దాదా విధ్వంసం.. రిమోట్‌ కంట్రోల్‌ కెప్టెన్సీ వివాదం

కథనాలు

Updated : 15/05/2021 21:04 IST

దాదా విధ్వంసం.. రిమోట్‌ కంట్రోల్‌ కెప్టెన్సీ వివాదం

 IND vs SA పోరులో ‘ఇయర్‌ పీస్‌’ వ్యవహారం

ఒకవైపు కోల్‌కతా రాకుమారుడి విధ్వంసం.. మరోవైపు అతిగొప్ప ఆల్‌రౌండర్‌ క్లాస్‌ బ్యాటింగ్‌.. ఇంకోవైపు రిమోట్‌ కంట్రోల్‌ కెప్టెన్సీ వివాదం.. ఆఖరి వరకు విజయం కోసం పోరాడిన రెండు జట్లు.. ఒక్క  ఓవర్‌లోనే ఫలితం మార్చేసిన బ్యాటర్లు.. 1999, మే 15న వన్డే ప్రపంచకప్‌లో భారత్‌, దక్షిణాఫ్రికా పోరు గురించి ఎంత చెప్పినా తక్కువే!


‘ప్రిన్స్‌’ విధ్వంసం

బ్రైటాన్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచులో మొదట టీమ్‌ఇండియానే బ్యాటింగ్‌ చేసింది. 5 వికెట్ల నష్టానికి 253 పరుగులు సాధించింది. ఐదు అద్భుతమైన బౌండరీలతో మంచి టచ్‌లో కనిపించిన సచిన్‌ (28; 46 బంతుల్లో 5×4)ను క్లూసెనర్‌ (3/66) జట్టు స్కోరు 67 వద్ద పెవిలియన్‌ పంపించాడు. మరో ఎండ్‌లో మాత్రం కోల్‌కతా ప్రిన్స్‌ సౌరవ్‌ గంగూలీ (97; 142 బంతుల్లో 11×4, 1×6) రాహుల్‌ ద్రవిడ్‌ (54; 75 బంతుల్లో 5×4)తో కలిసి విధ్వంసం సృష్టించాడు. ససెక్స్‌కు ఇదే మైదానంలో ఆడిన అనుభవం దాదా సొంతం. పైగా అతడికి వందో మ్యాచ్‌ కూడా. దాంతో అతడి స్ట్రోక్‌ ప్లే అదిరింది. ఆడిన డ్రైవ్స్‌లో అందం ఉట్టిపడింది. బంతులు మైదానాన్ని ముద్దాడుతూ బౌండరీకి వెళ్లాయి. నిక్కీ బోజ్‌ బౌలింగ్‌ను ఉతికారేశాడు. అయితే అలన్‌ డొనాల్డ్‌ కట్టుదిట్టమైన బంతులతో విరుచుకు పడుతున్నాడు. 90 పరుగులు దాటాక ఆందోళన గురైన గంగూలీ.. జాంటీ అద్భుత త్రోకు రనౌట్‌ అయ్యాడు. ఆ తర్వాత జట్టులో మరెవ్వరూ ఎక్కువగా ఆడలేదు.


కలిస్‌ ‘క్లాస్’

దక్షిణాఫ్రికా ఛేదన అత్యంత ఉత్కంఠకరంగా సాగింది. టీమ్‌ఇండియా పేసర్‌ జవగళ్‌ శ్రీనాథ్‌ వేగంలో డొనాల్డ్‌ను తలపించాడు. ఓపెనర్లు గ్యారీ కిర్‌స్టన్‌ (3), హర్షలె గిబ్స్‌ (7)ను పెవిలియన్‌ పంపించేశాడు. కానీ మేటి ఆల్‌రౌండర్‌ జాక్వెస్‌ కలిస్‌ (96; 128 బంతుల్లో 7×4) క్లాస్‌తో కదం తొక్కాడు. మార్క్‌ బౌచర్‌(34), కలినన్‌ (19), హన్సీ క్రో (27)తో కలిసి మంచి భాగస్వామ్యాలు నెలకొల్పాడు. టాప్‌ ఆర్డర్‌ పడ్డా మిడిలార్డర్‌ నిలవడంతో గంగూలీ, సచిన్‌, రాబిన్‌ సింగ్‌ బంతులు వేశారు. కలిస్‌ సింగిల్స్‌, డబుల్స్‌తో పరుగులు చేస్తూనే ఉన్నాడు. అగార్కర్‌ బౌలింగ్‌తోనూ పనవ్వడం లేదు.


ఆ ఓవర్లో ‘తుపాన్‌’

శ్రీనాథ్‌ విసిరిన 46 ఓవర్లో టీమ్‌ఇండియాకు బ్రేక్‌ వచ్చింది. నాలుగో బంతికి పరుగు తీసే క్రమంలో ప్రసాద్‌ విసిరిన త్రోకు కలిస్‌ రనౌట్‌ అయ్యాడు.  45.4 ఓవర్లకు సఫారీలు 227/6తో నిలిచారు. తర్వాత బంతికి జాంటీ రోడ్స్‌ (39*; 31 బంతుల్లో 5×4) సింగిల్‌ తీయగా ఆఖరి బంతిని క్లూసెనర్‌ (12*; 4 బంతుల్లో 3×4) బౌండరీకి పంపించాడు. స్కోరు 232/6కు చేరింది. సమీకరణం 24 బంతుల్లో 22 పరుగులుగా మారింది. బంతిని అగార్కర్‌కు ఇచ్చారు. కానీ రోడ్స్‌, క్లూసెనర్‌ 4 బౌండరీలతో తుపాను సృష్టించారు. 17 పరుగులు సాధించి స్కోరు బోర్డును 249/6కు తీసుకెళ్లారు. ఆ తర్వాత దక్షిణాఫ్రికా విజయానికి మరెంతో సేపు పట్టలేదు.


రిమోట్‌ కంట్రోల్‌ ‘కెప్టెన్సీ’

ఈ మ్యాచులో క్రికెట్‌ ప్రపంచాన్ని నివ్వెరపరిచిన విషయం మరొకటుంది. అదే ‘రిమోట్‌ కంట్రోల్‌ కెప్టెన్సీ’. సాధారణంగా వ్యూహాలను మ్యాచ్‌కు ముందే రచించుకొని జట్టంతా మైదానంలోకి అడుగుపెడుతుంది. మార్పులేమైనా ఉంటే డ్రింక్స్‌ సమయంలో అదనపు ఆటగాళ్లతో సందేశాలు పంపిస్తుంటారు. కానీ ఇక్కడ దక్షిణాఫ్రికా అధునాతన సాంకేతికతను వాడి విస్మయపరిచింది. కెప్టెన్‌ హాన్సీ క్రో, బౌలర్‌ అలన్‌ డొనాల్డ్‌ తమ చెవుల్లో ఇయర్‌ పీస్‌లు ధరించి మైదానంలో ఆడారు. వారికి కోచ్‌ బాబ్‌ వూమర్‌ సందర్భానికి తగినట్టు ఆదేశాలు ఇచ్చాడు. దీనిని మ్యాచ్‌ రిఫరీ తలాత్‌ అలీ గమనించి డ్రింక్స్‌ బ్రేక్‌ సమయంలో వారిపై కోప్పడ్డాడు. ఆ తర్వాత సలహాలు అందించే అలాంటి సాంకేతిక వస్తువులు వాడకుండా ఐసీసీ నిబంధన తీసుకొచ్చింది.

- ఇంటర్నెట్‌ డెస్క్‌Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన