టీమ్‌ఇండియాపై పగబట్టాడా?

కథనాలు

Updated : 30/11/2020 16:02 IST

టీమ్‌ఇండియాపై పగబట్టాడా?

వరుస శతకాలతో చెలరేగుతున్న స్టీవ్‌స్మిత్‌..

బాల్‌ టాంపరింగ్‌ వివాదంలో చిక్కుకొని అప్రతిష్ఠ మూటగట్టుకొని ఏడాది పాటు ఆటకు దూరమైనా.. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ స్టీవ్‌స్మిత్‌ తిరిగి సత్తా చాటుతున్నాడు. 2018 మార్చిలో దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌ సందర్భంగా వార్నర్‌తో కలిసి అతడు వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఏడాది పాటు నిషేధానికి గురై గతేడాది వన్డే ప్రపంచకప్‌లో తిరిగి ఆడాడు. తర్వాత వరుస శతకాలతో అలరిస్తున్నాడు. అప్పుడు ఇంగ్లాండ్‌పై మూడు టెస్టుల్లో శతకాలు బాదిన స్మిత్‌.. ఇప్పుడు టీమ్‌ఇండియాపై రెండు సార్లు చెలరేగిపోయాడు. భారత్‌, ఇంగ్లాండ్‌లపై ఇలా వరుస శతకాలు కొట్టడం అతడికి కొత్త కాదు. గతంలోనూ పలు సిరీస్‌ల్లో ఇలాగే ఉతికారేశాడు. ఆ రెండు జట్లంటే పగబట్టిన వాడిలా పరుగుల వరద పారిస్తున్నాడు..


పదకొండింటిలో తొమ్మిది..

స్మిత్‌ టెస్టుల్లో తొలి శతకం బాదింది ఇంగ్లాండ్‌ మీద. 2013-14 సీజన్‌లో ఆ జట్టుపై వరుసగా మూడు శతకాలు బాదగా తర్వాత దక్షిణాఫ్రికాపై ఒక సెంచరీ కొట్టాడు. ఆపై 2014-15 సీజన్‌లో టీమ్‌ఇండియా ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా వరుసగా నాలుగు టెస్టుల్లో రెచ్చిపోయాడు. తర్వాత విండీస్‌పై మరో శతకం బాదిన అదే ఏడాది జులై, ఆగస్టులో ఇంగ్లాండ్‌పై మరో రెండు సెంచరీలు నమోదు చేశాడు. అలా తొలి 11 టెస్టుల్లోనే 9 శతకాలు భారత్‌, ఇంగ్లాండ్‌ మీదే సాధించాడు.


మూడేళ్లుగా రెండు జట్లపైనే..

ఇక 2017 నుంచి ఇప్పటిదాకా స్మిత్‌.. టెస్టుల్లో సాధించిన శతకాల సంఖ్య 9. అవి కూడా భారత్‌, ఇంగ్లాండ్‌పైనే కావడం విశేషం. 2017 ఫిబ్రవరి, మార్చిలో టీమ్‌ఇండియాపై వరుసగా మూడు సెంచరీలు, అదే ఏడాది చివర్లో ఇంగ్లాండ్‌పై మరో మూడు సెంచరీలు బాదాడు. ఈ క్రమంలోనే 2018 మార్చిలో బాల్‌ టాంపరింగ్‌లో వివాదంలో చిక్కుకొని గతేడాది తిరిగి ఆటను ప్రారంభించాడు. వచ్చీ రాగానే యాషెస్‌లో మరో మూడు శతకాలు సాధించాడు.  


వన్డేల్లో టీమ్‌ఇండియానే లక్ష్యం..


టెస్టుల్లో రెండు జట్లపైనే విరుచుకుపడే ఈ ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌.. వన్డేలకు వచ్చే సరికి టీమ్‌ఇండియానే లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే 50 ఓవర్ల ఫార్మాట్‌లో ఇప్పటివరకు అతడు బాదింది 11 శతకాలే అయినా.. అందులో భారత్‌పైనే 5 సాధించడం గమనార్హం. మరీ ముఖ్యంగా ఈ ఏడాది అతడు కొట్టిన మూడు శతకాలు కోహ్లీసేనపైనే. తాజా వన్డే సిరీస్‌లో స్మిత్‌ 105, 104 పరుగులు బాదిన సంగతి పక్కనపెడితే.. ఇకపై జరగాల్సిన మూడో వన్డే, ఆపై టెస్టు సిరీస్‌లో ఎలా చెలరేగుతాడో చూడాలి. ఒకవేళ టెస్టు సిరీస్‌లోనూ భారత బౌలర్లు విఫలమైతే ఈ మాజీ సారథి మరోసారి చుక్కలు చూపించడం ఖాయం.

-ఇంటర్నెట్‌డెస్క్‌Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన