టీ20 లీగ్‌: 2014-2020కి తేడా ఇదే

కథనాలు

Published : 05/10/2020 11:49 IST

టీ20 లీగ్‌: 2014-2020కి తేడా ఇదే

ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు

క్రికెట్‌ విచిత్రమైన ఆట. ఎప్పుడేం జరుగుతుందో ఊహించలేం. అప్పటిదాకా ఓడిపోతుందనుకున్న జట్టు గెలిచేస్తుంది. కళ్లు చెదిరే సిక్సర్లతో విరుచుకుపడ్డ ఆటగాడు సాధారణ బంతికి ఔటైపోతాడు. మిగతా ఓవర్లలో ధారాళంగా పరుగులిచ్చిన బౌలరే ఆఖరి ఓవర్లో హ్యాట్రిక్‌ వికెట్ల ప్రదర్శన చేసేస్తాడు. యూఏఈ వేదికగా జరుగుతున్న లీగులోనూ అంతే. 2014లో మెరిసినవారు 2020లో విఫలమవుతున్నారు. రెండు వారాలు గడిచాకా అప్పుడెలా ఉంది? ఇప్పుడెలా ఉంది? చూద్దామా!


దుబాయ్‌.. సీన్‌ రివర్స్‌

2014 సీజన్‌లో తొలి 20 మ్యాచులను యూఏఈలో నిర్వహించారు. దుబాయ్‌లో 7 మ్యాచులు జరగ్గా తొలుత బ్యాటింగ్‌ చేసినవి 4, ఛేదనలో 3 గెలిచాయి. ఈ సారి పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. 8 మ్యాచుల్లో తొలుత బ్యాటింగ్‌ చేసినవి 5 గెలిచాయి. ఛేదనలో చెన్నై ఒక్క జట్టే విజయం అందుకుంది. కాగా బెంగళూరు×ముంబయి, దిల్లీ×పంజాబ్‌ మ్యాచులు టై అవ్వడం గమనార్హం. నాడు అబుదాబి 7 మ్యాచులకు ఆతిథ్యమివ్వగా తొలి బ్యాటింగ్‌లో 3, ఛేదనలో 3 గెలిచాయి. ఒక పోరులో సాధారణ, సూపర్‌ఓవర్‌ స్కోర్లు సమం కావడంతో బౌండరీ లెక్క ఆధారంగా విజేతను నిర్ణయించారు. ఈసారి 6 మ్యాచులు ఇక్కడ జరగ్గా తొలి బ్యాటింగ్‌లో 3, మలి బ్యాటింగ్‌లో 3 గెలుపుబాట పట్టాయి. అప్పట్లో షార్జా 6 పోరాటాలకు వేదికగా నిలవగా ఛేదన చేసిన 4 జట్లకు విజయం లభించింది. ఈసారి 4 జరగ్గా తొలి బ్యాటింగ్‌ చేసిన మూడు జట్లు గెలిచాయి.


ముంబయి పైకి.. పంజాబ్‌ కిందకి

గెలుపోటముల పరంగా రెండు జట్ల స్థానాలు తలకిందులు అయ్యాయి. 2014లో పంజాబ్‌ జట్టు అప్రతిహత విజయాలు నమోదు చేసింది. యూఏఈలో ఆడిన ఐదు మ్యాచులో విజయ దుందుభి మోగించి పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. సెహ్వాగ్‌, మాక్స్‌వెల్‌, మిల్లర్‌ దంచికొట్టారు. ఈ సారి మాత్రం ఆ జట్టు పరిస్థితి భిన్నంగా ఉంది. ఆడిన ఐదు మ్యాచుల్లో ఒక్కటే గెలిచింది. నాలుగింట్లో ఓడింది. చిన్నచిన్న మూమెంట్స్‌ గెలుచుంటే నిజానికి రాహుల్‌ సేన ఆరు పాయింట్లైనా దక్కించుకొనేది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ముంబయి ఈ సారి అదరగొడుతోంది. తొలి మ్యాచ్‌ను ఓటమితో ఆరంభించినా ఐదింట్లో మూడు గెలిచి అగ్రస్థానంలో ఉంది. 2014లో రోహిత్‌సేన ఐదుకు ఐదూ ఓడిపోయి నిరాశగా భారత్‌కు బయల్దేరింది. అయితే ఆ తర్వాత వరుస మ్యాచుల్లో అదరగొట్టి ఫ్లేఆఫ్ చేరుకోవడం గమనార్హం.


ధోనీసేన.. ఒడుదొడుకులు

క్రితంసారి ఐదు మ్యాచుల్లో నాలుగు గెలిచి అదరగొట్టిన చెన్నై ఈ సారి ఒడుదొడుకులు ఎదుర్కొంటోంది. తొలి మ్యాచులో ముంబయిపై ఘన విజయం సాధించి వరుసగా మూడింట్లో ఓటమిపాలైంది. ఆదివారం పంజాబ్‌ను 10 వికెట్ల తేడాతో ఓడించి రెండో విజయం అందుకుంది. గతంలో 5 మ్యాచుల్లో 2 గెలిచిన దిల్లీ ఈ సారి 4 ఆడి 3 గెలవడం గమనార్హం. అందులో ఒక సూపర్‌ఓవర్‌ విజయమూ ఉంది. 2014లో విజేతగా అవతరించిన కోల్‌కతా 5కు 2 గెలిచింది. ఈసారి 4కు 2 గెలిచింది. ఆ జట్టులో కొన్ని లోపాలు కనిపిస్తున్నాయి. అప్పట్లో 5కు 3 గెలిచిన రాజస్థాన్‌ ఈసారి 4కు 2 గెలిచి ఉత్సాహంతో ఉరకలేస్తోంది. బెంగళూరులో ప్రదర్శనలోనూ మార్పు కనిపిస్తోంది. ఈసారి 4 సమరాల్లో 3 గెలిచిన కోహ్లీసేన అప్పట్లో ఐదుకు రెండే గెలిచింది. హైదరాబాద్‌ అప్పుడూ.. ఇప్పుడూ ఒకేలా ఉంది. ఐదు ఆడి రెండే గెలిచింది.


మాక్సీ.. కనిపించడేమి

వ్యక్తిగత ప్రదర్శన విషయానికి వస్తే అప్పట్లో కోల్‌కతా ట్రోఫీ అందుకోవడంలో కీలకపాత్ర పోషించిన రాబిన్‌ ఉతప్ప (16 మ్యాచుల్లో 660) ఈసారి ఉసూరుమనిపిస్తున్నాడు. 4 మ్యాచుల్లో 35 పరుగులే చేశాడు. అప్పట్లో భీకరమైన సిక్సర్లు, బౌండరీలతో విరుచుకుపడ్డ మాక్స్‌వెల్‌ (16 మ్యాచుల్లో 552) ఈసారి 5 మ్యాచుల్లో సాధించింది 41 పరుగులే. పంజాబ్‌కే ఆడుతున్న అతడు మ్యాచ్‌ ఫినిషర్‌గా తన ప్రతిభ చూపించడం లేదు. సిక్సర్లు బాదలేకపోతున్నాడు. 2014లో హైదరాబాద్‌ తరఫున 11 మ్యాచుల్లో 166 పరుగులు చేసిన కేఎల్‌ రాహుల్‌ 2020లో విజృంభించి ఆడుతున్నాడు. 5 మ్యాచుల్లోనే 302 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఓ శతకమూ చేశాడీ పంజాబ్‌ సారథి. ప్రస్తుతం చెన్నై జట్టులో వీరోచిత ఫామ్‌లో ఉన్న డుప్లెసిస్‌ అప్పట్లో 15 మ్యాచుల్లో 303 చేస్తే ఇప్పుడు 5 మ్యాచుల్లోనే 282తో రెండో స్థానంలో నిలిచాడు. రోహిత్‌ శర్మ, డేవిడ్‌ వార్నర్‌ అప్పట్లాగే నిలకడగా ఆడుతున్నారు. సంజు శాంసన్‌, దేవదత్‌ పడిక్కల్‌, ఇషాన్‌ కిషన్‌, శ్రేయస్‌ అయ్యర్‌, శుభ్‌మన్‌ గిల్‌ వంటి కుర్రాళ్లు ఈసారి టోర్నీకి కళగా మారారు. నాటితో పోలిస్తే ఇతర బౌలర్లే ప్రస్తుతం బాగా రాణిస్తున్నారు.

-ఇంటర్నెట్‌డెస్క్‌Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన