌లో ధోనీసేన పరిస్థితి చూశాక బహుశా సగటు చెన్నై అభిమాని ఆవేదన ఇదే కావచ్చు.

గతంలో.. చెన్నై జట్టు ముందు కొండంత లక్ష్యం ఉన్నా ఛేదిస్తుందనే ధైర్యం ఉండేది. కారణం.. రైనా. అతను లేక ఇప్పుడు ఛేదనలో చతికలపడిపోతోంది. చేజారిపోతున్న మ్యాచ్‌లనూ చేజిక్కించుకుంటుందనే ధీమా ఉండేది. కారణం.. బ్రావో. అతను లేక ఇప్పుడు చేతిలోని మ్యాచ్‌లను ప్రత్యర్థులు లాగేసుకుంటున్నా నిస్సహాయ స్థితిలో చూస్తూ ఉండిపోతోంది. మరి చెన్నై ఓటములకు ఇవే కారణాలా..? అంటే.. అందులో ప్రధానంగా ఈ రెండు సమాధానాలే ఎదురు కావొచ్చు! ఎందుకంటే వాళ్లిద్దరూ ఉన్నప్పుడు చెన్నై ప్రదర్శన ఇంత చెత్తగా ఎన్నడూ లేదు.

చరిత్ర ఘనం.. వర్తమానం శూన్యం..
ధోనీసేన ఏకంగా ఎనిమిది సార్లు ఫైనల్స్‌కు చేరింది. మూడుసార్లు టైటిల్స్‌ను గెలిచింది. ప్రతిసారీ ప్లేఆఫ్‌ చేరిన ఏకైక జట్టు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత బలమైన జట్లలో ఒకటి. అందుకే.. అన్ని జట్లు ప్లేఆఫ్స్‌ తొలి లక్ష్యంగా బరిలోకి దిగితే చెన్నై మాత్రం నేరుగా ఫైనల్‌పై గురిపెట్టేది. క్రికెట్‌ విశ్లేషకులు సైతం ఫైనల్‌లో ఒక బెర్తును ముందుగానే చెన్నైకి ఖాయం చేసేవారు. మిగిలిన స్థానం కోసం పోటీపడే జట్ల గురించి మాట్లాడేవారు. అయితే.. ఈసారి పరిస్థితి మారింది. గత ఛాంపియన్‌కు ఇప్పుడున్న ధోనీసేన ప్రదర్శనకు చాలా తేడా ఉంది. ఆడిన పది మ్యాచుల్లో ఏడు ఓడిపోయి పాయింట్ల పట్టికలో అట్టడుగుకు పడిపోయింది. ఫలితంగా లీగ్‌ దశలోనే ఇంటిముఖం పట్టింది. చెన్నై ఇప్పటికీ ప్లేఆఫ్‌కు చేరే అవకాశం ఉంది. కానీ.. అది ఇతర జట్ల ప్రదర్శనపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ధోనీ సేన ప్లేఆఫ్స్‌కు వెళ్లడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి.

కొంపముంచిన టెస్టు బ్యాటింగ్‌..
ఇది టీ20. ఎదురొచ్చిన ప్రతి బంతినీ పరుగులు పెట్టించాలి. పవర్‌ప్లే, మధ్య ఓవర్లు, ఆఖరి ఓవర్లు అని తేడా లేకుండా బౌండరీలు బాదాలి. ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యం ఉంచాలి. జట్టు ముందు కొండంత లక్ష్యం ఉన్నా ఆత్మవిశ్వాసంతో ఛేదించాలి. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ పొట్టి క్రికెట్‌కు కావాల్సింది దూకుడు. చెన్నై జట్టులో అదే కొరవడింది. కావాల్సినంత అనుభవం ఉన్నా.. దూకుడుగా ఆడే ఆటగాళ్లు లేరు. చివర్లో బౌండరీలు బాదే హిట్టర్లు కనిపించడంలేదు. వికెట్లు కాపాడుకొని చివరి ఓవర్లలో స్కోర్‌ బోర్డును పరిగెత్తిద్దాం అన్నట్లు ధోనీ సేన ఆటతీరు సాగింది. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో ఈ విషయం కళ్లకు కట్టినట్లుగా అర్థమైంది. వికెట్లు కాపాడుకుంటే విజయం సాధించడానికి ఇది టెస్టు మ్యాచ్‌ కాదుగా..! అన్నది విశ్లేషకుల అభిప్రాయం. అన్నింటికంటే ముఖ్యంగా ధోనీసేనలో గెలవాలనే కసి కనిపించలేదు. ఈ కారణంగానే ఈసారి కనీసం ప్లేఆఫ్స్‌కు కూడా చేరలేకపోయింది.

ఇవే కారణాలు..!
* రైనా లేకపోవడం. అతనికి ప్రత్యామ్నాయ ఆటగాడు లేకుండానే బరిలోకి దిగడం.
* కీలక సమయంలో ఆల్‌రౌండర్‌ బ్రావో జట్టుకు దూరం కావడం.
* గత సీజన్‌లో అత్యధిక వికెట్ల వీరుడు తాహీర్‌కు ఒక్క అవకాశం కూడా ఇవ్వకపోవడం.
* ఈ ఫార్మాట్‌కు సూట్‌కాని కేదార్‌ జాదవ్‌ను ఆల్‌రౌండర్‌గా జట్టులోకి తీసుకోవడం.
* తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో ఓపెనర్‌గా మంచి రికార్డున్న జగదీశన్‌ను ఆడించకపోవడం.
* జడేజా బ్యాటింగ్‌ను సరిగా వినియోగించుకోకపోవడం.
* జట్టులో యువ ఆటగాళ్లతో ప్రయోగాలు చేయకపోవడం.
* ఏళ్ల తరబడి ఒక్కటే జట్టుతో(ఆటగాళ్లను మార్చకుండా) మ్యాచ్‌లు ఆడటం.

* మ్యాచ్‌ గెలిపించే మంచి ఫినిషర్ లేకపోవడం.
* నెమ్మదిగా బ్యాటింగ్‌ చేస్తూ.. చివర్లో వేగంగా ఆడదామనుకోవడం.

* విదేశీ ఆటగాళ్లను సక్రమంగా వినియోగించుకోలేకపోవడం.
* అన్నింటి కంటే ముఖ్యంగా ధోనీ ఫామ్‌లో లేకపోవడం.

- ఇంటర్నెట్‌ డెస్క్‌Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన