సచిన్‌ ప్రయాణం మొదలైంది ఈరోజే

కథనాలు

Published : 15/11/2020 14:42 IST

సచిన్‌ ప్రయాణం మొదలైంది ఈరోజే

అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన పిన్న వయస్కులు తెలుసా?

సచిన్‌ తెందూల్కర్‌.. ఇదొక క్రికెట్‌ దిగ్గజం పేరు మాత్రమే కాదు. అంతకుమించి. భారత్‌లో ఈ ఆటకే వన్నె తెచ్చిన క్రికెటర్‌. క్రికెట్‌ను క్రీడలా కాకుండా మతంలా మార్చిన ఘనుడు. తనదైన బ్యాటింగ్‌తో ప్రపంచంలోనే మేటి బౌలర్లను ఉతికారేసిన క్రికెట్‌ దేవుడు. మైదానంలో వేలాది పరుగులే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న ఆటగాడు. అలాంటి లిటిల్‌ మాస్టర్‌ తొలిసారి అంతర్జాతీయ వేదికపై అడుగుపెట్టి నేటికి 31 ఏళ్లు పూర్తయ్యాయి. 16 ఏళ్ల ప్రాయంలోనే వసీమ్‌ అక్రమ్‌, వకార్‌ యూనిస్‌, ఇమ్రాన్‌ ఖాన్‌ లాంటి దిగ్గజాలను ఎదుర్కొని ఆపై తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. 24 ఏళ్ల పాటు భారత క్రికెట్‌కు సేవలందించిన సచిన్‌ 2011లో వన్డే ప్రపంచకప్‌ సాధించాక ఆటకు వీడ్కోలు పలికాడు. అయితే, సచిన్‌ కన్నా తక్కువ వయసులోనే పలువురు క్రికెటర్లు అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగు పెట్టారు. వారెవరో తెలుసుకుందాం..

* హసన్‌ రాజా (పాకిస్థాన్‌)
పాకిస్థాన్‌కు చెందిన హసన్‌ రాజా అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత పిన్న వయస్కుడిగా అరంగేట్రం చేసి రికార్డు సృష్టించాడు. 14 ఏళ్ల 227 రోజుల వయసులో 1996లో జింబాబ్వేపై తొలిసారి టెస్టు మ్యాచ్‌ ఆడాడు. అయితే, అప్పుడు మంచి ప్రదర్శన చేయకపోవడంతో రెండేళ్ల తర్వాత ఇంకో అవకాశం వచ్చింది. అది కూడా జింబాబ్వేపైనే. మళ్లీ విఫలమవడంతో ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌కు పరిమితం చేశారు. తర్వాత 2002లో ఆస్ట్రేలియాపై ఒక టెస్టు ఆడగా అందులో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. కానీ వేగంగా పరుగులు చేయలేకపోయాడనే కారణంతో మళ్లీ తప్పించారు. ఇలా 9 ఏళ్ల కెరీర్‌లో కేవలం 7 టెస్టులే ఆడి 26.11 సగటుతో 235 పరుగులు మాత్రమే చేశాడు.

* ముస్తాక్‌ మహ్మద్‌ (పాకిస్థాన్‌)   
అత్యంత పిన్న వయస్కుల జాబితాలో ముస్తాక్‌ మహ్మద్‌ రెండో స్థానంలో నిలిచాడు. ఇతడు 15 ఏళ్ల 124 రోజుల వయసులో 1959లో వెస్టిండీస్‌పై అరంగేట్రం చేశాడు. అయితే, ముస్తాక్‌ ఓ మోస్తారుగా రాణించాడనే చెప్పాలి. మొత్తం 57 టెస్టులు ఆడిన అతడు 39.17 సగటుతో 3,643 పరుగులు చేశాడు. 17 ఏళ్ల ప్రాయంలో తొలి టెస్టు శతకం బాదిన అతడు.. ఆ ఘనత సాధించిన తొలి పిన్న వయస్కుడిగా నిలిచాడు. ఈ రికార్డును 1990లో సచిన్‌ తెందూల్కర్‌ అధిగమించాడు. 

*  మహ్మద్‌ షరీష్‌ (బంగ్లాదేశ్‌) 
బంగ్లాదేశ్‌కు చెందిన మహ్మద్‌ షరీఫ్‌ 15 ఏళ్ల 128 రోజుల వయసులో 2000 సంవత్సరంలో జింబాబ్వేపై టెస్టు అరంగేట్రం చేశాడు. అదే ఏడాది వన్డేల్లోనూ అడుగుపెట్టాడు. అనుకున్నంత స్థాయిలో రాణించకపోవడంతో 7 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో కేవలం 10 టెస్టులు, 9 వన్డేలు మాత్రమే ఆడాడు. అందులోనూ 14, 10 వికెట్లు పడగొట్టాడు. కాగా, షరీఫ్‌ ఈ ఏడాది ఏప్రిల్‌లో అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.

* ఆకిబ్‌ జావెద్‌ (పాకిస్థాన్‌)
ఆకిబ్‌ జావెద్‌ సైతం లిటిల్‌ మాస్టర్‌ కన్నా తక్కువ వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. 16 ఏళ్ల 189 రోజుల వయసులో 1989లో న్యూజిలాండ్‌పై అరంగేట్రం చేశాడు. ఆ కాలంలో వకార్‌ యూనిస్‌, వసీమ్‌ అక్రమ్‌ లాంటి దిగ్గజాలను తట్టుకొని నెట్టుకొచ్చాడు. మొత్తం 22 టెస్టులు ఆడిన ఆకిబ్‌ 54 వికెట్లు పడగొట్టాడు. అలాగే 1992 ప్రపంచకప్‌ ఫైనల్లో ఇంగ్లాండ్‌పై 10 ఓవర్లలో 2/27 ప్రదర్శనతో చాలా పొదుపుగా బౌలింగ్‌ చేశాడు. ఇక 1991లో షార్జా వేదికగా టీమ్‌ఇండియాతో తలపడిన వన్డేలో 7/37 కెరీర్‌లోనే అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. 

* సచిన్‌ తెందూల్కర్‌ (భారత్‌)
16 ఏళ్ల 205 రోజుల వయసులో మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ తెందూల్కర్‌ పాకిస్థాన్‌పై అరంగేట్రం చేశాడు. ఇక 1990లో ఇంగ్లాండ్‌పై 17 ఏళ్ల ప్రాయంలో తొలి శతకం బాదిన అతడు తర్వాత 23 ఏళ్లలో వంద శతకాలు బాదాడు. తన బ్యాటింగ్‌ నైపుణ్యంతో ప్రపంచంలోనే ఆల్‌టైమ్‌ గ్రేటెస్ట్‌ ప్లేయర్‌గా నిలిచాడు. ఒక్క మాటలో చెప్పాలంటే క్రికెట్‌ దేవుడిగా ఎదిగాడు. అలా మొత్తం 200 టెస్టులు, 464 వన్డేలు ఆడిన సచిన్‌ 34,000 వేలకుపైగా అంతర్జాతీయ పరుగులు చేసిన ఏకైక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. టెస్టుల్లో 51, వన్డేల్లో 49 సెంచరీలు బాది శతక వీరుడిగా రికార్డు నెలకొల్పాడు. 

- ఇంటర్నెట్‌డెస్క్‌Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన