IPL 2021: ఐపీఎల్‌ వేలంలో అదిరె... ఆటలో బెదిరే

కథనాలు

Published : 05/10/2021 01:36 IST

IPL 2021: ఐపీఎల్‌ వేలంలో అదిరె... ఆటలో బెదిరే

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో అడుగు పెట్టాలని ఈ మధ్య కాలంలో ప్రతి క్రికెటర్‌ కోరుకుంటున్నాడు. ఫ్రాంచైజీలను ఆకట్టుకునేందుకు రంజీ నుంచి అంతర్జాతీయ స్థాయి ఆటగాడి వరకు ప్రతి ఒక్కరూ కష్టపడుతున్నారు. ఒక్కసారి ఐపీఎల్‌ వేలంలో చోటు సంపాదించుకుని ఏదైనా జట్టుకు ఎంపికైతే చాలు ఇక కాసుల వర్షమే. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న లీగుల్లో ఐపీఎల్‌దే అగ్రస్థానం. ఇటు సొమ్ము.. అటు పేరు ప్రఖ్యాతులు దక్కించుకునే అవకాశం ఉంది. మరి అలాంటి ఐపీఎల్‌లో కోట్లు పలికిన అగ్రశ్రేణి ఆటగాళ్లలో కొందరు మరీ తీసికట్టు ప్రదర్శనతో ఇటు ప్రేక్షకులను, అటు ఫ్రాంచైజీలను నిరాశపరుస్తున్నారు. వేలంలో భారీ మొత్తాలను దక్కించుకున్న పలువురు ఆటగాళ్లు వారి స్థాయి ఆటను మాత్రం ప్రదర్శించడం లేదు. మరి అలాంటి క్రికెటర్ల కథాకమీషా ఏంటో ఓసారి చూద్దామా..!

* ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌ వేలంపాటలో అందరినీ ఆశ్చర్యపరుస్తూ టోర్నమెంట్‌ చరిత్రలోనే అత్యధిక ధరను సొంతం చేసుకున్నాడు క్రిస్‌ మోరిస్‌. ఆల్‌రౌండర్‌గా గుర్తింపు ఉన్న మోరిస్‌ను రాజస్థాన్‌ రాయల్స్‌ రూ. 16.25 కోట్లకు దక్కించుకుంది. ఆర్‌ఆర్‌ తరఫున 10 మ్యాచ్‌లు ఆడిన క్రిస్‌ మోరిస్‌ కేవలం 67 పరుగులు మాత్రమే చేశాడు. అయితే 14 వికెట్లను తీసిన మోరిస్‌ బౌలింగ్‌ పరంగా ఫర్వాలేదనిపించాడు. ఈసారి ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో జట్టు విజయాల్లో క్రిస్‌ మోరిస్‌ కీలక పాత్ర పోషించలేకపోతున్నాడు.  

 

* ఆసీస్‌ అత్యుత్తమ బౌలర్లలో ప్యాట్‌ కమిన్స్‌ ఒకడు. 2020 నుంచి కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ తరఫున బరిలోకి దిగుతున్నాడు. ఆ ఏడాది జరిగిన ఐపీఎల్‌ వేలంలో అత్యధిక ధర (రూ. 15.50 కోట్లు) సొంతం చేసుకున్న విదేశీ ఆటగాడిగా రికార్డుకెక్కాడు. అయితే ప్రదర్శనపరంగా పెద్దగా రాణించలేదు. ఈ సీజన్‌లో కోల్‌కతా తరఫున ఇప్పటి వరకు ఏడు మ్యాచుల్లోనే ఆడాడు. తొమ్మిది వికెట్లను మాత్రమే తీశాడు.. చెన్నైతో జరిగిన తొలి మ్యాచ్‌లో బ్యాట్‌తోనూ కమిన్స్‌ (66) రాణించాడు. అయితే భారీ స్కోర్లు నమోదైన ఆ మ్యాచ్‌లో కమిన్స్‌ పోరాడినా విజయం మాత్రం కేకేఆర్‌ను వరించలేదు. 

 

* రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టులో స్టార్‌ ఆటగాళ్లకు కొదవేలేదు. 
* ఏబీ డివిలియర్స్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, జేమీసన్, ఫిన్‌ ఆలెన్‌ వంటి విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. 
* అయితే వీరిలో భారీ మొత్తం వెచ్చించి ఆర్‌సీబీ సొంతం చేసుకున్న మాక్స్‌వెల్‌ (రూ. 14.25 కోట్లు) మినహా ఎవరూ ఆకట్టుకోలేదని చెప్పాలి. మాక్స్‌వెల్ ప్రస్తుత సీజన్‌లో ఇప్పటి వరకు 12 మ్యాచుల్లో నాలుగు వందలకుపైగా పరుగులు చేశాడు. గత సీజన్‌తో పోలిస్తే ఫర్వాలేదనిపించాడు. అయితే మాక్స్‌వెల్‌ తన స్థాయి ఆటను మాత్రం ప్రదర్శించడం లేదు.
*  ఏబీ డివిలియర్స్‌ క్రీజ్‌లో ఉన్నాడంటే ఎంతటి లక్ష్యమైనా కరిగిపోవాల్సిందే. అలాంటిది ఈ సీజన్‌లో పదకొండు మ్యాచులు ఆడిన ఏబీడీ కేవలం 234 పరుగులు మాత్రమే చేశాడు. మిస్టర్‌ 360గా గుర్తింపు పొందిన ఏబీడీ నుంచి మంచి ఇన్నింగ్స్‌ ఏమీ లేవని చెప్పొచ్చు. 

* రూ. 15 కోట్లు వెచ్చించి ఆర్‌సీబీ సొంతం చేసుకున్న కివీస్‌ ఆల్‌రౌండర్‌ కేల్‌ జేమీసన్ తీవ్ర నిరాశపరిచాడు. తొమ్మిది మ్యాచుల్లో కేవలం 65 పరుగులు చేసి.. 9 వికెట్లను మాత్రమే తీశాడు. గతేడాది భారత్‌తోనే అంతర్జాతీయ అరంగేట్రం చేసిన జేమీసన్‌ను ఆర్‌సీబీ భారీ మొత్తానికి దక్కించుకోవడం విశేషం. అయితే తన దారుణమైన ప్రదర్శనతో జేమీసన్ ఆకట్టుకోలేతున్నాడు.  

 

* దాదాపు రూ. 14 కోట్లతో పంజాబ్‌ కింగ్స్‌ దక్కించుకున్న రిచర్డ్‌సన్‌ను ఆ జట్టు ఎక్కువగా వినియోగించుకోలేదు. కేవలం మూడు మ్యాచుల్లోనే ఆడాడు. అయితే ఆడిన మూడింటిలోనూ కేవలం మూడే వికెట్లు పడగొట్టి నిరాశపరిచాడు.  

 

* భారత జట్టుకు కీలక ఆటగాళ్లుగా ఎదుగుతారని భావించిన హార్దిక్‌ పాండ్య, కృనాల్ పాండ్య సోదరులు ప్రస్తుత ఐపీఎల్‌లో పేలవ ప్రదర్శన కనబరుస్తున్నారు. 
* ఇటు బ్యాట్‌తో.. అటు బంతితో రాణించాల్సిన వీరిద్దరూ ఇబ్బంది పడటం చూస్తూనే ఉన్నాం. 
* హార్దిక్‌ పాండ్యను రూ. 11 కోట్లకు, కృనాల్‌ పాండ్యను రూ. 8.80 కోట్లకు ముంబయి ఇండియన్స్‌ సొంతం చేసుకుంది. 
* ప్రస్తుత సీజన్‌లో కృనాల్ పాండ్య ముంబయి తరఫున 12 మ్యాచులు ఆడి కేవలం 134 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్‌లోనూ కృనాల్‌ విఫలమయ్యాడు. కేవలం ఐదు వికెట్లను మాత్రమే తీశాడు.
* హార్దిక్ పాండ్య కూడా పది మ్యాచుల్లో 112 పరుగులు మాత్రమే చేశాడు. ఒక్క వికెట్టూ తీయలేదు. 

 

* సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌లో కీలకమై ఆటగాడు డేవిడ్‌ వార్నర్‌ (₹12.5 కోట్లు), మనీశ్‌ పాండే (₹ 11 కోట్లు) గురించి పెద్దగా చర్చించాల్సిన అవసరం లేదు. బౌలర్లు ఎంత కష్టపడినా బ్యాటింగ్‌లో విఫలమవుతూ పాయింట్ల పట్టికలో చివరి స్థానం ఎస్‌ఆర్‌హెచ్‌ నిలవడానికి ప్రధాన కారణం బ్యాటర్లు. అద్భుత నైపుణ్యం ఉన్నప్పటికీ వీరిద్దరూ విఫలమవుతూ వస్తున్నారు. 

* సీఎస్‌కే బ్యాట్స్‌మెన్ సురేశ్‌ రైనా (₹ 11 కోట్లు) కూడా తన స్థాయి ఆటను ప్రదర్శించలేదు. కేకేఆర్‌ తరఫున సునీల్ నరైన్ (₹12.5 కోట్లు), సీఎస్‌కే తరఫున కృష్ణప్ప గౌతమ్‌ (₹9.25 కోట్లు) భారీ మొత్తం సొంతం చేసుకున్నా ప్రదర్శన మాత్రం అంతంతమాత్రమే.

 

ఐపీఎల్‌ జట్ల సారథుల పరంగా విరాట్‌ కోహ్లీ (ఆర్‌సీబీ), ఎంఎస్ ధోనీ (సీఎస్‌కే), రిషభ్‌ పంత్‌ (దిల్లీ క్యాపిటల్స్‌), రోహిత్ శర్మకు (ముంబయి ఇండియన్స్‌) అత్యధిక పారితోషకం పొందుతున్న వారిలో ముందున్నారు.  ఐపీఎల్‌ వేలంలో వీరు పాల్గొనకపోయినా భారీ మొత్తం దక్కుతోంది.  విరాట్‌ అందరి కంటే ఎక్కువగా రూ. 17 కోట్లను అందుకుంటుండగా,  మిగతా వారు రూ. 15 కోట్ల వరకు పొందుతున్నారు. అయితే వీరి ప్రదర్శన పెద్దగా ఆకట్టుకున్న దాఖలాలు లేవు. అయితే జట్టును నడపడంలో వీరికి వీరే సాటి. అందుకే వారు ఆటపరంగా విఫలమవుతున్నా సరే ఫ్రాంచైజీలు వారి కెప్టెన్సీని మాత్రం కొనసాగిస్తూనే ఉన్నాయి.

-ఇంటర్నెట్‌ డెస్క్Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన