Variety Rules in Olympics: చిత్రం.. అయ్యారే ఒలింపిక్స్‌ విచిత్రం!

కథనాలు

Updated : 23/07/2021 10:10 IST

Variety Rules in Olympics: చిత్రం.. అయ్యారే ఒలింపిక్స్‌ విచిత్రం!

ఒలింపిక్స్‌లో వింత నిబంధనలు ఇవీ..

గోళ్లకి రంగు వేసుకోవద్దు.. గెడ్డం క్లీన్‌ షేవ్‌ చేసుకోవాలి... స్కర్టులే ధరించాలి.. ఏంటి ఇవన్నీ? ఒలింపిక్స్‌లో నిబంధనలండీ. వింతగా, హాస్యాస్పదంగా ఉన్న ఇలాంటి మనకు తెలియని రూల్స్‌ ఎన్నో ఉన్నాయి. ఓసారి వాటిపై ఓ లుక్కేద్దామా!

* ఏ విభాగంలో పోటీ పడుతున్నా బాక్సర్లు తప్పకుండా క్లీన్‌ షేవ్‌తో ఉండాలి. మరీ తప్పదనకుంటే పెన్సిల్‌ కట్‌ మీసాలతో బరిలో దిగడానికి మాత్రం అనుమతిస్తారు.

* జిమ్నాస్టిక్స్‌లో పాల్గొనే జిమ్నాస్ట్‌లు వేలి గోళ్లకి రంగురంగుల నెయిల్‌ పాలిష్‌ వేసుకోవడానికి నిబంధనలు ఒప్పుకోవు. మొహానికి కలర్‌ఫుల్‌ మేకప్‌ వేసుకున్నా ఓకే గానీ గోళ్లకి మాత్రం నో!

* అన్యాయం జరిగిందనో, జడ్జీలు తక్కువ మార్కులు వేశారనో.. క్రీడాకారులు ధర్నాలు చేస్తామంటే కుదరదు. ఈ తరహా నిరసనలు పూర్తిగా నిషిద్ధం. మైదానాలు, కోర్టులు, బౌట్‌లు, ఈతకొలనులే కాదు.. క్రీడా గ్రామంలో ఎక్కడా తన అసంతృప్తి వెళ్లగక్కడానికి అనుమతించరు.

* స్కేటింగ్‌లో మగ ఫిగర్‌ స్కేటర్లు బిగుతైన, ఒంటికి అతుక్కుపోయే దుస్తులు ధరిస్తారని భావిస్తుంటాం. కానీ మన అంచనా తప్పు. వీళ్లు కేవలం ట్రౌజర్లు మాత్రమే ధరించాలనే నిబంధన ఉంది. దీనికి భిన్నంగా మహిళా స్కేటర్లు తప్పనిసరిగా స్కర్టులే వేసుకోవాలి.

* పతకం నెగ్గిన ఆనందంలో పోటీ పడుతున్న ఫీల్డ్‌లో.. ఫొటోలు, వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేయడం నిషేధం. ఆ మాటకొస్తే పోటీలో ఉండే ఆటగాళ్లతోపాటు కేవలం కోచ్‌ మాత్రమే ఆ పరిసరాల్లోకి రావడానికి అనుమతి ఉంటుంది.

* ఎవరైనా స్విమ్మర్‌ వరల్డ్‌ రికార్డు సృష్టిస్తే ఆటోమేటిగ్గా ఆ రికార్డు నమోదు కాదు. ఆ అథ్లెట్‌ వాళ్ల రికార్డును ఫ్యాక్స్‌ చేయాల్సి ఉంటుంది.

* రెజ్లర్లు తప్పనిసరిగా తమ వెంట ఒక రుమాలు (కర్చీఫ్‌) ఉంచుకోవాల్సిందే. దీన్ని ‘బ్లడ్రాగ్‌’ అంటారు. ఆటలో గాయాలు తగిలి రక్తం కారుతుంటే తుడుచుకోవడానికట.

* వాటర్‌ పోలో గేమ్‌లో ఆట మొదలవడానికి ముందే తప్పనిసరిగా క్రీడాకారుల కాలి, చేతివేళ్లు పరిశీలిస్తారు. గోళ్లు పెద్దవిగా ఉంటే కత్తిరిస్తారు. అనవసర గాయాలు కాకుండా ఉండటానికే ఇలా చేస్తారు.

* బీచ్‌ వాలీబాల్‌లో తప్పనిసరిగా బికినీలు ధరించాల్సిందే. ఆ బికినీలోని బాటమ్‌ పరిమాణం 7 సెంటీమీటర్లకన్నా మించి ఉండకూడదు. చిత్రంగా ఉంది కదూ!

* ఈక్వెస్ట్రియన్‌ అంటే గుర్రాలతో విన్యాసాలు చేసే ఆట. పోటీ ముగిసేంతవరకు ఆటగాడు నోరు తెరవకూడదు. గుర్రాన్ని కనీసం అదిలించకూడదు. నిబంధన మీరితే పోటీలో చివరి స్థానం ఇస్తారు.

* బీచ్‌ వాలీబాల్‌లో క్రీడాకారులు తమకి నచ్చిన యూనిఫాం వేసుకోవచ్చు. ఒకవేళ రెండు జట్లూ ఒకే రంగువి ఇష్టపడితే నాణెంతో టాస్‌ వేసి ఎవరు ఏం వేసుకోవాలో తేలుస్తారు.

* డైవర్లు డైవింగ్‌ చేసేముందు బోల్డ్‌గా, ఆత్మవిశ్వాసంతో కనిపించాలి. ఏమాత్రం నెర్వస్‌గా ఉన్నా, భయపడతున్నా.. రెండున్నర పాయింట్ల కోత విధిస్తారు. ఆత్మవిశ్వాసం లేకపోతే పాయింట్ల కోత.. భలే చిత్రంగా ఉంది కదూ!



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన