Ajinkya Rahane: ద్రవిడ్‌ సలహా నాలో ఎలా ప్రేరణ నింపిందంటే!

కథనాలు

Published : 11/06/2021 01:53 IST

Ajinkya Rahane: ద్రవిడ్‌ సలహా నాలో ఎలా ప్రేరణ నింపిందంటే!

ముంబయి: రాహుల్‌ ద్రవిడ్‌ సలహా తనకు ఎంతగానో ప్రేరణనిచ్చిందని అజింక్య రహానె తెలిపాడు. టీమ్‌ఇండియాకు ఎంపికవ్వడం గురించి అతిగా ఆలోచించొద్దని సూచించారన్నాడు. దేశవాళీ క్రికెట్లో నిలకడగా పరుగులు చేస్తుంటే పిలుపు దానంతటదే వస్తుందని చెప్పారన్నాడు. ఆటపైనే ధ్యాస పెట్టాలని సూచించారన్నాడు. 2007లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అడుగుపెట్టిన రహానె 2013లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే.

‘‘నాకు దులీప్‌ ట్రోఫీ ఫైనల్‌ గుర్తుంది. 2008-09లో మేం సౌత్‌ జోన్‌పై ఆడుతున్నాం. చెన్నైలో జరిగిన ఆ మ్యాచులో రాహుల్‌ ద్రవిడ్‌ ఆడాడు. ఆ మ్యాచులో నేను 165, 98 పరుగులు చేశాను. మ్యాచ్‌ ముగిశాక రాహుల్‌ భాయ్‌ పిలిపించి నాతో మాట్లాడాడు. ‘నువ్వు బాగా పరుగులు చేస్తున్నావని చదివాను. భారత జట్టుకు ఎప్పుడు పిలుపొస్తుందా అని ఆటగాడిగా ఎదురుచూడటం సహజం. నీకు నేను చెప్పేదొక్కటే. ఇప్పుడు చేస్తున్నట్టుగా పరుగులు చేయి. ఏకాగ్రతతో ఆడుతుంటూ పిలుపు దానంతటే వస్తుంది. దాని వెంట పరిగెత్తకు. అదే నిన్ను అనుసరిస్తుంది’’ అని నాతో చెప్పారు’ అని అజింక్య నాటి సంగతులు గుర్తు తెచ్చుకున్నాడు.

‘రాహుల్‌ భాయ్‌ నుంచి అలాంటి సలహా రావడం నాకెంతో ప్రేరణ లభించినట్టుగా అనిపించింది. నేనెంతో స్ఫూర్తి పొందాను. ఆయన ఎన్నో ఎత్తుపల్లాలు చవిచూశారు. ఆ తర్వాత సీజన్లలోనూ నేను 1000+ పరుగులు చేశాను. రెండేళ్ల తర్వాత టీమ్‌ఇండియాకు ఎంపికయ్యాను’ అని రహానె తెలిపాడు. ప్రస్తుతం అతడు జట్టుకు వైస్‌కెప్టెన్‌గా ఉన్న సంగతి తెలిసిందే. కోహ్లీ అడిగినప్పుడల్లా సలహాలు ఇస్తుంటాడు. టాప్‌ ఆర్డర్‌ విఫలమైనప్పుడల్లా నిలబడి పరుగులు చేస్తాడు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన