ఏడేళ్లుగా ఎదురులేని ముంబయి..!

కథనాలు

Updated : 11/11/2020 17:43 IST

ఏడేళ్లుగా ఎదురులేని ముంబయి..!

రోహిత్‌సేన విజయాలకు కారణాలివే..!

‘ప్రస్తుతం రోహిత్‌ సారథ్యంలోని ముంబయి జట్టును ఓడించాలంటే.. మిగతా జట్లన్నీ కలిసి ఒక జట్టుగా ఏర్పడాలి’ నిన్న మ్యాచ్‌ సందర్భంగా ఒక వ్యాఖ్యాత నుంచి వచ్చిన మాట. ఇది ఇతర జట్ల అభిమానులను కాస్త నొప్పించే వాక్యమే అయినా.. నిజానికి అందరిలోనూ ఆలోచన కలిగించేదే. ఎందుకూ అంటే.. 13వ సీజన్‌ టీ20లీగ్‌లో లీగ్‌ మ్యాచ్‌లను మినహాయిస్తే.. ఫైనల్స్‌లో ఢీకొట్టే దమ్ము చూపే జట్టే కరవైంది. ఒక విధంగా చెప్పాలంటే చాలామంది ఈసారి కప్పు ముంబయిదే అని ఫిక్సయిపోయారు కూడా. మిగతా జట్ల విషయానికొస్తే ఒక సీజన్‌లో బలశాలిగా కనిపించిన జట్టే తర్వాతి సీజన్‌లో బలహీనపడి తుస్సుమంటోంది. కానీ.. ముంబయి అలా కాదు.. గత ఏడేళ్లుగా ఎదురులేకుండా దూసుకెళుతోంది. 2013, 2015, 2017, 2019, 2020 సీజన్లలో ఛాంపియన్‌గా నిలిచింది.మరి ముంబయి ఇంతలా రెచ్చిపోవడానికి కారణాలు ఏంటి..? వాళ్ల వెనకాల ఉన్న ధైర్యమేంటి..?

యథా కెప్టెన్‌.. తథా జట్టు
జట్టులో కెప్టెన్‌ ప్రభావం ఆటగాళ్లపై ఉంటుంది. ఒకవేళ అలా లేకపోతే కెప్టెన్‌ సమర్థంగా లేడని అర్థం. ముంబయి జట్టు కెప్టెన్‌గా రోహిత్‌ ప్రభావం ఆటగాళ్లపై స్పష్టంగా కనిపిస్తుంది. ఆ జట్టులో యువఆటగాళ్లను రోహిత్‌ తీర్చిదిద్దిన తీరు అద్భుతం. అందుకే ముంబయి బ్యాటింగ్‌ చేసే సమయంలో పుట్టలోంచి చీమలు వచ్చినట్లుగా బ్యాట్స్‌మెన్‌ వస్తూనే ఉంటారు. బౌలింగ్‌ విషయంలో అంతే.. బౌలర్లు తీవ్రంగా నిరాశపరిచిన రోజులు చాలా అరుదు. ఇక.. జట్టులో స్థానం దొరకని ఆటగాళ్లు మామూలుగా అయితే తీవ్రంగా నిరాశకు గురవుతారు. ఏదో ఒక మ్యాచ్‌లో అవకాశం ఇస్తే.. ఒత్తిడిని తట్టుకోలేక చేతులెత్తేస్తారు. కానీ.. ముంబయి ఆటగాళ్లు అలా కాదు. ఒక్క మ్యాచుల్లో అవకాశం వచ్చినా.. ఎంతో అనుభవం ఉన్నట్లుగా రాణిస్తారు. వాళ్లకు పూర్తి స్వేచ్ఛనిస్తాడు రోహిత్‌. అందుకే కెప్టెన్‌ కోరుకున్నట్లు ఆటగాళ్లు ఆడుతుంటారు.

5వ స్థానం నుంచి 5 టైటిళ్ల వరకు..
ముంబయి ప్రయాణం ఐదో స్థానంతో ప్రారంభమైంది. ఐపీఎల్‌ ప్రారంభంలో ముంబయి జట్టు అసలు పోటీనే కాదన్నట్లుగా ప్రత్యర్థులు భావించేవారు. వాళ్ల అభిప్రాయానికి తగ్గట్లుగానే సచిన్‌ తెందూల్కర్‌, సనత్‌ జయసూర్య, షాన్‌ పొలాన్‌ వంటి దిగ్గజలతో నిండివున్న ముంబయి ప్లేఆఫ్స్‌కు కూడా చేరుకోలేకపోయేది. ప్లేఆఫ్స్‌ రేఖను దాటడానికి ముంబయికి మూడేళ్లు పట్టిందంటే నమ్మగలరా..? 2008లో ఐదో స్థానం, 2009లో 7వ స్థానంతో సరిపెట్టుకుంది. మూడో సీజన్‌లో ప్లేఆఫ్స్‌కు చేరింది. ఆ సీజన్‌లో ఏకంగా ఫైనల్‌కు చేరింది. అయితే.. తుది పోరులో చెన్నై చేతిలో కంగుతిని ఇంటిముఖం పట్టింది.

ఓటమి నేర్పిన పాఠం..
చెన్నై చేతిలో ఓడిన ముంబయి తీవ్రంగా నిరాశపడింది. ఆ ఓటమి నుంచే పాఠం నేర్చుకుంది. అప్పటి నుంచి.. కోచ్‌, ఇతర సిబ్బంది సంవత్సరం పొడగునా ఆటగాళ్లను పరిశీలిస్తూ ఉండాలని జట్టు యాజమాన్యం నిర్ణయించింది. వాళ్లు ఆటగాళ్ల ప్రదర్శనను పరిశీలిస్తూ మరింత మెరుగ్గా తయారు చేయడమే ఈ కార్యక్రమం ఉద్దేశం. దీని ప్రతిఫలమే ఇప్పుడున్న..  బుమ్రా, హార్దిక్‌పాండ్య, సూర్యకుమార్‌యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌, మయాంక్‌ మార్కండే, రాహుల్‌ చాహల్‌ వంటి ఆటగాళ్లు.

ఇక్కడే దశ తిరిగింది..
2013లో సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టోర్నీలో బుమ్రా, పాండ్య బ్రదర్స్‌ అదరగొట్టారు. దేశవాళీ టోర్నీనో కాబట్టి రాణించారు. కానీ ప్రపంచస్థాయి ఆటగాళ్లుండే ఐపీఎల్‌లో నెగ్గుకొస్తారా అని ఇతర ఫ్రాంచైజీలు అనుమానం వ్యక్తం చేశారు. కానీ.. ముంబయి మాత్రం అడుగు ముందుకేసి వాళ్లను కొనుగోలు చేసింది. బుమ్రాను రూ.1.2కోట్లు పెట్టి 2014లో దక్కించుకుంది. అదే సమయంలో పాండ్య సోదరులను కేవలం రూ.10లక్షలకే సొంతం చేసుకుంది. 

‘నలుగురు దేశీ ఆటగాళ్లు’ మంత్రం
ముంబయి జట్టు ఎక్కువగా నాలుగు స్తంభాల వ్యవస్థపై ఆధారపడుతుంది. అవే రోహిత్‌, హార్దిక్‌ పాండ్య, బుమ్రా, కృణాల్‌ పాండ్య. అందుకే ఆ జట్టు ఈ నలుగురికే ఎక్కువ మొత్తం(రూ.41.8కోట్లు) వెచ్చించింది. కేవలం నలుగురు భారత ఆటగాళ్లపై ఇంతమొత్తం ఖర్చు చేసిన మరో జట్టు చెన్నై మాత్రమే.

ముంబయి ఓ లెక్కల మాస్టార్‌..
క్రికెట్‌ అంటే కేవలం భౌతికంగా దృఢంగా ఉంటే సరిపోదు. మానసికంగానూ బలంగా ఉండటం అవసరం. అంటే.. ప్రత్యర్థుల బలాలు, బలహీనతలు తెలుసుకోవాలి. అప్పుడే వాళ్లను ధీటుగా ఎదుర్కోగలం. ముంబయి విజయసూత్రాల్లో ఇదొకటి. సాధారణంగా ఇలాంటి విధానం ఫుట్‌బాల్‌, బేస్‌బాల్‌ వంటి ఆటల్లో మాత్రమే అనుసరిస్తారు. కానీ.. ముంబయి దీన్ని క్రికెట్‌లోకి తీసుకొచ్చింది. ఫలానా బ్యాట్స్‌మెన్‌ను ఔట్‌ చేయాలంటే ఎలాంటి బంతి వేయాలి. పిచ్‌ పరిస్థితులేంటి.. ప్రత్యర్థి ఆటగాళ్ల రికార్డులెలా ఉన్నాయి. ఇలా.. ప్రతీదాన్ని క్షుణ్నంగా పరిశీలించి వాళ్లకు తగ్గట్లుగా ప్రణాళికలు రచించిన తర్వాతే ముంబయి బరిలోకి దిగుతుంది.

తెగింపు నిర్ణయాలు
ఆటగాళ్లపై పెట్టిన ప్రతిపైసాకు ప్రతిఫలం పొందే జట్లలో ముంబయి ఒకటి. ఒక ఆటగాడిపై జట్టు అనవసరంగా ఖర్చు చేస్తుందని భావిస్తే వెంటనే రిజర్వ్‌ బెంచ్‌కి పరిమితం చేసింది. ముంబయి జట్టు ఛాంపియన్‌గా నిలవడంతో కీలకపాత్ర పోషించిన రాయుడును వదులుకోవడం ఇందుకు మంచి ఉదాహరణ. అంతేకాదు.. మ్యాచ్‌ విన్నర్లుగా పేరున్న యువరాజ్‌సింగ్‌, హర్భజన్‌సింగ్‌, లసిత్‌మలింగను ఆ జట్టు ఎన్నో మ్యాచుల్లో రిజర్వ్‌ బెంచ్‌కే పరిమితం చేసింది. రాయుడు స్థానంలో నితిశ్‌ రాణాను తీసుకుంది. అతను అంతగా రాణించకపోవడంతో వెంటనే ఇషాన్‌ కిషన్‌కు అవకాశం ఇచ్చింది.

పరిస్థితులను అర్థం చేసుకోవడం..
ఇవన్నీ ఒకెత్తయితే.. జట్టులో ఆటగాళ్ల ప్రదర్శన మరో ఎత్తు. సీజన్‌ మారే కొద్ది పరిస్థితులు మారుతుంటాయి వాటితో పాటు ప్రాణాళికలూ మారుతుంటాయి. పరిస్థితులకు తగ్గట్లుగా ఆడటమే ముంబయి జట్టు అసలైన బలం. అందుకే ఆ జట్టు ఐపీఎల్‌ చరిత్రలో అత్యుత్తమ జట్టుగా నిలిచింది. 

ఇక ఈ సీజన్‌లో ఆ జట్టు ట్రోఫీ గెలవడానికి కారణాలు ఇవి..
* డికాక్‌ 503 పరుగులు
* ఇషాన్‌ కిషన్‌ 516 పరుగులు, అత్యధిక సిక్సర్లు
* సూర్యకుమార్‌ యాదవ్‌ 480 పరుగులు
* రోహిత్‌శర్మ 332 పరుగులు
* హార్దిక్‌ పాండ్య, పొలార్డ్‌ (229 స్ట్రైక్‌రేట్‌)
* బుమ్రా, బౌల్ట్‌ అత్యధిక వికెట్లు (52వికెట్లు)

- ఇంటర్నెట్‌ డెస్క్‌Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన