గబ్బర్‌ చెలరేగాల్సిన సమయం ఇది.. 

కథనాలు

Published : 05/12/2020 13:22 IST

గబ్బర్‌ చెలరేగాల్సిన సమయం ఇది..  

2020లో శిఖర్‌ ధావన్‌ ఎలా ఆడాడంటే..

ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న పరిమిత ఓవర్ల క్రికెట్‌లో టీమ్‌ఇండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ తొలి వన్డేలో మినహా మిగతా మూడు మ్యాచ్‌ల్లో విఫలమయ్యాడు. ఇంకో రెండు టీ20లు ఆడితే ఈ ఏడాది అతడి ఆట పూర్తి అవుతుంది. ఎందుకంటే అతడు కంగారూలతో టెస్టు సిరీస్‌కు ఎంపికవ్వలేదు. ఈ క్రమంలోనే అతడు చివరి రెండు టీ20ల్లో దంచి కొట్టాల్సిన సమయం ఆసన్నమైంది. తొలి టీ20లో రాహుల్‌, జడేజా మినహా ఎవరూ పెద్దగా రాణించలేని సంగతి తెలిసిందే. మిగిలిన మ్యాచ్‌ల్లోనూ ఇలాంటి పరిస్థితే ఎదురైతే టీమ్‌ఇండియాకు మరో భంగపాటు తప్పదనే చెప్పాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఓపెనర్‌గా గబ్బర్‌ బ్యాట్‌ ఝుళిపించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. నేడు అతడు 35వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఈ ఏడాది అతడి ఆటపై ప్రత్యేక కథనం..

ఆదిలో అదరగొట్టాడు..
ఈ ఏడాది జనవరిలో ధావన్‌ అదరగొట్టాడు. శ్రీలంక.. భారత పర్యటన సందర్భంగా మూడు టీ20ల సిరీస్‌లో గబ్బర్‌ మెరిశాడు. తొలి మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దవగా తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో 32, 52 పరుగులు చేశాడు. దాంతో జట్టుకు శుభారంభాలు అందించాడు. ఆ సిరీస్‌ను భారత్‌ 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ క్రమంలోనే తర్వాత ఆస్ట్రేలియా భారత పర్యటన సందర్భంగా 3 వన్డేల సిరీస్‌ జరిగింది. అప్పుడు తొలి రెండు వన్డేల్లో 74, 96 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. అయితే, ధావన్‌ ఆ సమయంలో గాయం బారిన పడడంతో మూడో వన్డేలో ఆడలేదు. ఆపై న్యూజిలాండ్‌ పర్యటనకు సైతం అతడు ఎంపిక కాలేదు. ఇక లాక్‌డౌన్‌ అనంతరం నేరుగా ఐపీఎల్లో అడుగుపెట్టి 618 పరుగులతో సత్తా చాటాడు. దాంతో ఈ టోర్నీలో వరుసగా రెండు సీజన్లలో అత్యధిక పరుగులు చేసిన టాప్‌ బ్యాట్స్‌మెన్‌లో ఒకడిగా నిలిచాడు. 

ఐపీఎల్లో రికార్డు నెలకొల్పాడు..

ఇక ఇప్పటివరకు ఐపీఎల్‌ 13 సీజన్లు పూర్తి చేసుకోగా ఇన్నేళ్లలో ఎవరికీ సాధ్యం కాని ఓ రికార్డును గబ్బర్‌ తన పేరిట నమోదు చేసుకున్నాడు. ఈ మెగా ఈవెంట్‌లో అత్యధిక పరుగులతో కొనసాగుతున్న విరాట్‌ కోహ్లీ, సురేశ్‌ రైనా, రోహిత్‌ శర్మ, ఏబీ డివిలియర్స్‌, డేవిడ్‌ వార్నర్‌ లాంటి మేటి బ్యాట్స్‌మెన్‌కు సైతం అది సాధ్యం కాలేదు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో శతకాలు బాదడం ఈ దిల్లీ బ్యాట్స్‌మన్‌కే చెల్లింది. గతనెల యూఏఈలో ముగిసిన టీ20 లీగ్‌లో చెన్నై, పంజాబ్‌ జట్లపై ఆడిన సందర్భంగా ధావన్‌ 101, 106 పరుగులు చేశాడు. అలాగే ఈ రెండు మ్యాచ్‌ల్లో నాటౌట్‌గా నిలవడం గమనార్హం. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే రెండు వరుస సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా రికార్డులకెక్కాడు. ఈ సీజన్‌లో మొత్తం 4 అర్ధశతకాలు, 2 శతకాలు బాదాడు.

ఆస్ట్రేలియాలో దంచికొట్టాలి.. 
ఆ మెగా ఈవెంట్‌ తర్వాత ధావన్‌ టీమ్‌ఇండియాతో కలిసి ఆస్ట్రేలియాకు చేరుకున్నాడు. ఈ క్రమంలోనే తొలి వన్డేలో మినహా మిగతా మ్యాచ్‌ల్లో విఫలమయ్యాడు. 74, 30, 16, 1 గత నాలుగు మ్యాచ్‌ల్లో అతడు చేసిన పరుగులివి. దీంతో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో చెప్పుకోదగ్గ స్కోర్‌ చేయలేకపోయాడు. ఈ క్రమంలోనే టీమ్‌ఇండియా తొలి రెండు వన్డేల్లో ఓటమిపాలైనా తిరిగి పుంజుకుంది. మూడో వన్డేతో పాటు, శుక్రవారం జరిగిన తొలి టీ20లో విజయం సాధించింది. అయితే, పొట్టి సిరీస్‌ గెలవాలంటే ఇంకో మ్యాచ్‌ గెలిస్తే చాలు. కానీ, తర్వాత జరగబోయే టెస్టు సిరీస్‌ను దృష్టిలో పెట్టుకుంటే మిగతా మ్యాచ్‌లు కూడా గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆస్ట్రేలియాకు ఏ చిన్న అవకాశం కల్పించినా అది టెస్టు సిరీస్‌పై ప్రభావం చూపిస్తుంది. దీంతో గబ్బర్‌ తర్వాతి రెండు టీ20ల్లో చెలరేగాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అతడు బ్యాట్‌ ఝుళిపించి టీమ్‌ఇండియాను విజేతగా నిలిపితే టెస్టు సిరీస్‌లో కోహ్లీసేనకు పూర్తి ఆత్మవిశ్వాసం దొరుకుతుంది. 

* ఇక మొత్తంగా గబ్బర్‌ ఈ ఏడాది ఇప్పటివరకు ఆడింది ఐదు వన్డేలు, అందులో 58 సగటుతో 290 పరుగులు చేశాడు. మరోవైపు పొట్టి క్రికెట్‌లో ఆడింది 3 మ్యాచ్‌లే, 28.33 సగటుతో 85 పరుగులే చేశాడు. 

ఇవీ చదవండి:

నాటి ఆసీస్‌ లాభం.. కోహ్లీసేనతో నష్టమైందా?

జడేజా కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌పై రచ్చ? Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన