ఇండియా చితక్కొడితే ఇండోర్‌ దద్దరిల్లింది.. 

కథనాలు

Updated : 22/12/2020 11:46 IST

ఇండియా చితక్కొడితే ఇండోర్‌ దద్దరిల్లింది..  

‌సెహ్వాగ్‌, రోహిత్‌ల విధ్వంసాలు..

భారత్‌లో పేరు మోసిన క్రికెట్‌ స్టేడియాలు ఏవని అడిగితే వెంటనే గుర్తొచ్చే పేర్లు ఈడెన్‌ గార్డెన్స్‌, వాంఖడే, చెపాక్‌, చిన్నస్వామి, రాజ్‌కోట్‌, ఫిరోజ్‌ షా మైదానాలే. కానీ, ఇండోర్‌లోని హోల్కర్‌ స్టేడియం కూడా ముఖ్యమైనదే. మధ్యప్రదేశ్‌లో ఉన్న ఈ స్టేడియానికి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే టీమ్‌ఇండియా అటు వన్డేల్లో, ఇటు టీ20ల్లో అత్యధిక స్కోర్లు సాధించింది ఇక్కడే. 2011లో వెస్టిండీస్‌పై అత్యధిక వన్డే స్కోర్‌ సాధించిన భారత జట్టు.. 2017లో శ్రీలంకపై పొట్టి క్రికెట్‌లో అదే ఘనత నమోదు చేసింది. ఇది జరిగి నేటికి సరిగ్గా మూడేళ్లైంది. ఈ సందర్భంగా ఆయా మ్యాచ్‌ల విశేషాలేంటో ఓసారి గుర్తు చేసుకుందాం..


రోహిత్‌, రాహుల్‌ ఆకాశమే హద్దుగా..

2017 డిసెంబర్‌ 22న భారత్‌-శ్రీలంక జట్లు రెండో టీ20 మ్యాచ్‌ ఆడాయి. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ ఈ ఫార్మాట్‌లో తన అత్యధిక స్కోర్‌ నమోదు చేసింది. రోహిత్‌ (118; 43 బంతుల్లో 12x4, 10x6), కేఎల్‌ రాహుల్‌ (89; 49 బంతుల్లో 5x4, 8x6) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఇక్కడ రోహిత్‌ సాధించిన సెంచరీ టీ20 ఫార్మాట్‌లో భారత్‌ తరఫున అత్యంత వేగమైనదిగా(35 బంతుల్లో) రికార్డులకెక్కింది. రాహుల్‌తో కలిసి స్టేడియం మొత్తం సిక్సర్ల వర్షం కురిపించాడు. లంక బౌలర్లకు బంతులెక్కడ వేయాలో అర్థం కాకుండా చేశాడు. వీరిద్దరూ చెలరేగడంతో ప్రత్యర్థి ఫీల్డర్లు చూస్తుండిపోయారు. 12 ఓవర్లకే జట్టు స్కోర్‌ 160కి చేరిందంటే ఏ మేరకు విధ్వంసం సృష్టించారో అర్థం చేసుకోవచ్చు. మాథ్యూస్‌ మినహా మిగతా బౌలర్లకు చుక్కలు చూపించారు. వీళ్లిద్దరూ ఇలాగే కొనసాగి ఉంటే జట్టు స్కోర్‌ 300 దాటి కొత్త చరిత్ర సృష్టించేదేమో అనేంతలా బౌండరీలు బాదారు. చివరికి భారత్‌ 260/5 పరుగులు చేసి లంక ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆపై కుశాల్‌ పెరీరా(77; 37 బంతుల్లో 4x4, 7x6), ఉపుల్‌ తరంగ (47 ; 29 బంతుల్లో 3x4, 2x6) ధాటిగా ఆడినా మిగతా బ్యాట్స్‌మెన్‌ కుప్పకూలారు. దీంతో 17.2 ఓవర్లకే 172 పరుగులు చేసి ఆలౌటయ్యారు. 


సచిన్‌ తర్వాత సెహ్వాగ్‌..

ఇక 2011లో డిసెంబర్‌ 8న భారత్‌-వెస్టిండీస్‌ జట్లు అదే హోల్కర్‌ మైదానంలో నాలుగో వన్డే ఆడాయి. టాస్ గెలిచి బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 418 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. ఓపెనర్లు సెహ్వాగ్‌ (219; 149 బంతుల్లో 25x4, 7x6), గౌతమ్‌ గంభీర్‌(67; 67 బంతుల్లో 11x4) మెరుపు ఆరంభమిచ్చారు. వీరిద్దరూ 22 ఓవర్లకే 170 స్కోర్‌ సాధించారు. ఈ క్రమంలోనే గంభీర్‌ ఔటయ్యాక సురేశ్‌ రైనా(55; 44 బంతుల్లో 6x4)తో కలిసి వీరూ మరో కీలక భాగస్వామ్యం నిర్మించాడు. మైదానం నలువైపులా బౌండరీలు బాది అభిమానులను అలరించాడు. దీంతో క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ తర్వాత వన్డేల్లో ద్విశతకం బాదిన ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలోనే భారత్‌ 40 ఓవర్లకే 310 పరుగులు చేసింది. ఆపై వరుసగా వికెట్లు కోల్పోయి చివరికి 418 పరుగులు చేసింది. అనంతరం దినేష్‌ రామ్‌దిన్‌(96; 96 బంతుల్లో 12x4) పోరాడినా మిగతా బ్యాట్స్‌మెన్‌ విఫలమయ్యారు. అలా విండీస్‌ 265 పరుగులకే ఆలౌటైంది. 


మరిన్ని ఆసక్తికర విషయాలు..
* వెస్టిండీస్‌తో తలపడిన వన్డేలో సెహ్వాగ్‌ డబుల్‌ సెంచరీ బాదగా.. ఆ మ్యాచ్‌లో అతడే కెప్టెన్సీ చేపట్టాడు. భారత్‌ 153 పరుగులతో విజయం సాధించింది. 
* ఇక శ్రీలంకతో ఆడిన టీ20 మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ సెంచరీతో అలరించాడు. ఈ మ్యాచ్‌లోనూ అతడే కెప్టెన్సీ చేశాడు. టీమ్‌ఇండియా 88 పరుగుల తేడాతో విజయం సాధించింది.
* టీమ్‌ఇండియా వన్డే, టీ20ల్లో అత్యధిక స్కోర్లు సాధించిన డిసెంబర్‌లోనే టెస్టు క్రికెట్‌లోనూ ఆ ఘనత నమోదు చేసింది. కాకపోతే, అది 2016 డిసెంబర్‌ 19న చెన్నైలోని చిదంబరం స్టేడియంలో. అప్పుడు ఇంగ్లాండ్‌ ప్రత్యర్థి జట్టు. టీమ్‌ఇండియా 759/7 వద్ద తొలి ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. రాహుల్‌(199; 311 బంతుల్లో 16x4, 3x6), కరున్‌ నాయర్‌(303నాటౌట్; 381 బంతుల్లో 32x4, 4x6) సాధించాడు.

- ఇంటర్నెట్‌డెస్క్‌

ఇవీ చదవండి..
36/9 ఊహించలేదు: బుద్ధిని వాడాలి!
8 జట్లతోనే వచ్చే ఐపీఎల్‌!
2020.. కోహ్లీ ఏంటి?Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన