అభిమానం అంటే ఇదే కదా..!

కథనాలు

Updated : 18/10/2020 10:29 IST

అభిమానం అంటే ఇదే కదా..!

ఆదర్శంగా నిలుస్తున్న ధోనీ సూపర్‌ ఫ్యాన్‌

(Photo: twitter)

అభిమానం ఎవరికైనా ఉంటుంది. దానిని చాటుకోవడంలోనే ప్రత్యేకతలుంటాయి. అన్నింటికంటే సులువైన పని.. సోషల్‌ మీడియాలో ఒక ఫ్యాన్‌ క్లబ్‌ను ఏర్పాటు చేయడం. వాళ్లపై పొగడ్తల వర్షం కురిపించడం. అందరి నోటా ఫలానా ఆటగాడు గొప్ప అనేలా చేయడం. కానీ, అందుకు భిన్నంగా చేశాడో అభిమాని. ప్రజలకు సేవ చేసేందుకు, తన అభిమాన క్రికెటర్‌కు మంచి పేరు తెచ్చేందుకు కృషి చేశాడు. నేను ఫలానా ఆటగాడి అభిమానిని.. అని చెప్పుకోవడం కంటే.. ఫలానా వ్యక్తి నా ఫ్యాన్‌ అని ఆటగాడే చెప్పుకొంటే ఎలా ఉంటుంది..? అదే కదా అసలైన అభిమానం అంటే. ఇంతకీ ఎవరా అభిమాని.. ఏం చేశాడు..? అనుకుంటున్నారా..? అయితే మీరు ధోనీ వీరాభిమాని తంగరాజ్‌‌ గురించి తెలుసుకోవాల్సిందే..!

సిక్సర్‌ నుంచి పుట్టిందీ ఫ్యాన్‌ క్లబ్‌..
అది తమిళనాడులోని సేలం జిల్లాకు చెందిన నెయ్‌కరపట్టి గ్రామం. దసరా, దీపావళి జరుపుకొన్నట్లే అక్కడి ప్రజలు జూలై 7న ఒక పండుగ జరుపుకొంటారు. అది మహేంద్రసింగ్‌ ధోనీ జన్మదినం. ఆ రోజు ఆ గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంటుంది. అందరూ సంతోషంగా గడుపుతారు. సేవా కార్యక్రమాలు చేపడతారు. దీనంతటికీ కారణం 2011 ప్రపంచకప్‌లో ధోనీ కొట్టిన సిక్సర్‌.. దాని వల్ల ప్రభావితుడైన తంగరాజ్‌‌. 

దినసరి కూలీలే సమాజ సేవకులై..
2011లో ధోనీసేన ప్రపంచకప్‌ గెలిచింది. అదే సమయంలో నెయ్‌కరపట్టి గ్రామంలో ‘తాలామయి ధోనీ రసిఘర్‌ మంద్రమ్‌’ పేరుతో ధోనీ ఫ్యాన్స్ క్లబ్‌ ఆవిర్భవించింది. పేదలకు ఆహారం, నిత్యావసరాలు అందించడంతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఈ క్లబ్‌ పని. రక్తదాన శిబిరాలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ క్లబ్‌లో ఇప్పుడు దాదాపు 60మందికి పైగా సభ్యులు ఉన్నారు. దాని సేవలు గ్రామం దాటి జిల్లా వ్యాప్తమయ్యాయి. దీన్ని ప్రారంభించిన తంగరాజ్‌ ఓ చిరు వ్యాపారి. క్లబ్‌లో చాలా మంది దినసరి కూలీలే కావడం గమనార్హం. వచ్చిన దాంట్లోనే కొంత సేవాకార్యక్రమాలకు కేటాయిస్తున్నారు. ఇతరుల్లో స్ఫూర్తి నింపుతున్నారు. ఏడాదికి దాదాపు రూ.1లక్ష వరకు ఖర్చు చేసి సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.

(Photo: twitter)

తండ్రి ఆశయాన్ని నెరవేరుస్తూనే..

నువ్వేం చేసినా.. దానివల్ల ఇతరులకు మంచి జరగాలి’ అని వాళ్ల నాన్న చెప్పిన మాటకు కట్టుబడి ఉన్న తంగరాజ్‌ ఈ మార్గం ఎంచుకున్నాడు. ప్రజలకు సేవ చేయాలని తన తండ్రి ఎల్లప్పుడూ ప్రోత్సహించేవారని అంటున్నాడీ తంగరాజ్‌. ‘2008 నుంచి ధోనీని నేను అభిమానిస్తున్నాను. 2009లో చెన్నై జట్టు ట్రోఫీ గెలవలేకపోయింది. 2010లో గెలిచింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ధోనీ పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తున్నా. 2011లో ధోనీసేన ప్రపంచకప్‌ కూడా గెలిచింది. ఆ ఏడాది మాకు నిజంగా ఎంతో ప్రత్యేకం. అప్పటి నుంచి క్లబ్‌ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేపడుతున్నాం’ అని తంగరాజ్‌ చెప్పుకొచ్చాడు.

(Photo: twitter)

అది వెలకట్టలేని అనుభూతి

‘‘నాకు ఒకసారి ధోనీని కలిసే అవకాశం వచ్చింది. అది వెలకట్టలేని అనుభూతి. 2017లో తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌ ప్రారంభోత్సవానికి ధోనీ వచ్చారు. ఆయన పాదాలపై పడి ఆశీర్వాదం తీసుకున్నాను. అప్పుడు ధోనీ.. తమిళంలో 'వెనం పా' (వద్దు) అని చెప్పి నన్ను పైకి లేపాడు’’ అని తన మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. ధోనీ ఫ్యాన్‌ క్లబ్‌లో సభ్యుడిగా ఉన్నందుకు ఎంతో గర్విస్తున్నాను.. అని తంగరాజ్‌ అంటున్నాడు. చెన్నై జట్టు యాజమాన్యం సైతం పలుమార్లు ఈ ఫ్యాన్‌ క్లబ్‌ గురించి ట్విటర్‌ వేదికగా పోస్టులు చేసింది.

మావాడు గొప్పంటే.. మావాడు గొప్ప అని శత్రుత్వం పెంచుకొని గొడవలకు దిగే అభిమానులకు ఇది స్పూర్తిపాఠమే కదా..!

- ఇంటర్నెట్‌ డెస్క్‌Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన