INDvsWI: 11 మందితో దాదాసేన బౌలింగ్‌

కథనాలు

Published : 19/05/2021 09:27 IST

INDvsWI: 11 మందితో దాదాసేన బౌలింగ్‌

క్రికెట్లో 4సార్లు 11 మందితో బౌలింగ్‌

టెస్టు.. అంతర్జాతీయ క్రికెట్‌కు అసలు సిసలైన నిర్వచనం. సంప్రదాయ క్రికెట్‌కు నిజరూపం. ఇప్పుడంటే టీ20 విస్ఫోటాలు.. సరికొత్త రికార్డులే కనిపిస్తున్నాయి. తరచి చూస్తే సుదీర్ఘ ఫార్మాట్లోనూ వినూత్నమైన సందర్భాలు.. ఘనతలు దర్శనమిస్తాయి. ఒక ఇన్నింగ్స్‌లో వికెట్‌ కీపర్‌ సహా జట్టులోని 11 మందీ బౌలింగ్‌ చేయడం అలాంటిదే. ఇప్పటి వరకు చరిత్రలో నాలుగుసార్లు ఇలా జరిగింది. 14 సార్లు 10 మంది బౌలర్లు బంతులేశారు తెలుసా!


తొలుత ఇంగ్లాండ్‌

జట్టంతా బౌలింగ్‌ చేసిన తొలి సందర్భం ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా మ్యాచులో చోటు చేసుకుంది. 1884, ఆగస్టు 16న ఓవల్‌ మైదానంలో మొదలైందీ టెస్టు. ఆసీస్‌ దెబ్బకు ఇంగ్లాండ్‌ 11 మందిని బౌలింగ్‌కు దించింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ 311 ఓవర్లు ఆడి 551 పరుగులు చేసింది. ఆ జట్టు సారథి బిల్లీ మర్డోక్‌ (211; 525 బంతుల్లో 24×4)  ద్విశతకం బాదేశాడు. ఏకంగా 490 నిమిషాలు క్రీజులో గడిపాడు. అతడికి తోడుగా పెర్సీ మెక్‌డానెల్‌ (103; 168 బంతుల్లో 14×4), టప్‌ స్కాట్‌ (102; 216 బంతుల్లో 15×4) శతకాలు బాదేశారు. మర్డోక్‌ వీరిద్దరితో కలిసి 143; 207 పరుగుల భాగస్వామ్యాలు నెలకొల్పాడు.

అప్పట్లో టెస్టుల్లో డిక్లరేషన్‌ అవకాశం లేదు. దాంతో ఇంగ్లాండ్‌ ప్రత్యర్థిని ఆలౌట్‌ చేసేందుకు 11 మందిని ప్రయోగించింది. విచిత్రంగా వికెట్‌ కీపర్‌ ఆల్ఫ్రెడ్‌ లిట్టెల్‌టన్‌ 12 ఓవర్లు వేసి 19 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు. 5 మొయిడిన్లు విసిరాడు. ఆ జట్టులో ఎక్కువ వికెట్లు తీసిందీ అతడే కావడం ప్రత్యేకం. ఆ తర్వాత ఇంగ్లాండ్‌ 346(f/o), 85/2 చేయడంతో మ్యాచ్‌ డ్రా అయింది. అప్పట్లో ఓవర్‌కు నాలుగు బంతులే ఉండటం గమనార్హం.


ఈసారి ఆసీస్‌కు..

టెస్టు క్రికెట్లో మరోసారి 11 మంది బౌలర్లను ప్రయోగించేందుకు 96 ఏళ్లు పట్టింది. 1980, మార్చి 6న ఫైసలాబాద్‌ వేదికగా పాకిస్థాన్‌, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచులో ఇది చోటు చేసుకుంది. కెప్టెన్‌ గ్రెగ్‌ ఛాపెల్‌ (235; 363 బంతుల్లో 21×4) మారథాన్ ఇన్నింగ్స్‌కు తోడుగా గ్రాహమ్‌ యలోప్‌ (172; 447 బంతుల్లో 19×4) భారీ శతకం చేయడంతో మొదట ఆసీస్‌ 617 పరుగులు చేసింది. మొత్తంగా ఆ జట్టు 211 ఓవర్లు ఆడింది.

పాక్‌ను ఆలౌట్‌ చేసేందుకు మాత్రం ఆసీస్‌ ఇబ్బంది పడింది. వాతావరణం సహకరించకపోవడంతో ఆట సవ్యంగా సాగలేదు. అప్పటికే 0-1తో సిరీస్‌లో వెనకబడటంతో 11 మంది కంగారూలు బౌలింగ్‌ చేయక తప్పలేదు. కానీ ఓపెనర్‌ తస్లీమ్‌ ఆరిఫ్‌ (210*; 379 బంతుల్లో 20×4) అజేయంగా నిలిచాడు. అతడికి కెప్టెన్‌ జావెద్‌ మియాందాద్‌ (106*; 187 బంతుల్లో 10×4, 1×6) తోడుగా నిలిచాడు. 126 ఓవర్లు ఆడిన పాక్‌ 382/2తో నిలిచింది. ఆసీస్‌ 126 ఓవర్లు వేసి తీసింది ఒక్క వికెట్టే. మరొకరు రనౌట్‌ అయ్యారు. దాంతో 11 మందిని ఛాపెల్‌ ప్రయోగించాడు. ఈ మ్యాచ్‌ సైతం డ్రాగానే ముగిసింది.


టీమ్‌ఇండియాకూ తప్పలేదు

సౌరవ్‌ గంగూలీ సారథ్యంలోని టీమ్‌ఇండియాకూ 11 మందిని ప్రయోగించక తప్పని పరిస్థితి వెస్టిండీస్‌పై ఎదురైంది. 2002, మే 10న సెయింట్‌ జాన్స్‌ వేదికగా ఈ మ్యాచ్‌ మొదలైంది. వీవీఎస్‌ లక్ష్మణ్‌ (130; 244 బంతుల్లో 14×4), అజయ్‌ రాత్రా (115*; 284 బంతుల్లో 12×4) శతకాలకు తోడుగా వసీమ్‌ జాఫర్‌ (86), రాహుల్‌ ద్రవిడ్‌ (91) చెలరేగారు. దాంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 196 ఓవర్లకు 513/9కి మూడో రోజు ఉదయం డిక్లేర్‌ చేసింది. ఆతిథ్య జట్టు ఆలౌట్‌ కాకపోవడంలో దాదాసేన ఐదో రోజు వరకు బౌలింగ్‌ చేయాల్సి వచ్చింది.

మొత్తం 11 మంది కలిసి 248 ఓవర్లు విసిరారు. టీమ్‌ఇండియా స్పెషలిస్టు బౌలర్లు ప్రతి ఒక్కరు 45+ ఓవర్లు విసిరారు. దవడకు గాయం కావడంతో కుంబ్లే 14 ఓవర్లే వేశాడు. అతడి స్థానాన్ని సచిన్‌ భర్తీ చేశాడు. 34 ఓవర్లు వేశాడు. వీవీఎస్‌ లక్ష్మణ్‌ (17 ఓవర్లు), రాహుల్‌ ద్రవిడ్‌ (11 ఓవర్లు), వసీమ్‌ జాఫర్‌ (11 ఓవర్లు), శివ సుందర్‌దాస్‌ (8 ఓవర్లు), అజయ్‌ రాత్రా (1 ఓవర్‌) సైతం బంతి అందుకోక తప్పలేదు. విండీస్‌లో కార్ల్‌ హూపర్‌ (136), శివనరైన్‌ చందర్‌పాల్‌ (136*), రిడ్లే జాకబ్స్‌ (118) శతకాలు బాదేశారు. కరీబియన్‌ జట్టు ఐదో రోజు ఆఖర్లో 629/9 వద్ద ఇన్నింగ్స్‌ డిక్లేర్ చేసింది. ఫలితంగా మ్యాచ్‌ డ్రా అయింది. పిచ్‌ ఫ్లాట్‌గా ఉండటంతో బౌలర్లకు శ్రమ తప్పలేదు.


అదే సెయింట్‌ జాన్స్‌లో..

అదే సెయింట్‌ జాన్స్‌ ఫ్లాట్‌ వికెట్‌పై దక్షిణాఫ్రికాకూ 11 మంది బౌలర్లను ప్రయోగించాల్సి వచ్చింది. 2005, ఏప్రిల్‌ 29న ఈ మ్యాచ్‌ మొదలైంది. ఏబీ డివిలియర్స్‌ (114), గ్రేమ్‌ స్మిత్‌ (126), జాక్వెస్‌ కలిస్‌ (147), అష్వెల్‌ ప్రిన్స్‌ (131) శతకాలు బాదేశారు. దాంతో 163 ఓవర్లకు 588/6 వద్ద సఫారీలు తొలి ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేశారు. ఆ తర్వాత విండీస్‌ను ఆలౌట్‌ చేసేందుకు మాత్రం చుక్కలు కనిపించాయి.

క్రిస్‌గేల్‌ (317; 483 బంతుల్లో 37×4, 3×6) త్రిశతకంతో దాడి చేశాడు. రామ్‌నరేశ్‌ శర్వాన్‌ (127), శివనరైన్‌ చందర్‌పాల్‌ (127), డ్వేన్‌ బ్రావో (107) శతకాల జోరు కనబరిచారు. ఆ జట్టును ఆలౌట్‌ చేసేందుకు దక్షిణాఫ్రికా 11 మందిని ప్రయోగించింది. 235.2 ఓవర్లు వేయించింది. కరీబియన్లు ఏకంగా 747 పరుగులు సాధించాడు. సమయం ఉండటంతో సఫారీలు రెండో ఇన్నింగ్స్‌ మొదలు పెట్టారు. 127/1 పరుగులు చేయగానే ఐదోరోజు ఆట ముగిసింది. మ్యాచ్‌ డ్రా అయింది.  ఆ తర్వాత ఇంగ్లాండ్‌ 4, భారత్‌ 3, పాక్‌ 3, విండీస్‌ 3, ఆసీస్‌ ఒక సారి 10 మంది బౌలర్లను ప్రయోగించడం గమనార్హం.

-ఇంటర్నెట్‌ డెస్క్‌Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన