IPL 2021: ధోనీ ‘కింగ్స్‌’... వీళ్లతో మామూలుగా ఉండదు!

కథనాలు

Updated : 12/10/2021 08:39 IST

IPL 2021: ధోనీ ‘కింగ్స్‌’... వీళ్లతో మామూలుగా ఉండదు!

2020 ఐపీఎల్‌ పాయింట్ల పట్టిలో ఆఖరి నుంచి రెండో స్థానం... ఈ ఏడాది ఐపీఎల్‌లో ఫైనల్‌లో తొలి అడుగు. వినడానికి చాలా సులభంగా కనిపిస్తున్న ఈ ఫీట్‌... సాధించడం అంత ఈజీ కాదు. ఎక్కడ పడ్డామో... అక్కడే ఉవ్వెత్తున లేవాలి అని పెద్దలు చెబుతుంటారు. దానిని ధోనీ సూపర్‌ కింగ్స్‌... అదేనండీ చెన్నై సూపర్‌ కింగ్స్‌ చేసి చూపించింది. అసలు ఇదెలా సాధ్యమైంది. పరాజయాల జట్టుగా గతేడాది నిలిచిన చెన్నై ఏం చేసింది. ఎన్నో జట్లకు పాఠం లాంటి ఈ గెలుపు వెనుక ఉన్నదెవరు?

అనుమానాల మధ్యే మొదలు... కానీ

గత సీజన్‌ ఓటమి బాధ, సారథి మహేంద్ర సింగ్‌ ధోనీతో సహా కీలక ఆటగాళ్లకు సరైన ప్రాక్టీస్‌ లేకపోవడం లాంటి సమస్యలతో చెన్నై సూపర్‌కింగ్స్‌ 2021 ఐపీఎల్‌ను ప్రారంభించింది. అందరూ భయపడినట్లే... సీఎస్‌కే ఓటమితోనే ప్రారంభించింది. దీంతో చెన్నై అభిమానుల్లో మళ్లీ అయోమయం నెలకొంది. గతేడాది ప్రదర్శనే పునరావృతం అవుతుందా? అని డీలాపడ్డారు. పులి ఒకడుగు వెనకకు వేసిందంటే... రెండడుగులు ముందుకు వేయడానికే అనే నానుడిని నిజం చేసింది ధోనీ సేన. అభిమానుల నిరాశను పటాపంచలు చేస్తూ వరుస విజయాలతో చెలరేగింది. లీగ్‌ దశలోని 14 మ్యాచుల్లో చెన్నై తొమ్మిది విజయాలు సాధించి... 18 పాయింట్లతో ప్లే ఆఫ్స్‌కు చేరింది. అయితే లీగ్‌ ఆఖరులో ధోనీ సేన కాస్త గతి తప్పింది. లేదంటే విజయాల సంఖ్య మరింత పెరిగేదే. పాయింట్ల పట్టికలో తొలి స్థానంలో నిలిచేదే. 

వల్ల కాదు అన్న చోటే...

ఐపీఎల్‌ టోర్నీలో చెన్నై  తొమ్మిది సార్లు ఫైనల్స్‌కు చేరుకుంది. అంటే ఎంత నిలకడగా ఐపీఎల్‌లో ఆడుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ గత సీజన్‌ చెన్నై విషయంలో పీడకలే అని చెప్పాలి. అప్పటికే డాడీస్‌ ఆర్మీ అంటూ అందరూ చెన్నైని వ్యంగ్యంగా అంటూ ఉండేవారు. అయితే ‘ఈ మాటలు మాకు వర్తించవు’ అంటూ వరుసగా గెలుస్తూ వచ్చింది. చెన్నై స్థానం బలం వల్లనే వరుసగా నెగ్గుతూ వస్తోంది అని విమర్శించిన వాళ్లూ ఉన్నారు. అందుకు తగ్గట్టే 2020 ఐపీఎల్‌లో చెన్నై దారుణంగా పరాజయం పాలైంది. అరబ్‌ పిచ్‌ల మీద ధోనీ పాచికలు పారలేదు. అప్పటివరకు అదరగొట్టిన చెన్నై సింహాలు... కంగుతిన్నాయి. దాంతో చెన్నై టీమ్‌ ‘ఇంట్లో పులి...’ అంటూ మీమ్స్‌ వచ్చాయి. అయితే 2021కి వచ్చేసరికి పడ్డ చోటే... ప్రత్యర్థులను పడగొట్టింది. కీలకమైన క్వాలిఫైయర్‌లో దూకుడుమీదున్న దిల్లీ క్యాపిటల్స్‌ను వెనక్కినెట్టి... తామెందుకు బెస్ట్‌ అనేది నిరూపించుకుంది.

విజయసూత్రం ఇదేనా...

2020లో చెన్నై సూపర్‌కింగ్స్‌ ఓడిపోయినప్పుడు... పెద్దలు చాలామాటలు చెప్పారు. కుర్రాళ్ల విషయంలో టీమ్‌ యాజమాన్యం అంతగా ఆసక్తి చూపించడం లేదు అంటూ.. విమర్శలు చేశారు. ప్రతిసారి సీనియర్ల మంత్రం పని చేయదు అని కూడా అన్నారు. ఈ మాటలు యాజమాన్యం చెవిన పడ్డాయో, లేక తత్వం బోధపడిందో కానీ... యాజమాన్యం చాలా త్వరగా మేలుకొంది. నిజానికి 2020 టోర్నీలో ఆఖరులోనే చెన్నై ‘కొత్త’ మంత్రం జపించింది. కాస్త ఫలితం కూడా కనిపించింది. రుతురాజ్‌ గైక్వాడ్‌ ఫైనల్‌ XIలో తీసుకోకపోవడంపై విమర్శలు వచ్చాయి. వెంటనే తేరుకొని జట్టులోకి తీసుకున్నారు. కొత్త సీజన్‌కి వచ్చేసరికి ఆ ఫార్ములాను కాస్త విస్తరించారని చెప్పుకోవాలి. సీనియర్లు, జూనియర్ల మేళవింపు చక్కగా కుదుర్చుకున్నారు. అలా అని అందరూ కొత్తవారినే నమ్ముకున్నారని కాదు. 

బౌలింగ్‌లో జూనియర్లను, బ్యాటింగ్‌లో సీనియర్లను తీసుకుంటూ వచ్చాడు ధోనీ. మైదానంలో జూనియర్‌ బౌలర్లను సమన్వయం చేసుకునే పనిని డ్వేన్‌ బ్రావో, రవీంద్ర జడేజాకు అప్పగించాడు. ఇక బ్యాటింగ్‌ సంగతికి వచ్చేసరికి రుతురాజ్‌ను తన తురుపుముక్కగా మలచుకున్నారు. రుతురాజ్‌ కూడా కెప్టెన్‌ మనసెరిగి ఆడి... అభిమానుల మనసు గెలుచుకున్నాడు. ఆటగాళ్లపై నమ్మకం ఉంచి ఆడటం చెన్నైకి సాంబారుతో పెట్టిన విద్య. సీజన్‌ ప్రారంభం నుంచి జట్టుతోనే ఉన్నా... రాబిన్‌ ఉతప్పకు మొన్నటి వరకూ అవకాశం లేదు. సురేశ్‌ రైనా గాయపడటంతో జట్టులోకి వచ్చిన ఉతప్ప... నిన్న సరైన సమయానికి ఉతికి ఆరేశాడు. ఇదంతా జట్టు సభ్యుల మీద యాజమాన్యం పెట్టుకున్న నమ్మకాన్ని చూపిస్తుంది.

అదే చెన్నై స్పెషల్‌... 

ఏదైనా జట్టు గెలవాలంటే ఇటు బ్యాటింగ్‌లోనూ.. అటు బౌలింగ్‌లోనూ రాణించాలి. ఒకవేళ బ్యాటింగ్‌లో విఫలమైతే బౌలర్లు ఆ పాత్ర పోషించాలి. బౌలర్లు రాణించకపోతే బ్యాటర్లు లక్ష్యాన్ని ఛేదించేలా ఉండాలి. సరిగ్గా ఇదే సూత్రాన్ని సీఎస్‌కే అమలు చేసినట్లుంది. ఓపెనింగ్‌ భాగస్వామ్యం విఫలమైనప్పుడు ఈ సీజన్‌లో మిడిలార్డర్‌, లోయర్‌ ఆర్డర్‌ బ్యాటర్లు ఆదుకుంటూ వచ్చారు. అలానే బ్యాటింగ్‌లో విఫలమై స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశిస్తే బౌలర్లు రంగంలోకి దిగి జట్టును ఆదుకున్నారు. లక్ష్యం ఎంత పెద్దదైనా సరే తడబాటుకు గురి కాకుండా ఆడటం సీఎస్‌కే స్పెషల్‌. ఆఖరి ఆటగాడి వరకు బ్యాటింగ్‌ చేసే సామర్థ్యం కలిగిన ఏకైక జట్టు సీఎస్‌కేనే. ఈసారి అది స్పష్టంగా కనిపించింది.

ధోనీ... ప్రపంచంలోనే గొప్ప ఫినిషర్‌. ఈ మాటను ఎవరూ కాదనరు. అయితే ఈ ఐపీఎల్‌లో ధోనీలో అలాంటి ఫినిషర్‌ లీగ్‌ దశలో కనిపించలేదు. అయితే సింహం వయసైపోయింది కదా అని... పంజాలో పవర్‌ ఉండదు అనుకోకూడదు. దీనిని తొలి క్వాలిఫైయర్‌ మ్యాచ్‌లో చూపించాడు ధోనీ. సింహం జూలు విదిలిస్తే ఎలా ఉంటుందో ఆదివారం దిల్లీ క్యాపిటల్స్‌కి, అభిమానులకు చూపించారు. ఆరు బంతుల్లో 18 కీలక పరుగులు చేసి జట్టును గెలిపించాడు. ఈ ఇన్నింగ్స్‌ అభిమానుల రెండేళ్ల కల తీర్చింది.  ఏంటి 18 పరుగులే అంత గొప్పా... అంటే విజయానికి అవసరమైన ఒక్క పరుగైనా గొప్పే. అందులోనూ ఫైనల్‌కు వెళ్లే అవకాశం దక్కించిన ఇన్నింగ్స్‌. అలా చెన్నైకి ధోనీ ఎంత బలమో చూపించాడు.  

యాజమాన్యం ఆలోచనా సూపర్‌...

ఒక్క సిరీస్‌లో సరైన ప్రదర్శన ఇవ్వకపోతే, ఇంకా చెప్పాలంటే వరుసగా రెండు, మూడు మ్యాచ్‌ల్లో ప్రదర్శన బాగోలేకపోతే పక్కన పెట్టేస్తున్న ఫ్రాంచైజీలు ఉన్న టోర్నీ ఐపీఎల్‌. గతంలో చాలా ఫ్రాంచైజీలు ఇలా చేశాయి. అయితే చెన్నై సూపర్‌కింగ్స్‌ అలా ఆలోచించలేదు. 2020లో ఆఖరి నుంచి రెండో స్థానంలో జట్టును నిలిపినా... ధోనీపై నమ్మకం ఉంచింది. జట్టుకు ఎవరు అవసరం, ఏం అవసరం అని తన కెప్టెన్‌తో, కోచ్‌ ఫ్లెమింగ్‌ అండ్ టీమ్‌తో యాజమాన్యం నిత్యం టచ్‌లో ఉంది. యాజమాన్యం అలాంటి ఆలోచనతో ఉండటం వల్లే...  ఈ ఏడాది తమ జట్టు ఫైనల్‌కు చేరింది. ధోనీ అండ్‌ కో ఇదే జోరు కొనసాగిస్తే... చెన్నై నాలుగో కప్‌ను ముద్దాడటం ఖాయం.

చెన్నై సూపర్‌ కింగ్స్‌ ప్రస్థానమిదీ... 

🟡 ఐపీఎల్‌ ప్రారంభమైన తొలి ఏడాది 2008లో సీఎస్‌కే రన్నరప్‌గా నిలిచింది. 

🟡 అదే ఫామ్‌ను కొనసాగిస్తూ 2009లో సెమీఫైనల్‌కు చేరుకుంది. అయితే సెమీస్‌లో ఆర్‌సీబీ చేతిలో ఓటమిపాలైంది. 

🟡 ఐపీఎల్‌ 2010లో తొలిసారి ఛాంపియన్‌గా అవతరించింది.

🟡 వరుసగా రెండో ఏడాది ఛాంపియన్‌గా నిలవడం విశేషం. ఐపీఎల్‌ 2011 సీజన్‌ ట్రోఫీని సీఎస్‌కే సొంతం చేసుకుంది.

🟡 ఐపీఎల్‌ 2012, ఐపీఎల్‌ 2013 సీజన్‌లో రన్నరప్‌గా నిలిచింది.

🟡 ఐపీఎల్‌ 2014 సీజన్‌లో ప్లే ఆఫ్స్‌ వరకు వచ్చినా.. పంజాబ్‌ చేతిలో ఓడిపోయింది.

🟡 ఐపీఎల్‌ 2015 తుదిపోరులో ముంబయి ఇండియన్స్‌ చేతిలో చిత్తైంది. రన్నరప్‌గా నిలిచింది.

🟡 రెండేళ్లపాటు నిషేధం. ఐపీఎల్‌ 2016, 2017 సీజన్లకు దూరం.. 

🟡 మళ్లీ ఛాంపియన్‌గా అడుగు పెట్టిన సీఎస్‌కే.. ఐపీఎల్‌ 2018 సీజన్‌ ట్రోఫీని సగర్వంగా ఎత్తుకుంది.

🟡 ఐపీఎల్‌ 2019 సీజన్‌లో మళ్లీ ముంబయి చేతిలో ఓటమిపాలైంది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో సీఎస్‌కే మీద ముంబయి కేవలం ఒకే ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. 

🟡 ఐపీఎల్‌ 2020 సీజన్‌లో ఘోర ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి పడిపోయింది.

🟡 ఇప్పుడు 2021లో ఫైనల్‌లో అడుగుపెట్టిన తొలి జట్టు అయ్యింది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన