మీకు మసాలా దొరకదు: అజింక్య ఆవేశం!

కథనాలు

Published : 13/02/2021 01:59 IST

మీకు మసాలా దొరకదు: అజింక్య ఆవేశం!

రెండో టెస్టుకు ముందు రహానె మీడియా సమావేశం

చెన్నై: తన ఫామ్‌ గురించి ప్రశ్నించే ముందు రెండేళ్ల గణాంకాలను పరిశీలించాలని టీమ్‌ఇండియా వైస్‌కెప్టెన్‌ అజింక్య రహానె అన్నాడు. తన తత్వానికి భిన్నంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆవేశంతో బదులిచ్చాడు. నాయకత్వ మార్పుతో దేహభాష స్థాయి తగ్గిందా అని ప్రశ్నించగా ‘మీకు మసాలా ఏం దొరకదు’ అని జవాబిచ్చాడు. వసీమ్‌ జాఫర్‌ ఘటనపై అవగాహన లేదన్నాడు. కోహ్లీ ఇప్పటికీ ఎప్పటికీ సారథేనని పేర్కొన్నాడు. రెండో టెస్టుకు సిద్ధం చేసిన పిచ్‌ తొలి రోజు నుంచే టర్న్‌ అవుతుందని వెల్లడించాడు. రెండో టెస్టుకు ముందు అతడు మీడియాతో మాట్లాడాడు.


అస్థిర ఫామ్‌పై..

దాదాపుగా రెండేళ్ల తర్వాత మేం సొంతగడ్డపై సుదీర్ఘ ఫార్మాట్‌ ఆడుతున్నాం. చివరగా మేమిక్కడ దక్షిణాఫ్రికాతో ఆడాం. ఆ సిరీసులో నా స్కోర్లను (59, 115) చూస్తే మీకే అర్థమవుతుంది. ఇక్కడ వ్యక్తిగత ప్రదర్శనలతో సంబంధం లేదు. జట్టు ముఖ్యం. టీమ్‌ఇండియాకు నేనేం చేయాలన్న దానిపైనే నా దృష్టి ఉంటుంది. నా చివరి 10-15 టెస్టులు తీసుకుంటే నా పరుగులు కనిపిస్తాయి. బయటేం జరుగుతుందో తెలుసుకోవాల్సిన అవసరం లేదు. (చివరి 15 మ్యాచుల్లో రహానె దాదాపుగా 1000 పరుగులు చేయడం గమనార్హం.)


దేహభాషపై..

నాయకుడిగా ఉన్నప్పుడు ఒకలా లేనప్పుడు మరోలా దేహభాష ఉండదు. పరిస్థితులను బట్టి ఒక్కోసారి ఒంట్లో నిస్సత్తువ ఆవహిస్తుంది. దానర్థం సారథ్యం వల్ల కలిగిన మార్పని కాదు. నేనింతకు ముందే చెప్పినట్టు మా సారథి విరాట్‌. ఎప్పటికీ అతడే ఉంటాడు. ఒకవేళ మీరు మసాలా (వివాదం) కోసం ఇలాంటి ప్రశ్నలడిగితే మాత్రం దురదృష్టవశాత్తు అది దొరకదు. తొలి టెస్టు మొదటి రెండు రోజుల్లో వికెట్‌లో జీవం లేదు. అలాంటి సందర్భాల్లో కాస్త నిరాశగా అనిపిస్తుంది. ఇంకా మరెన్నో కారణాలు ఉండొచ్చు.


పుజారా స్ట్రైక్‌రేట్‌పై..

చెతేశ్వర్‌ పుజారాలో ఎలాంటి మార్పు లేదు. ఏదేమైనప్పటికీ అతడి బ్యాటింగ్‌ విధానాన్ని ఎవ్వరూ ప్రశ్నించరు. బయట ఏం మాట్లాడుకుంటారనేది మేం పట్టించుకోం. ఆసీస్‌లో అతడి ఆటతీరు, ఇప్పుడున్న ఆటతీరే మాకు ముఖ్యం. అతడు 80 వరకు టెస్టులు ఆడాడు. అతడి ఆటేంటో అతడికే తెలుసు. అతడి సామర్థ్యాన్ని ఎవ్వరూ ప్రశ్నించలేరు.


రోహిత్‌ స్వల్ప స్కోర్లపై..

రోహిత్‌ మా జట్టులో కీలక సభ్యుడు. 100 లేదా 150 గురించి కాదు. ఆసీస్‌లో చాలా బాగా ఆడాడు. కీలక పరుగులు చేశాడు. కేవలం రెండు ఇన్నింగ్సుల్లో ఆడకపోతే చెడ్డ ఆటగాడు అవుతాడా? అతడు గతంలో మ్యాచులు గెలిపించాడు. అతడు కుదురుకుంటే మ్యాచులు గెలిపించగలడని మీకు తెలుసు. ఆటగాళ్లపై నమ్మకం ఉంచాలి.


కొత్త పిచ్‌పై..

తొలి టెస్టుతో పోలిస్తే ఇప్పటి పిచ్‌ భిన్నంగా ఉంది. తొలి రోజు నుంచే బంతి టర్న్‌ అయ్యేలా కనిపిస్తోంది. అయితే తొలి సెషన్‌ చూశాకే దానిపై అవగాహన వస్తుంది. తొలి మ్యాచులో ఏం జరిగిందో మేం మర్చిపోవాలి. ఇక్కడి పరిస్థితులు మాకు తెలుసు. మేం అత్యుత్తమంగా ఆడాలని అనుకుంటున్నాం.


జట్టు కూర్పుపై..

జట్టులో ఎవరెవరు ఉంటారో ఇప్పుడే చెప్పలేం. ఉదయాన్నే తెలుస్తుంది. కూర్పులో ప్రతి ఒక్కరినీ పరిగణనలోకి తీసుకుంటాం. అక్షర్‌ ఫిట్‌నెస్‌ సాధించడం సంతోషకరం. మా స్పిన్నర్లంతా మంచి ప్రదర్శన చేయగలరు. తొలి టెస్టు తొలి రెండు రోజులు పిచ్‌ నుంచి ఎలాంటి సహకారం అందలేదు. అయినా 190 ఓవర్లలో 578 పరుగులే అంటే బాగా బౌలింగ్‌ చేసినట్టే. క్యాచింగ్‌ విషయంలో మేం ఇంకాస్త మెరుగుపడాలి.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన