కోహ్లీ.. ఈ గుండెకోత తీరేదెలా?

కథనాలు

Updated : 09/11/2020 11:55 IST

కోహ్లీ.. ఈ గుండెకోత తీరేదెలా?

కీలక సమరాల్లో చేతులెత్తేస్తున్న నాయకుడు

కొత్త కెప్టెన్‌ రావాల్సిందేనా!

ఆధునిక క్రికెట్లో ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌.. నిలకడకు మరో పేరు.. కొండంత లక్ష్యాన్నైనా సునాయసంగా కరిగించే ఛేదన రారాజు.. ఫీల్డింగ్‌లో చిరుత.. ఫిట్‌నెస్‌లో సాటిలేని మేటి. ఆటగాడిగా అంతా ఓకే!

కానీ.. సారథిగానే అంచనాలు అందుకోవడం లేదు. నాయకుడిగా విజయం వైపు నడిపించడం లేదు. నాకౌట్లలో మెరవడం లేదు. లీగు మ్యాచుల్లో రికార్డులు బద్దలు కొట్టేస్తున్నా కీలక సమరాల్లో చేతులెత్తేస్తున్నాడు. విచిత్రమైన నిర్ణయాలతో అటు టీమ్‌ఇండియా ఇటు బెంగళూరు అభిమానులకు గుండెకోతను మిగిలిస్తున్నాడు విరాట్‌ కోహ్లీ.


ప్చ్‌.. ఈ సాలా కప్‌ నమదే!

‘ఈ సాలా కప్‌ నమదే’ అనే కన్నడ వాక్యానికి ‘ఈ సారి కప్‌ మనదే’ అర్థమని తెలుగు పాఠకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. ఎందుకంటే విరాట్‌ కోహ్లీ క్రేజ్‌ వల్ల ఆ నాలుగు పదాలపై దేశవ్యాప్తంగా అందరికీ అవగాహన ఉంది. ఏటా ఐపీఎల్‌ ఆరంభంలో ఇదే నినాదంతో రావడం.. ఆఖర్లో బొక్కబోర్లా పడటం.. నిరాశగా వెనుదిరగడం.. అభిమానులకు గుండెకోత మిగిల్చడం ఒక అలవాటుగా మారిపోయింది. తాజా సీజన్లో కీలకమైన ఎలిమినేటర్లో ఓడిన కోహ్లీసేనను చూసి బెంగళూరు, విరాట్‌ అభిమానులు ఎలా? ఎంతగా బాధపడుతున్నారో ఊహించుకోవచ్చు. గొప్ప గొప్ప ఆటగాళ్లుండీ 13 సీజన్లలో ఒక్కసారీ ట్రోఫీ అందుకోకపోతే ఎంతగా కుమిలిపోతారో అర్థం చేసుకోవచ్చు. ఇంకేం చేస్తే గెలుస్తారోనని డైహార్డ్‌ ఫ్యాన్సైతే కన్నీరే పెట్టుకుంటున్నారు! సారథిని మార్చండని అభిమానులూ చెప్పలేరు.. ఇటు యాజమాన్యమూ ఆ సాహసం చేయలేదు. చివరికి టైటిలూ దక్కక విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది ఆర్‌సీబీ.


ఆటగాడిగా అదుర్స్‌

ఆటగాడిగా కోహ్లీ గొప్పదనం గురించి అందరికీ తెలుసు. 2016 సీజన్లో అతడి పరుగుల వరద, శతకాల జోరును ఎవ్వరూ మర్చిపోలేరు. ఇండియన్‌ టీ20 లీగులో 192 మ్యాచులాడిన అతడు 38.16 సగటు, 130.73 స్ట్రైక్‌రేట్‌తో 5,878 పరుగులు చేశాడు. 5 శతకాలు, 39 అర్ధశతకాలూ సాధించాడు. ఎన్నో రికార్డులు సృష్టించాడు. 2020లోనైతే 15 మ్యాచుల్లో 466 పరుగులు చేశాడు. నిజానికి ఐపీఎల్‌లో పరుగుల పరంగా కోహ్లీని మించిన ఆటగాడు మరొకరు లేనేలేరు. ఎన్నో రికార్డులు అతడి పేరిట లిఖించాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో 416 మ్యాచుల్లో 56.15 సగటు, 80.22 స్ట్రైక్‌రేట్‌తో 21,901 పరుగులు చేశాడు. 70 శతకాలు, 104 అర్ధశతకాలు, 2185 బౌండరీలు, 219 సిక్సర్లు బాదేశాడు. ఆటగాడిగా 235 మ్యాచుల్లో 10,475, కెప్టెన్‌గా 181 మ్యాచుల్లో 11,426 పరుగులు సాధించాడు. సారథిగానూ ఒత్తిడి లేకుండా పరుగులు చేశాడు.


నాకౌట్స్‌లో విఫలం

బ్యాట్స్‌మన్‌గా తిరుగులేని ప్రదర్శన కనబరుస్తున్న కోహ్లీ నాయకుడిగా కీలక సందర్భాల్లో విఫలమవుతున్నాడు. ద్వైపాక్షిక సిరీసులు గెలవడం, లీగు మ్యాచుల్లో విజయ దుందుభి మోగించడం పక్కనపెడితే ఐపీఎల్‌ ఫ్లేఆఫ్స్‌, ఐసీసీ వన్డే, టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌లు, ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌ వంటి మ్యాచుల్లో అభిమానులకు గుండెకోత మిగిలించాడు. టోర్నీ సాంతం అదరగొట్టిన జట్టు కీలక మ్యాచుల్లో చేతులెత్తేస్తే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. కోహ్లీ నాయకత్వంలో టీమ్‌ఇండియా మంచి విజయాలే సాధించింది. ఆటగాళ్లంతా సమష్టిగానే పోరాడుతున్నారు. కానీ కొన్ని వ్యూహాలు, మార్పులు సహచరుల ఆటతీరుపై ప్రభావం చూపిస్తున్నట్టు అర్థమవుతోంది. రోహిత్‌ శర్మతో అభిప్రాయబేధాలూ, అప్పటి కోచ్‌ కుంబ్లేతో పడకపోవడం ఈ కోణంలో చూడాల్సినవే.


నాయకత్వ ధోరణి విచిత్రం

సాధారణంగా విరాట్‌ కోహ్లీ ప్రతి మ్యాచుకూ ఆటగాళ్లను మార్చేస్తాడు. రెండు మూడేళ్లుగా విశ్లేషకులు దీనిపై ఎంతగానో మొత్తుకున్నారు. అతడు మాత్రం ఆపిందేమీ లేదు. వరుసగా రెండు మ్యాచుల్లో ఒకే జట్టుతో బరిలోకి దిగిన సందర్భాలు అత్యంత అరుదు. లీగు మ్యాచుల్లో అదరగొట్టిన వారిని క్వార్టర్‌ ఫైనల్‌, సెమీ ఫైనల్స్‌లో పక్కన పెట్టేస్తాడు! ఇలాంటి మార్పుల వల్ల కేఎల్‌ రాహుల్‌ గతంలో ఎంతో ఇబ్బంది పడ్డాడు. తుది జట్టులో తనకు చోటు ఉంటుందో ఉండదోనన్న బెంగతో ఆత్మవిశ్వాసం కోల్పోయాడు. ఇదే నొప్పిని మరికొందరు ఆటగాళ్లూ అనుభవించారు. మందకొడి, పేస్‌, బౌన్స్‌ పిచ్‌లపై రహానెకు మంచి రికార్డుంది. అతడిని పరిమిత ఓవర్ల క్రికెట్‌ నుంచి పూర్తిగా పక్కన పెట్టేశారు. ప్రపంచకప్‌లో అతడు నాలుగో స్థానంలో ఆడుంటే పరిస్థితి మరోలా ఉండేదేమో!

టెస్టుల్లో స్ట్రైక్‌రేట్‌ తక్కువుందన్న సాకుతో నయావాల్‌ ఛెతేశ్వర్‌ పుజారానే ఓ మ్యాచులో పక్కన పెట్టేశాడు. ఇక మణికట్టు స్పిన్నర్లు ఉన్నారని అశ్విన్‌, జడ్డూలను వన్డేలకు తీసుకోవడమే మానేశాడు. కొన్ని అనూహ్య పరిస్థితుల వల్ల జడేజా ప్రపంచకప్‌కు ఎంపికయ్యాడు. తాజాగా హైదరాబాద్‌తో ప్లేఆఫ్స్‌లో కోహ్లీ మూడు మార్పులు చేశాడు. మొయిన్‌ అలీ వల్ల కలిగిన ఉపయోగమేమీ కనిపించలేదు. ఇక ఫించ్‌ను కాదని ఓపెనింగ్‌కు దిగి త్వరగా ఔటయ్యాడు. మైదానంలో నిర్ణయాలు తీసుకోవడంలోనూ ఇబ్బంది పడ్డాడు. కొన్నిసార్లు పిచ్‌ను అర్థం చేసుకోవడంలో విఫమవుతున్నట్టు అనిపిస్తోంది. ఎందుకంటే బ్యాటింగ్‌ చేయాల్సిన చోట బౌలింగ్‌.. బౌలింగ్‌ చేయాల్సినప్పుడు బ్యాటింగ్‌ ఎంచుకున్న సందర్భాలు ఉన్నాయి. 2017 ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌ ఇందుకు ఉదాహరణ.


కెప్టెన్‌ను  మార్చేనా?

ఐపీఎల్‌లో అరంగేట్రం చేసినప్పటి నుంచీ విరాట్‌ కోహ్లీ బెంగళూరుకే ఆడుతున్నాడు. యువకుడిగా మొదలైన అతడి ప్రస్థానం సారథిగా మలుపు తిరిగింది. 2013లో జట్టు బాధ్యతలు తీసుకొని ప్రతిసారీ భారీ అంచనాల నడుమే అడుగుపెట్టాడు. కానీ విఫలమయ్యాడు. ఎప్పుడూ జట్టులో ఏదో ఒక లోపం ఉండనే ఉంటోంది. తొలుత బ్యాటింగ్‌ విభాగానికి మాత్రమే ప్రాధాన్యం ఉండేది. బౌలింగ్‌ విభాగాన్ని బలోపేతం చేసుకోనే లేదు. ఇప్పటికీ ఆ జట్టులో మంచి విదేశీ పేసర్‌ కనిపించడం లేదు. ఇక క్రిస్‌గేల్‌, ఏబీ డివిలియర్స్‌, కేఎల్‌ రాహుల్‌ వంటి భీకరమైన బ్యాట్స్‌మన్‌ ఉన్నా గెలుపు బాట పట్టింది లేదు. కోహ్లీ, ఏబీ ఔటైతే చాలు.. జట్టు పనైపోయినట్టే కనిపిస్తోంది. ఎనిమిదేళ్ల కోహ్లీ సారథ్యంలో ఫైనళ్లు ఆడినప్పటికీ బెంగళూరు సాధించిందేమీ కనిపించడం లేదు. అందుకే ‘బెంగళూరు కాబట్టి కోహ్లీని కెప్టెన్‌గా ఉంచుతోంది. మరో జట్టైతే కచ్చితంగా తీసేసేది’ అన్న గంభీర్‌ వ్యాఖ్యలు నిజమనిపిస్తున్నాయి. ఇదే సమయంలో ధోనీ, రోహిత్‌ ఏం సాధించారో కనిపిస్తూనే ఉంది. కోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్నా ఒక్కసారీ ట్రోఫీ రాని పరిస్థితుల్లో బెంగళూరు తన కెప్టెన్‌ను మార్చేనా? ఈ గుండెకోతను ఆపేనా? మరో ఆరు నెలలు వేచి చూడాల్సిందే మరి!

- ఇంటర్నెట్‌ డెస్క్‌Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన