India vs Srilanka: వీళ్లుంటే.. సెంచరీల మోతే! 

కథనాలు

Updated : 07/07/2021 09:20 IST

India vs Srilanka: వీళ్లుంటే.. సెంచరీల మోతే! 

రెండు జట్ల టాప్‌-6 శతక వీరులు

శ్రీలంకతో పోరంటే చాలు టీమ్‌ఇండియా క్రికెటర్లకు ఎక్కడలేని ఊపొచ్చేస్తుంది. శతకాల మీద శతకాలు బాదేస్తారు. పరుగుల వరద పారిస్తారు. సచిన్‌ నుంచి కోహ్లీ వరకు సెంచరీల మోత మోగించారు. లంకేయులు మాత్రం తక్కువేం కాదు! కలిసొచ్చిన ప్రతిసారీ మూడంకెల స్కోర్లు సాధించారు. మరికొన్ని రోజుల్లో ఈ రెండు జట్ల మధ్య వన్డే సిరీసు ఆరంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో టాప్‌-5 సెంచరీ వీరులు ఎవరో తెలుసుకుందామా!


విరాటే ముందు..

అంతర్జాతీయ క్రికెట్లో పరుగుల రారాజుగా అవతరించాడు విరాట్‌ కోహ్లీ. అతడు అరంగేట్రం చేసింది శ్రీలంక పైనే. అందుకే ఆ జట్టంటే అతడికి ప్రత్యేక అభిమానం! వారితో ఎక్కడ మ్యాచులు జరిగినా సెంచరీల మోత మోగిస్తాడు. కేవలం 47 మ్యాచుల్లోనే 60 సగటు, 90.61 స్ట్రైక్‌రేట్‌తో 2220 పరుగులు సాధించాడు. 8 శతకాలు, 11 అర్ధశతకాలు అందుకున్నాడు. 2009, డిసెంబర్‌ 24న కోల్‌కతా వేదికగా తొలిసారి ఆ జట్టుపై సెంచరీ (107) కొట్టాడు. 2012, ఫిబ్రవరి 28న అత్యధిక పరుగులు 133*తో చెలరేగాడు. ఆ తర్వాత దొరికిన ప్రతి సిరీసులో అతడు శతకాలు బాదేశాడు.


మాస్టర్‌ ‘బ్లాస్టర్‌’

లంకేయులపై భారత్‌ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఒకే ఒక్కడు సచిన్ తెందూల్కర్‌. 84 వన్డేల్లో 43.84 సగటు, 87.54 స్ట్రైక్‌రేట్‌తో ఏకంగా 3113 పరుగులు చేశాడు. ఇక సెంచరీలు పరంగానూ మాస్టర్‌ బ్లాస్టర్‌ ముందున్నాడు. ఎనిమిదిసార్లు మూడంకెల స్కోరు అందుకున్నాడు. 17 అర్ధశతకాలు సాధించాడు. 1995, ఏప్రిల్‌ 9న షార్జాలో లంకపై మొదటి సెంచరీ 112* చేశాడు. 2009, సెప్టెంబర్‌ 14న అత్యధిక స్కోరు 138 సాధించాడు. ఒకప్పుడు లంకలో అద్భుతమైన పేసర్లు, స్పిన్నర్లు ఉండేవారు. వారిని కాచుకొని ఇన్ని సెంచరీలు చేయడమంటే అది సచిన్‌కే చెల్లుతుంది.


వి‘జయ’ సూర్య

ఈ రెండు జట్ల పోరాటాల్లో అత్యధిక సెంచరీలు చేసిన మూడో వ్యక్తి సనత్‌ జయసూర్య. 7 శతకాలు, 14 అర్ధశతకాలు బాదేశాడు. లంక తరఫున సుదీర్ఘ కాలం ఆడిన జయసూర్య ఎలాంటి విధ్వంసాలు సృష్టిస్తాడో అందరికీ తెలిసిందే. మొత్తంగా 89 మ్యాచులాడి 36.23 సగటు, 96.98 స్ట్రైక్‌రేట్‌తో 2899 పరుగులు చేయడం గమనార్హం. అత్యధిక స్కోరు 189. వన్డేల్లో 28 శతకాలు చేసిన సనత్‌ 7 టీమ్‌ఇండియాపై చేశాడు. 2000లో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌పై అతడి శతకాన్ని ఎంత వర్ణించినా తక్కువే. కేవలం 161 బంతుల్లోనే 189 పరుగులు చేశాడు. ఆ జట్టు చేసిన 299 పరుగుల్లో 189 అతడివే కావడం గమనార్హం.


గౌతీ.. లంకపై ప్రీతి

టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్‌ గౌతమ్ గంభీర్‌కూ లంకపై మంచి రికార్డు ఉంది. అతడు 6 శతకాలు బాదేశాడు మరి. ఆ జట్టుపై 37 మ్యాచులు ఆడిన గౌతీ 50.54 సగటు, 88.62 స్ట్రైక్‌రేట్‌తో 1668 పరుగులు చేశాడు. గంభీర్‌ తన వన్డే కెరీర్లో చేసిన శతకాల సంఖ్య 11. అందులో 7 లంకపైనే చేయడం గమనార్హం. అతడి అత్యధిక స్కోర్లు రెండు 150*, 150 లంకేయులపైనే చేశాడు. 2009, డిసెంబర్‌ 24న లంక నిర్దేశించిన 316 పరుగుల లక్ష్య ఛేదనలో గౌతీ దంచికొట్టాడు. అదే ఏడాది ఫిబ్రవరిలో ప్రేమదాస స్టేడియంలో 150తో చెలరేగాడు. ఆసియాకప్‌ జరిగిన ఢాకా, కామన్వెల్త్‌ బ్యాంక్‌ సిరీస్‌ జరిగిన బ్రిస్బేన్‌లో లంకపై సెంచరీలు కొట్టాడు.


రో‘హిట్‌’ మ్యానే

లంకేయులపై రోహిత్‌ శర్మ అనుబంధం గురించి ఎంత చెప్పినా తక్కువే. అతడి మూడు డబుల్‌ సెంచరీలలో రెండు శ్రీలంకపైనే చేయడం ప్రత్యేకం. ఇప్పటి వరకు ఆ జట్టుపై అతడు 6 సెంచరీలు, 5 హాఫ్‌ సెంచరీలు చేశాడు. మొత్తం 46 మ్యాచుల్లో 93.22 స్ట్రైక్‌రేట్‌, 46.25 సగటుతో 1665 పరుగులు సాధించాడు. 2014, నవంబర్‌ 13న ఈడెన్‌గార్డెన్‌లో అతడు సృష్టించిన సునామీ ఎవరూ మర్చిపోరు. 173 బంతుల్లో 33 బౌండరీలు, 9 సిక్సర్లతో 264 పరుగులు చేశాడు. 2017, డిసెంబర్‌ 13న మొహాలిలో 153 బంతుల్లోనే 13 బౌండరీలు, 12 సిక్సర్లతో 208* సాధించాడు. అదే ఏడాది ఆగస్టు 27న 124*, 31న 104తో నిలిచాడు. 2019 ప్రపంచకప్‌లో చేసిన శతకమూ గుర్తుండిపోతుంది.


మరో ‘మిస్టర్‌ కూల్‌’

ప్రపంచం మెచ్చిన మరో ‘మిస్టర్‌ కూల్’ కుమార సంగక్కర. శ్రీలంక క్రికెట్‌కు సుదీర్ఘకాలం సేవలు అందించాడు. టీమ్‌ఇండియాపై అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. అతడు టీమ్‌ఇండియాపై 6 సెంచరీలు, 18 అర్ధశతకాలు నమోదు చేశాడు. మొత్తంగా 76 మ్యాచుల్లో 39.70 సగటు, 81.62 స్ట్రైక్‌రేట్‌తో 2700 పరుగులు సాధించాడు. భారత్‌పై అత్యధిక స్కోరు 138*. 2005, అక్టోబర్‌ 31న జైపుర్‌లో సాధించాడు. ఆపై ఏటా కనీసం ఒక శతకం సాధిస్తూ వెళ్లాడు.

- ఇంటర్నెట్‌ డెస్క్‌Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన