యుగుర్లను అణచివేసిన నేతకు కీలక పదవి

ప్రధానాంశాలు

Published : 20/10/2021 05:19 IST

యుగుర్లను అణచివేసిన నేతకు కీలక పదవి

టిబెట్‌లో పార్టీ కార్యదర్శిగా నియమించిన  చైనా కమ్యూనిస్టు పార్టీ

బీజింగ్‌: షిన్‌జియాంగ్‌ ప్రాంతంలో యుగుర్‌ ముస్లింలపై తీవ్ర అణచివేతను అమలు చేయడంతో పాటు మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చిన వాంగ్‌ జున్‌ఝెంగ్‌(58)కు చైనా కమ్యూనిస్టు పార్టీ(సీపీసీ) కీలక పదవిని కట్టబెట్టింది. టిబెట్‌ స్వయంప్రతిపత్తి ప్రాంతంలో తమ పార్టీ కార్యదర్శిగా నియమించింది. రెండు నెలల్లో పదవీ విరమణ చేయనున్న వు యింగ్జీ(65) నుంచి వాంగ్‌ ఆ బాధ్యతలను స్వీకరిస్తారని అధికార వార్తా సంస్థ షిన్హువా మంగళవారం వెల్లడించింది. షిన్‌జియాంగ్‌లో పార్టీ ఉప కార్యదర్శిగా, భద్రత విభాగ అధిపతిగా ఉన్న వాంగ్‌ ఆ ప్రాంతంలో యుగుర్ల తిరుగుబాటును అణచివేసే పేరుతో మానవ హక్కుల ఉల్లంఘనకు, సామూహిక హత్యాకాండకు పాల్పడ్డారంటూ అమెరికా, బ్రిటన్‌, ఐరోపా సమాజం, కెనడా ఆయనపై ఆంక్షలు విధించాయి. ఆయా దేశాల ఆరోపణలను తాము లెక్కచేయబోమంటూ వ్యూహాత్మక ప్రాంతమైన టిబెట్‌కు అధినేతగా వాంగ్‌ జున్‌ఝెంగ్‌ను చైనా అధికార పార్టీ పంపించనుంది. బౌద్ధుల గురువు దలైలామా మద్దతుదారులు అధికంగా ఉండే టిబెట్‌పై భద్రతపరంగా మరింత పట్టు బిగించేందుకే సీపీసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపిస్తోందని హాంకాంగ్‌ నుంచి వెలువడే సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్ట్‌ అభిప్రాయపడింది. దలైలామా, అతని మద్దతుదారులను వేర్పాటువాదులుగా చైనా అభివర్ణిస్తుంటుంది. జియాంగ్జి, హునాన్‌, జియాంగ్సు తదితర ప్రావిన్సులకు కూడా కొత్త కార్యదర్శులను సీపీసీ నియమించింది. వచ్చే నెల 8-11తేదీల్లో బీజింగ్‌లో సీపీసీ కేంద్ర కమిటీ ప్లీనరీ సమావేశాలు జరుగనున్నాయి.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన