ఫైనల్‌ చేరిందో.. ముంబయిదే కిరీటం!

కథనాలు

Published : 05/11/2020 08:39 IST

ఫైనల్‌ చేరిందో.. ముంబయిదే కిరీటం!

ఫ్లేఆఫ్స్‌ ప్రవేశపెట్టాక తిరుగులేని రోహిత్‌ సేన

ముంబయి.. ఐపీఎల్‌లో శత్రు దుర్భేద్యమైన జట్టు. ఎవ్వరికైనా హిట్‌మ్యాన్‌ సేనను ఓడించడం కత్తి మీద సామే! ఎందుకంటే ఆ జట్టులో ఉండేవాళ్లంతా మ్యాచులను గెలిపించగల విజేతలే. అందుకే ఆ జట్టు ఫైనల్‌ చేరిందంటే టైటిల్‌ పక్కా అన్నట్టే ఉంటుంది. అందుకు తగ్గట్టే ఆడుతుంది. గతంలోనూ ఇదే జరిగింది. ఐదుసార్లు ఫైనల్‌ చేరితే వరుసగా నాలుగుసార్లు ట్రోఫీని ముద్దాడింది. మరి ఈ సీజన్‌లోనూ ముందుగానే ప్లేఆఫ్స్‌కు చేరుకున్న రోహిత్‌ సేన ఆ సంప్రదాయం కొనసాగించేనా?


ధోనీసేనపై పరుగు తేడాతో..

2019లో ముంబయి తిరుగులేని ఫామ్‌ కనబరిచింది. దిల్లీ, చెన్నైతో పాటు 18 పాయింట్లు సాధించినా +0.421 రన్‌రేట్‌తో అగ్రస్థానంలో నిలిచింది. క్వింటన్‌ డికాక్‌ (529 పరుగులు) జోరు కనబరిచాడు. ఎప్పటిలాగే బుమ్రా (19 వికెట్లు) కీలక పాత్ర పోషించాడు. చిదంబరంలో జరిగిన తొలి క్వాలిఫయర్‌లో చెన్నైని 6 వికెట్ల తేడాతో ఓడించింది ముంబయి. తొలుత బ్యాటింగ్‌ చేసిన ధోనీసేనను 131/4కే పరిమితం చేసింది. సూర్యకుమార్‌ యాదవ్‌ (71*) అజేయంగా నిలవడంతో 18.3 ఓవర్లకే ఛేదనను పూర్తిచేసి ఫైనల్‌కు చేరుకుంది. క్వాలిఫయర్‌-2లో దిల్లీపై గెలిచిన చెన్నైని మళ్లీ ఫైనల్లో ఓడించింది. నిజానికి ఈ ఫైనల్లో అనుభవించిన ఉత్కంఠ గురించి ఎంత చెప్పినా తక్కువే. పొలార్డ్‌ (41*; 25 బంతుల్లో 3×4, 3×6) అండతో మొదట ముంబయి 149/9 పరుగులే చేసింది. మందకొడిగా ఉన్న ఉప్పల్‌ పిచ్‌పై పరుగు తేడాతో విజయం సాధించింది. షేన్‌ వాట్సన్‌ (80) భయపెట్టినా జస్ప్రీత్‌ బుమ్రా (2/14), రాహుల్‌ చాహర్‌ (1/14) అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. చెన్నైకి 12 బంతుల్లో 18 పరుగులు అవసరం కాగా 19వ ఓవర్లో బ్రావోను ఔట్‌ చేసిన బుమ్రా 9 పరుగులే ఇచ్చాడు. ఆఖరి ఓవర్లో.. వాట్సన్‌ రనౌట్‌ కావడం, శార్దూల్‌ ఠాకూర్‌ను మలింగ ఔట్‌ చేయడంతో ముంబయి ట్రోఫీని ముద్దాడింది.


పుణెపైనా.. ఒక్క పరుగుతోనే

2017లో ముంబయి 10 విజయాలు 20 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. క్వాలిఫయర్‌-1లో పుణె చేతిలో 20 పరుగుల తేడాతో ఓడింది. ఛేదనలో పార్థివ్‌ (52) మినహా మరెవ్వరూ 16కు మించి స్కోరు చేయలేదు. అయితే క్వాలిఫయర్‌-2లో కోల్‌కతాపై తిరుగులేని విజయం సాధించి బెంబేలెత్తించింది. కర్ణ్‌శర్మ (4/16), బుమ్రా (3/7) గంభీర్‌ సేనను 107కే కుప్పకూల్చారు. ఆ తర్వాత 14.3 ఓవర్లకే రోహిత్‌సేన ఛేదన పూర్తి చేసేసింది. ఇక ఫైనల్లో పుణెపై మళ్లీ ఒక్క పరుగు తేడాతోనే గెలిచి టైటిల్‌ కొట్టేసింది. దీనికీ ఉప్పల్‌ మైదానమే వేదిక కావడం గమనార్హం. కృనాల్‌ పాండ్య (47) రాణించడంతో తొలుత బ్యాటింగ్‌కు దిగి 129/8 పరుగులే చేసింది. అయితే మిచెల్‌ జాన్సన్‌ (3/26), బుమ్రా (2/26), కర్ణ్‌శర్మ ఛేదనలో పుణె ఆటలు సాగనివ్వలేదు. స్మిత్‌ (51), రహానె (44) మెరిసినా 128కే కట్టడి చేశారు. పుణె విజయానికి ఆఖరి ఓవర్లో 11 పరుగులు అవసరం కాగా మనోజ్‌ తివారీ (7), స్మిత్‌ను జాన్సన్‌ వరుస బంతుల్లో పెవిలియన్‌ చేర్చాడు. ఆఖరి బంతికి 4 పరుగులు అవసరం కాగా 2 పరుగులు అవ్వగానే డాన్‌ క్రిస్టియన్‌ రనౌట్‌ అయ్యాడు. ముంబయి గెలిచింది.


చెన్నై చిత్తు..

2015లో ముంబయి 16 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. క్వాలిఫయర్స్‌లో చెన్నైని 25 పరుగుల తేడాతో చిత్తు చేసింది. 188 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఆ జట్టును 19 ఓవర్లలో 162కే చిత్తుచేసింది. ధోనీ డకౌట్‌ అయ్యాడు. అయితే క్వాలిఫయర్స్‌-2లో బెంగళూరుపై చెన్నై గెలిచింది. ఈ సారి ఆ జట్టును మరింత చిత్తుగా ఓడించింది రోహిత్‌ సేన. ఈడెన్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగి 202/5 పరుగులు చేసింది. సిమన్స్‌ (68), రోహిత్‌ (50), పొలార్డ్‌ (36), రాయుడు (36*) అదరగొట్టారు. లసిత్‌ మలింగ (2/25), మెక్లెనగన్‌ (3/25), హర్భజన్‌ (2/34) దెబ్బకు ధోనీసేన 161/8కే పరిమితమైంది. డ్వేన్‌ స్మిత్‌ (57) టాప్‌ స్కోరర్‌. ధోనీ (18) క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. ముంబయి ఎంత ధాటిగా బౌలింగ్‌ చేసిందంటే.. 15 ఓవర్లకే చెన్నై ఓటమి ఖరారైపోయింది.


మరోసారీ.. చెన్నైకి అదే గతి

2013లో చెన్నై, ముంబయి 11 విజయాలు 22 పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో నిలిచి క్వాలిఫయర్‌-1లో తలపడ్డాయి. ఈ పోరులో ముంబయికి ఘోర పరాభవం ఎదురైంది. చెన్నై నిర్దేశించిన 193 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. 48 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. ధోనీసేనలో మైకెల్‌ హస్సీ (86*), సురేశ్‌ రైనా (82*) అజేయంగా నిలిచారు. అయితే క్వాలిఫయర్‌-2లో రాజస్థాన్‌ను ఓడించిన ముంబయి ఫైనల్లో చెన్నైపై కసిగా ప్రతీకారం తీర్చుకుంది. తమకు అచ్చొచ్చిన ఈడెన్‌లో తొలి టైటిల్‌ను ముద్దాడింది. మొదట ముంబయి 148/9కే పరిమితమైంది. కీరన్‌ పొలార్డ్‌ (60), అంబటి రాయుడు (37) మినహా మిగిలినవారు రాణించలేదు. బ్రావో 4 వికెట్లతో చెలరేగాడు. అయితే ఛేదనలో లసిత్‌ మలింగ (2), మిచెల్‌ జాన్సన్‌ (2), హర్భజన్‌ సింగ్‌ (2) సమష్టిగా అదరగొట్టారు. ధోనీసేనను 125/9కే పరిమితం చేశారు. ధోనీ (63*), మురళీ విజయ్‌ (18), డ్వేన్‌ బ్రావో (15) టాప్‌ స్కోరర్లు.


తొలిసారి పరాజయం

2010లోనూ ముంబయి వీరవిహారం చేసింది. 10 మ్యాచులు గెలిచి 20 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. జట్టు కెప్టెన్‌ సచిన్‌ తెందూల్కర్‌ (618 పరుగులు) అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచాడు. తిరుగులేని ఫామ్‌లో కనిపించాడు. ఈ సీజన్‌లో ప్లేఆఫ్స్‌ లేవు. తొలి సెమీస్‌లో బెంగళూరును 35 పరుగుల తేడాతో ఓడించి ముంబయి ఫైనల్‌ చేరుకుంది. మరో సెమీస్‌లో డెక్కన్‌ను ఓడించిన చెన్నైతో ఫైనల్లో తలపడింది. రైనా (57) ధాటిగా ఆడటంతో తొలుత ధోనీసేన 168/5 పరుగులు చేసింది. ఛేదనలో ఈ మ్యాచ్‌ మలుపులు తిరిగింది. సచిన్‌ (48) ఉన్నంత వరకు ముంబయి గెలుస్తుందనే అనిపించింది. మరోవైపు వరుస వికెట్లు పడటంతో మాస్టర్‌పై ఒత్తిడి పెరిగింది. దూకుడుగా ఆడాల్సి రావడంతో జకాతి బౌలింగ్‌లో ఔటయ్యాడు. అభిషేక్‌ నాయర్‌ (27), పొలార్డ్‌ (27; 10 బంతుల్లో) ఎంత  ప్రయత్నించినా ఓటమి తప్పలేదు. 146/9కే పరిమితమైంది. అయితే ప్లేఆఫ్స్‌ ప్రవేశ పెట్టాక ఫైనల్‌ చేరిన ప్రతిసారీ ముంబయి విజయఢంకా మోగించింది. మరి ఈ సారి ఏం చేస్తుందో చూడాలి.

-ఇంటర్నెట్‌ డెస్క్‌Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన