Pak cricket: ఇమ్రాన్‌ వాచాలత్వం.. పాక్‌ స్వయంకృతం..!

కథనాలు

Updated : 21/09/2021 14:06 IST

Pak cricket: ఇమ్రాన్‌ వాచాలత్వం.. పాక్‌ స్వయంకృతం..!

 ఆ దేశ క్రికెట్‌కు శాపం

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

న్యూజిలాండ్‌ జట్టు ఇటీవల పాక్‌తో జరగాల్సిన క్రికెట్‌ టోర్నీని చివరి నిమిషంలో రద్దు చేసుకొని తిరుగుప్రయాణమైంది. దీంతో ఆ దేశ ఆటగాళ్లు షోయబ్‌ అక్తర్‌, బాబర్‌ ఆజామ్‌, మహ్మద్‌ హఫీజ్‌, కమ్రాన్‌ అక్మల్‌లు న్యూజిలాండ్‌ క్రికెటర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే వారు ఇక్కడ ఒక్క విషయం గమనించ లేదు.. ప్రాణం అంటే ఎవరికి చేదు..? ఓ పక్క పాక్‌ ప్రధాని ‘మా దేశంలో 40 వేల మంది ఉగ్రవాదులున్నారు..’, ‘విదేశీ సంకెళ్లను తెంచుకొన్న అఫ్గాన్‌’, ‘ముజాహుద్దీన్‌లు మా హీరోలు’ అంటూ తాలిబన్‌ నేతలకు పోటీగా ప్రకటనలు చేశారు. అంతేకాదు గతంలో తాలిబన్లతో కలిసి ఫొటోలు దిగిన చరిత్ర కూడా ఇమ్రాన్‌కు ఉంది. ఆయన్ను ప్రత్యర్థులు ‘తాలిబన్‌ ఖాన్‌’ అని పిలుస్తారు. ఇక ఆ దేశ మాజీ క్రీడాకారుడు షాహిద్‌ అఫ్రిదీ కూడా ఇమ్రాన్‌తో గళం కలిపాడు. తాలిబన్లు సానుకూల దృక్పథంతో అధికారంలోకి వచ్చారని పొగడ్తలతో ముంచెత్తారు. గతంలో ఒసామా బిన్‌ లాడెన్‌ తమ హీరో అని పాక్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌ బహిరంగంగానే పేర్కొన్నారు. ఇది వారి భావజాలాన్ని తెలియజేస్తోంది. పాక్‌లో ఉగ్రవాదానికి లభించే మద్దతుకు ఈప్రకటనలే నిదర్శనం. పాక్‌ పెంచి పోషించిన ఉగ్రపాములు ఇప్పుడు ఆ దేశాన్ని కాటేస్తున్నాయి. ఐదు కీలక దేశాల ఇంటెలిజెన్స్‌ అలయన్స్‌ ‘ఫైవ్‌ ఐస్‌’ హెచ్చరికలు వెలువడగానే న్యూజిలాండ్‌ బృందం ఏమాత్రం ఆలోచించకుండా స్వదేశానికి బయల్దేరింది.

దూషాన్‌బేలో షాంఘై కోఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌ సమావేశంలో ఉన్న పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు విషయం తెలిసిన వెంటనే న్యూజిలాండ్‌ ప్రధాని జసెండా అర్డెన్‌కు ఫోన్‌ చేసి మ్యాచ్‌ను కొనసాగించేందుకు ప్రయత్నించారు. కానీ, ఫైవ్‌ఐస్‌ హెచ్చరికల నేపథ్యంలో జసెండా కూడా ఏమీ చేయలేకపోయారు. 4,000 మంది పాక్‌ సైన్యం, ఎస్‌ఎస్‌జీ కమాండోలు, పోలీసులను మోహరిస్తామన్నా ఆమె పట్టించుకోలేదు.

ఏమిటీ ‘ఫైవ్‌ ఐస్‌’..?

ఫైవ్‌ ఐస్‌ అనేది ఐదు దేశాలు కలసి సమష్టిగా ఏర్పాటు చేసుకొన్న ఇంటెలిజెన్స్‌ నెట్‌వర్క్‌. దీనిలో అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్‌లు సభ్య దేశాలు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా, యూకే మధ్య ఇంటెలిజెన్స్‌ మార్పిడీపై చర్చలు జరిగేవి. 1946లో వీరు ఒక ఒప్పందానికి వచ్చారు. ఆ తర్వాత ఈ కూటమిలోకి కెనడా, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాలను కూడా చేర్చారు.  భవిష్యత్తులో మరింత విస్తరించి కొరియా, భారత్‌, జపాన్‌, జర్మనీలను కూడా చేర్చుకోవాలనే చర్చలు జరుగుతున్నాయి. సముద్రాలపై నిఘా, కోవర్ట్‌  సమాచారం, హ్యూమన్‌ ఇంటెలిజెన్స్‌, కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ సమాచారం సేకరిస్తాయి. వీటిని మిత్రదేశాలతో పంచుకొంటాయి.

పాక్‌ సైన్యాన్ని నమ్మవచ్చా..?

ఉగ్రవాదంలో భాగస్వాములు కావడంతోపాటు.. ముష్కరులకు మద్దతు ఇచ్చిన చరిత్ర పాక్‌కు ఉంది. పాక్‌ సైన్యంలోని 4వ కోర్‌ కమాండర్‌గా బాధ్యతలు నిర్వహించిన లెఫ్టినెంట్‌ జనరల్‌ షాహిద్‌ అజిజ్‌ ఏకంగా ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రసంస్థలో చేరాడు. అల్‌ఖైదా, ఐసిస్‌ తరఫున సిరియాలో జరిగిన దాడుల్లో పాల్గొన్నాడు. మాజీ ఐఎస్‌ఐ చీఫ్‌ హమీద్‌ గుల్‌ ఉగ్రవాదానికి అతిపెద్ద మద్దతుదారు. ఉగ్ర సంస్థలతో సంబంధాలు పెట్టుకొని శిక్షలు అనుభవించిన జనరల్స్‌ కూడా పాక్‌ ఆర్మీలో ఉన్నారు. జనరల్‌ జియా ఉల్‌ హక్‌ సమయం నుంచి పాక్‌ సైన్యంలో మత ఛాందసం పెరిగిపోయింది.

మ్యూనిచ్‌ ఒలింపిక్స్‌ తర్వాత పాక్‌లోనే..

1972 సెప్టెంబర్‌ 5,6 తేదీల్లో మ్యూనిచ్‌ ఒలింపిక్స్‌ జరుగుతున్న చోట పాలస్తీనాకు చెందిన ‘బ్లాక్‌ సెప్టెంబర్‌’ ఉగ్రమూక దాడి చేసి ఇజ్రాయెల్‌ క్రీడా బృందంలోని 12 మందిని పాశవికంగా హత్య చేసింది. ఆ ఘటన తర్వాత ఓ క్రీడా బృందాన్ని నేరుగా ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకొన్నది పాకిస్థాన్‌లోనే. 2009 మార్చి 3వ తేదీన లాహోర్‌లోని గడ్డాఫీ మైదానానికి బయల్దేరిన శ్రీలంక బృందంపై ముసుగులు ధరించిన ఉగ్రవాదులు విరుచుకుపడి విచ్చలవిడిగా కాల్పులు జరిపారు. ఈఘటనలో కెప్టెన్‌ మహేల జయవర్దనే, కుమార సంగక్కార, అజెంతా మొండీస్‌, థిల్లాన్‌ సమరవీర, తరంగ పర్వితరాన గయాపడ్డారు. ఆరుగురు సెక్యూరిటీ సిబ్బంది, ఇద్దరు పౌరులు మరణించారు. వెంటనే వీరిని స్టేడియంలోకి తరలించారు. అనంతరం ఒక ఎంఐ-17 హెలికాప్టర్‌లో అక్కడి నుంచి సమీపంలోని వాయుసేన స్థావరానికి చేర్చారు.

ఈ దెబ్బకు 2010లో దక్షిణాఫ్రికా, 2012 డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌ జట్లు పర్యటనలు రద్దు చేసుకొన్నాయి. 2016లో వెస్టిండీస్‌ జట్టు కూడా పర్యటన రద్దు చేసుకొంది. 2019లో తమ దేశంలో ఆడాలన్న పాక్‌ విన్నపాన్ని ఆసీస్‌ జట్టు తిరస్కరించింది. తాజాగా ఇంగ్లాండ్‌ జట్టు కూడా పాక్‌ పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటన చేసింది.

ఉగ్ర లక్ష్యంలోకి న్యూజిలాండ్‌ రెండోసారి..

తాజాగా ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని నిఘా సంస్థల నుంచి హెచ్చరికలు రాగానే న్యూజిలాండ్‌ వేగంగా స్పందించడానికి కారణం ఉంది. గతంలో ఒక సారి ఆ దేశ క్రీడాకారులపై పాక్‌లో ఉగ్రవాదులు దాడికి యత్నించారు. 2002లో న్యూజిలాండ్‌ క్రీడాకారులు కరాచీలోని షెరటాన్‌ హోటల్‌లో ఉన్నారు. అదే సమయంలో ఆ హోటల్‌ బయట బాంబు పేలుడు జరిగింది. ఆ పేలుడులో 10 మంది ఫ్రెంచి ఇంజినీర్లు మరణించారు.  దీంతో ఆ సిరీస్‌ను న్యూజిలాండ్‌ రద్దు చేసుకొంది. తాజాగా మరోసారి ఉగ్రముప్పు ఉండటంతో ముందే స్వదేశానికి వెళ్లిపోయింది.

పెరట్లో పాములు పెంచినందుకు..

పాక్‌ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర దేశంగా అమెరికా మాజీ రక్షణ మంత్రి జేమ్స్‌ మ్యాటిస్‌ అభివర్ణించారు. అక్కడి సమాజం మొత్తం మత ఛాందసవాదంలో మునిగిపోయిందని పేర్కొన్నారు. ఒబామా సమయంలో అమెరికా విదేశంగ శాఖ మంత్రిగా ఉన్న హిల్లరీ క్లింటన్‌ కూడా ఒక సందర్భంలో ‘‘పక్కింటి వాళ్లను కరవాలని పెరట్లో పాములను పెంచుకొంటే.. ఏదో ఒకసారి మనల్ని కూడా కరుస్తాయి’’ అంటూ పాక్‌ను హెచ్చరించారు. ఇప్పుడు ఆ పాములే పాక్‌ను కరుస్తున్నాయి.

పాక్‌ క్రీడాకారులు, నాయకులు న్యూజిలాండ్‌ను నిందించే ముందు ఆత్మపరిశీలన చేసుకొంటే తప్పు ఎక్కడ ఉందో అర్థమవుతుంది. ఓ పక్క తాలిబన్లు అధికారంలోకి వచ్చారని సంబరాలు చేసుకొంటూ.. మరోపక్క మమ్మల్ని ఎవరూ గౌరవించడం లేదంటే ఎలా..? స్వదేశంలో ఉగ్రవాదులను కట్టడి చేయకపోగా.. ప్రోత్సహించే పరిస్థితి ఉంటే ఏదేశం క్రీడాకారుల ప్రాణాలను పణంగా పెట్టి పాక్‌లో పర్యటిస్తుంది?Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన